25నే సిక్కోలు గడ్డపై తొలి అడుగు

19 Nov, 2018 07:37 IST|Sakshi

పాలకొండ నియోజకవర్గం నుంచి ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభం

28వ తేదీన పాలకొండలో తొలి బహిరంగ సభ

ప్రజా సంకల్ప యాత్ర తుదివరకూ విజయవంతం చేయాలి

జననేతకు అపూర్వ స్వాగతం పలకాలని ప్రజల ఎదురుచూపు

ఇచ్ఛాపురంలో ముగింపు సభతో దుష్ట పాలకులపై సమరభేరి

తిత్లీ తుఫాన్‌ బాధితులకు తప్పకుండా జగన్‌ పరామర్శ

వైఎస్సార్‌ సీపీ రీజనల్‌ కో ఆర్డినేటర్‌ భూమన కరుణాకర్‌రెడ్డి వెల్లడి  

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీ అబద్ధపు హామీల అసలు రంగు బయటపెట్టి, ముఖ్యమంత్రి చంద్రబాబు మాయోపాయాలను భగ్నం చేయడమే గాకుండా కష్టనష్టాల్లో ఉన్న నాలుగున్నర కోట్ల ప్రజల సంక్షేమ సాధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్పయాత్ర ఈనెల 25వ తేదీన జిల్లాలో అడుగిడనుంది. ప్రస్తుతం విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో సాగుతున్న ఈ పాదయాత్ర వచ్చే ఆదివారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత వీరఘట్టం మండలం మీదుగా జిల్లాలోని పాలకొండ నియోజకవర్గంలోకి రానుంది. ప్రజానేత జగన్‌కు అపూర్వ స్వాగతం పలకడానికి శ్రీకాకుళం ప్రజలు ఎదురుచూస్తున్నారు.

ఈ పాదయాత్రఏర్పాట్లపై చర్చించేందుకు వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం సాయంత్రం శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగింది. పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ శ్రీకాకుళం–విజయనగరం జిల్లాల రీజనల్‌ కోఆర్డినేటర్‌ భూమన కరుణాకర్‌రెడ్డి, పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ ధర్మాన ప్రసాదరావు, పీఏసీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పాతపట్నం నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి శాంతి, పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, రాజాం, పాలకొండ ఎమ్మెల్యేలు కంబాల జోగులు, విశ్వాసరాయి కళావతి, పార్టీ నియోజకవర్గాల సమన్వయకర్తలు పేరాడ తిలక్, సీదిరి అప్పలరాజు, గొర్లె కిరణ్, ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్‌ సతీమణి విజయ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నర్తు రామారావు తదితర నాయకులంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ, గత ఏడాది నవంబరు ఆరో తేదీన వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమైన జగన్‌ ప్రజాసంకల్పయాత్ర గుంటూరు జిల్లాలోకి అడుగుపెట్టేసరికి ఉప్పెనలా మారిందన్నారు.

