అభయ ప్రదాత

10 Jan, 2019 07:18 IST|Sakshi
ఇచ్ఛాపురంలో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిచేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర అనే మహోన్నత అధ్యాయం ముగిసింది. పేదలకు తమకంటూ ఓ నాయకుడు ఉన్నాడన్న నమ్మకం కలిగించింది. త్వరలోనే కష్టాలన్నీ పరిష్కారమవుతాయనే భరోసా ఇచ్చింది. యాత్ర చివరి రోజైన బుధవారం ఇచ్ఛాపురంలో జరిగిన పాదయాత్రలో సామాన్యులతో పాటు వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులు రాజన్న బిడ్డను కలిసి తమ ఆవేదనలు, ఆకాంక్షలు విన్నవించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అందరి సమస్యలు పరిష్కరిస్తానని జగన్‌ అభయమివ్వడంతో వారంతా సంతోషం వ్యక్తం చేశారు.

 సౌదీ అరేబియా నుంచి వచ్చా..
చంద్రబాబు చేసిన అవినీతి సొమ్ముతో ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని నిర్మించుకోవచ్చు. అంతటి అవినీతిని ప్రజలకు తెలిసేలా అవినీతి చక్రవర్తి పేరిట ఆధారాలతో సహా పుస్తక రూపంలో ప్రజలందరికి అందుబాటులోనికి తీసుకురావడం శుభపరిణామం. రాబోయే ఎన్నికల్లో ప్రజలు జగన్‌మోహన్‌ రెడ్డిని గెలిపించి రాజన్న రాజ్యం తీసుకురావాలి.  సౌదీఅరేబియాలో ఉద్యోగం చేస్తున్న నేను ఈ ప్రజాసంకల్పయాత్ర ముగింపు సభకు ఇక్కడికి వచ్చాను.– హర్షద్‌ అయూబ్, పులివెందుల
 
నిరుద్యోగులకు తీరని నష్టం
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులు పూర్తిగా నష్టపోయారు. ఏటా డీఎస్సీ అని, ఎన్నికలు వస్తున్నాయని ఆదరాబాదరాగా పరీక్షలు నిర్వహించడం వల్ల చాలా మంది నిరుద్యోగులు నష్టపోతున్నారు. నాలుగేళ్లుగా నోటిఫికేషన్లు రాక చాలామంది అర్హత కోల్పోయారు. ప్రభుత్వ శాఖాల్లో కాంట్రాక్టు విధానంలో భర్తీ చేసిన ఉద్యోగాలను టీడీపీ నాయకులు వారి చెప్పిన వారికే కేటాయించుకొని మరింతగా మోసం చేశారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది.– సప్ప చిరంజీవి, ఇచ్ఛాపురం

జగనన్న హామీలతో భరోసా
ప్రజలకు భరోసా జగనన్న హామీలే. జనసంద్రంతో ఇచ్ఛాపురం ఉప్పొంగింది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అనడానికి లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలే ఉదాహరణ. ముగింపు సభకు మేమంతా ఎంతో ఉత్సాహంగా ఇక్కడకు వచ్చాం. సగం గెలుపు ఇక్కడే అన్నది జగనన్న మాటలు, వరాల్లో స్పష్టమైంది.–  పెద్దిశెటి శేఖర్,వైఎస్సార్‌సీపీ యువజన అధ్యక్షుడు, పరవాడ, విశాఖపట్నం

మైనార్టీలకు వరం
మైనార్టీలకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఓ వరంగా మేమంతా భావిస్తున్నాం. ప్రజాసంకల్ప యాత్రలో మైనార్టీలకు సబ్‌ప్లాన్, బడుగు, బలహీన వర్గాల ముస్లింలకు ఆయన ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. జగన్‌మోహన్‌రెడ్డితో మా బతుకులు బాగుపడతాయన్నది ముమ్మాటికీ నిజం. ముస్లిం సోదరులంతా వైఎస్సార్‌ సీపీ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది.
  – షేక్‌ మహబూబ్‌ బాషా,నంద్యాల, కర్నూలు జిల్లా

మరిన్ని వార్తలు