జగన్‌ నడిచె..పల్లె మురిసె..

20 Aug, 2018 06:44 IST|Sakshi
బొడ్డేపల్లి సమీపంలో జనసందోహం మధ్య వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర

పల్లెల్లో సందడి ఊళ్లన్నీ ఊరేగింపుగా జగన్‌కు స్వాగతం

సాక్షిప్రతినిధి, విశాఖపట్నం:  ఎన్నెన్నో ఘట్టాలు..ఎన్నెన్నో మేలిమలుపులకు.. రాదారి అయిన ప్రజాసంకల్ప యాత్రలో ఆదివారం మరో చిరస్మరణీయ ఘట్టం చోటు చేసుకుంది. ఎన్నెన్నో పల్లెలు.. పట్టణాలు..నగరాలు దాటుకుంటూ వేలాది కిలోమీటర్లు నడుస్తూ వచ్చిన జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని చూసి ఆ పల్లె మురిసిపోయింది. అబ్బురపోయింది. ఊరు..ఊరంతా సంబరమైంది. ఎందుకంటే ఇంతవరకు ఆ మారుమూల పల్లెను మంత్రులు..ఎమ్మెల్యేలు కాదు కదా కనీసం పంచాయతీ కార్యదర్శి, వీఆర్వోలు సైతం కన్నెత్తి చూడని పరిస్థితి.  కానీ అదే పల్లె వెంట రాజన్న తనయుడు జగనన్న వస్తున్నాడని తెలుసుకుని ఊరు సంబరపడిపోయింది. ఆ ఊళ్లోని పిల్లలు, వృద్ధులు, యువకులు, మహిళలు ఇలా ఊరంతా కదలి వచ్చి తమ అభిమాన నేతకు ఎదురేగి స్వాగతం పలికింది. పూలపై నడిపించారు. రోడ్లపై చీరలు పరిచి జననేతను నడిపించారు. ఊళ్లో పెళ్లయిన కొత్త జంటలు పట్టుబట్టలతో వచ్చి జననేత ఆశీర్వాదం తీసుకున్నాయి.

రాజన్న బిడ్డ వచ్చాడంటూ వృద్ధులు, మహిళలు ఆయన్ని చూసి అభిమానంతో ఉప్పొంగిపోయారు. ఇరుకైన మట్టిరోడ్లు.. మధ్యలో ఇళ్లు.. చుట్టూ పొలాలు..ఆ ఊళ్ల జనం తప్ప ఎవరూ అటువైపు కన్నెత్తి చూడని గ్రామాల్లో అరుదెంచిన అభిమాన నేతను చూసి ఊళ్లకు ఊళ్లు కదిలొచ్చాయి. ఇదంతా ఆదివారం ప్రజాసంకల్ప పాదయాత్రలో భాగంగా మాకవరపాలెం మండలం తమ్మయ్యపాలెంలో చోటు చేసుకున్న దృశ్యాలు. ఆ ఊళ్లోనే కాదు.. పాదయాత్ర సాగిన ఊళ్లన్నింటిలోనూ ఇవే దృశ్యాలు కన్పించాయి. దారిమధ్యలో మహానేత చలవతో ఎంతో లబ్ధి పొందామని..రుణమాఫీతో అప్పు తీరిందని.. ఆరోగ్యశ్రీతో ఉచిత వైద్యం అందిందని కృతజ్ఞతా పూర్వకంగా కొందరు. అన్నా నువ్వు వస్తేనే మాక కష్టాలు తీరుతాయని మరికొందరు..సర్కార్‌ నిర్వాకంతో అన్ని విధాలా నష్టపోయామని.. పింఛన్లు రావడం లేదని... అన్యాయంగా ఓట్లుతొలగిస్తున్నారని...గిట్టుబాటు ధర లేదని ఇలా వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యలను నివేదిస్తూ..మన ప్రభుత్వం రాగానే అన్ని కష్టాలు తీరుతాయన్నా అంటూ జననేత భరోసానిస్తూ నాల్గోరోజు పాదయాత్ర  సాగింది.

మరిన్ని వార్తలు