మూడో నియోజకవర్గంలో ప్రజాసంకల్పం

23 Aug, 2018 08:20 IST|Sakshi
యలమంచిలి నియోజకవర్గంలోకి జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశిస్తున్న ఏటికొప్పాక బ్రిడ్జిపై ప్లెక్సీలు, జెండాలతో ఘన స్వాగత ఏర్పాట్లు

నేడు యలమంచిలి నియోజకవర్గంలోకి ప్రవేశం ఏటికొప్పాకతో మొదలు

విజయవంతం చేసేందుకు కన్నబాబు రాజు ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు

ఎన్‌ఏవోబీ, పూడిమడక పైపులైన్‌ నిర్వాసితుల సమస్యలు కీలకం

వారం రోజులు.. రెండు నియోజకవర్గాలు.. వేలాది ప్రజల ఆదరాభిమానాలు.. జిల్లాలో వై.ఎస్‌.జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర సాధించిన ఘనత ఇది.. దిగ్విజయంగా సాగుతున్న పాదయాత్ర గురువారం మూడు నియోజకవర్గం యలమంచిలిలోకి ప్రవేశించనుంది. పాయకరావుపేట నియోజవర్గం దార్లపూడి దాటి లక్కబొమ్మల కోట అయిన ఏటికొప్పాక వద్ద యలమంచిలి నియోజకవర్గంలోకి ప్రవేశించనుండగా.. ఇప్పటికే ఆ నియోజకవర్గం సరిహద్దులో పండుగ వాతావరణ నెలకొంది. నాలుగేళ్ల సర్కారు వైఫల్యాలు, సంక్షేమ ఫలాల పంపిణీలో వివక్షతో నిలిగిపోయిన ప్రజలు జననేత జగన్‌కు బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధమయ్యారు.

సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర గురువారం యలమంచలి నియోజకవర్గంలో అడుగుపెట్టనుంది. ఈ నెల 14న జిల్లాలో ప్రవేశించిన పాదయాత్ర నర్సీపట్నం, పాయకరావుపేట నియోజకవర్గాల్లో ముగిసి యలమంచలిలో ప్రవేశించనుంది. గురువారం పాయకరావుపేట మండలం ఎస్‌.రాయవరం మండలం దార్లపూడి నుంచి ప్రారంభం కానున్న పాదయాత్ర ఏటికొప్పాక వద్ద యలమించిలిలో అడుగు పెట్టనుంది. తొలిరోజు ఏటికొప్పాక, పధ్మనాభరాజుపేట, పులపర్తి మీదుగా పురుషోత్త పురం వరకు సాగనుంది. నర్సీపట్నం తర్వాత అత్యధిక రోజులు యలమంచలిలోనే యాత్ర సాగే అవకాశాలున్నాయి. నియోజకవర్గంలోని యలమంచలి మున్సిపాల్టీ, యలమంచలి, రాంబిల్లి, అచ్యుతాపురం, మునగపాక మండలాల్లో 40 కిలోమీటర్లకు పైగా ప్రజాసంకల్పయాత్ర సాగనుంది. యలమంచలి కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే ఉప్పలపాటి రమణమూర్తి రాజు (కన్నబాబురాజు) ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వై.ఎస్‌.జగన్‌కు ఘన స్వాగతం పలకడంతో పాటు నియోజకవర్గంలో పాదయాత్ర విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశాయి.

భరోసా కోసం ఎదురుచూపు
అధికార టీడీపీ హాయంలో గత నాలుగున్నరేళ్లలో సాగిన అవినీతి అక్రమాలు, అంతులేని వివక్షతో విసిగిపోయిన ప్రజలు తమ కష్టాలను జననేతను చెప్పుకొని ఉపశమనం పొందేందుకు ఎదురు చూస్తున్నారు. ముడిసరుకు దొరక్క,  మార్కెటింగ్‌ లేక ఏటికొప్పాక కొయ్యబొమ్మల పరిశ్రమ సంక్షోభంలో చిక్కుఓగా.. యలమంచలి టౌన్‌తో పాటు మండలాల పరిధిలో తాగు, సాగునీటి కష్టాలను నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పట్టణంలో చాలా ప్రాంతాలకు తాగునీటి సరఫరాలేదు. రాంబిల్లి మండలంలో 20 గ్రామాల ప్రజలకు ఉప్పునీరే శరణ్యం. 90కోట్లతో చేపట్టిన ప్రాజెక్టు అతీగతీ లేకుండా పడి ఉంది. ఎస్‌ఈజెడ్‌లో నెలకొన్న సమస్యలు, పూడిమడక పైపులైన్, ఎన్‌ఏవోబీ నిర్వాసితులు పరిహారం అందక పడరాని పాట్లు పడుతున్నారు. జననేత వస్తే తమ కష్టాలు చెప్పు కునేందుకు వీరంతా ఎదురు చూస్తున్నారు. కాలుష్యకాసారాలుగా తయారైన ఎస్‌ఈజెడ్‌ పరిశ్రమల విషయంలో పార్లమెంటులో ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన పోరాట ఫలితంగా ఇటీవలే కేంద్ర బృందం వచ్చి అధ్యయనం చేసిన విషయం తెలిసిందే. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ కూడా రాష్ట్రప్రభుత్వ  నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

నేతలపై సర్కారు కక్షసాధింపు
టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి రాగానే మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజుకు చెందిన ఎప్పటిదో పాత కేసును తిరగదోడి అధికార టీడీపీ బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలకు తెరతీసింది. వీటిని ఎదురొడ్డి కన్నబాబురాజు సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజాసంకల్ప యాత్రను విజయవంతం చేసేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి, పార్టీ ప్రొగ్రామ్స్‌ కమిటీ కన్వీనర్‌ తలశిల రఘురామ్‌లు ఇప్పటికే నియోజకవర్గ శ్రేణులతో సమావేశమై పాదయాత్ర విజయవంతం చేసే దిశగా సమాయత్తం చేశారు.

మరిన్ని వార్తలు