కృష్ణా, గోదావరి బ్రిడ్జిలపై నుంచి సాగిన పాదయాత్రలో జనం పోటెత్తారని గుర్తు చేశారు. ఇలా రోజురోజుకు పెరుగుతున్న అమోఘమైన ప్రజాదరణను చూసే టీడీపీ పాలకులు ఓర్వలేకపోయారని అన్నారు. టీడీపీ కంచుకోటగా చెప్పుకునే ఉత్తరాంధ్రలో సైతం వైజాగ్, విజయనగరం జిల్లాల్లో ప్రజాసంకల్ప యాత్ర నభూతో నభవిష్యతి అన్న రీతిలో సాగిందని వివరించారు. అంతకుమించిన రీతిలో శ్రీకాకుళం జిల్లాలోనూ ధర్మాన, తమ్మినేని వంటి ఉద్ధండ నాయకుల నేతృత్వంలో విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే 2003లో నాటి ప్రతిపక్షనేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి నిర్వహించిన పాదయాత్రకు శ్రీకాకుళం ప్రజలు నీరాజనం పట్టారని భూమన గుర్తు చేశారు. ఆ స్ఫూర్తితోనే ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా జిల్లాలో జరిగే ప్రతి బహిరంగ సభనూ దిగ్విజయంగా నిర్వహించడానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు. ఇచ్ఛాపురంలో ముగింపు సభనూ విజయవంతం చేయడం ద్వారా దుష్టపాలకులపై సమరభేరి మోగించాలని పిలుపునిచ్చారు. తిత్లీ తుఫానుతో జిల్లాలో నష్టపోయిన బాధితులందర్నీ జగన్‌మోహన్‌రెడ్డి తప్పకుండా పరామర్శిస్తారని చెప్పారు. తండ్రి రాజశేఖరరెడ్డి మాదిరిగానే జగన్‌ను ముఖ్యమంత్రిగా చేస్తే తమ కష్టాలు తీర్చుతాడని, కన్నీరు తుడుస్తాడని రాష్ట్ర ప్రజలు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు. అందుకే ఒక జిల్లాకు మించి మరొక జిల్లా పోటీ పడుతూ ఇప్పటివరకూ 12 జిల్లాల్లోనూ ప్రజాసంకల్పయాత్ర విజయవంతమైందని చెప్పారు. ఇంతటి ప్రజాదరణను చూసి ఓర్వలేక చంద్రబాబు పన్నిన కుట్రలో భాగమే జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఘటనని ఆరోపించారు. ఇలాంటి ఘోరాలను, కుట్ర రాజకీయాలను తిప్పికొట్టాలని, పాదయాత్ర ఒక పార్టీ కార్యక్రమంలా గాకుండా ప్రతి ఇంటి పండుగలా నిర్వహించాలని శ్రేణులకు భూమన విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా తమ్మినేని సీతారాం మాట్లాడుతూ ప్రజాశ్రేయస్సు కోసం జగన్‌ తలపెట్టిన ప్రజాసంకల్పయాత్ర ముగింపు ఘట్టానికి శ్రీకాకుళం జిల్లా వేదిక కావడం గర్వకారణమన్నారు. చారిత్రాత్మకమైన ఈ పాదయాత్రను విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ధర్మాన కృష్ణదాస్‌ మాట్లాడుతూ జగన్‌ నాయకత్వ పటిమపై, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై ప్రజల్లో విశ్వాసం రోజురోజుకు అధికమవుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో పాదయాత్రను విజయవంతం చేయడం అందరి బాధ్యత అని అన్నారు. రెడ్డి శాంతి మాట్లాడుతూ ప్రజలతో అనునిత్యం మమేకమై వారి సమస్యలు తెలుసుకుని, వాటిని తీర్చేందుకు జగన్‌ కృషి చేస్తున్నారని చెప్పారు. ఆయన పాదయాత్రను విజయవంతం చేయాలని, ఆయన్ను ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలని కోరారు. దువ్వాడ శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఇప్పటివరకూ ఇచ్ఛాపురం వేదికగా ప్రారంభమైన లేదంటే ముగిసిన ఏ కార్యక్రమమైనా సరే అద్వితీయమైన విజయాలకు నాంది పలికాయని గుర్తు చేశారు. ప్రజాసంకల్పయాత్ర కూడా విజయవంతమవుతుందని, ఇది పార్టీ గెలుపునకు నాంది పలుకుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సమావేశంలో పార్టీ ప్రోగ్రామ్స్‌ కన్వీనర్‌ తలశిల రఘురాం, పార్టీ నాయకులు మామిడి శ్రీకాంత్, అంధవరపు సూరిబాబు, గొండు కృష్ణమూర్తి, అంబటి శ్రీనివాస్, శిమ్మ రాజశేఖర్, ఎన్ని ధనుంజయ, కేఎల్‌ ప్రసాద్, తమ్మినేని చిరంజీవినాగ్, పొన్నాడ రుషి, హనుమంతు కిరణ్‌కుమార్, పీస శ్రీహరి, పీస గోపి, దువ్వాడ శ్రీధర్, చల్లా అలివేలు మంగ, చల్లా మంజుల, టి.కామేశ్వరి  పాల్గొన్నారు.

40 రోజుల పాటు పాదయాత్ర
ప్రజాసమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్ర ఈ నెల 25వ తేదీన వీరఘట్టం మండలం కెల్ల గ్రామం మీదుగా జిల్లాలోకి ప్రవేశించనుంది. ఈ సందర్భంగా ఆయనకు ఘనంగా స్వాగతం పలకాలి. మిగిలిన జిల్లాల్లో కన్నా వినూత్నంగా ఉండేలా చూసుకోవాలి. ఎన్నికల సమయం దగ్గరవుతోంది. జిల్లాలో 40 రోజుల పాటు పాదయాత్ర కొనసాగే అవకాశం ఉంది. ప్రతి నియోజకవర్గంలో సగటున నాలుగు రోజుల పాటు ఉంటుంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరికలు కూడా అధికంగా ఉండేలా కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలి.– ధర్మాన ప్రసాదరావు, వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కో ఆర్డినేటర్‌

మరిన్ని వార్తలు