జగనన్నే ఓ భరోసా

15 Nov, 2018 08:19 IST|Sakshi
జగన్‌ మోహన్‌ రెడ్డితో మాట్లాడుతున్న ఆశావర్కర్‌ పద్మ

ప్రజా సంకల్పయాత్రలో ఎగసిపడితున్న జనకెరటాలు

జగన్‌ రాకతో జన సంద్రమైన జాతీయ రహదారి సీతానగరంలో పోటెత్తిన జనప్రవాహం

కష్టాలు తీర్చాలని వేడుకోలు

జన్మభూమి కమిటీలపై ఫిర్యాదులు పార్టీలోకి భారీగా వలసలు

సాక్షిప్రతినిధి, విజయనగరం: ఒకటి కాదు.. వంద కాదు.. వేల సంఖ్యలో అడుగులన్నీ ఏకమవుతున్నాయి. పల్లెలు కదలివస్తుండగా.. చిన్న చిన్న పట్టణాలు తరలివస్తున్నా యి. తమ అభిమాన నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అండగా నిలుస్తున్నాయి. జననేత రాకతో విశాఖ– రాయపూర్‌ జాతీయరహదారి జన ప్రవాహంతో నిండిపోయింది. చిన్నా.. పెద్దా... ముసలీ.. ముతకాతో పాటు జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న  వారు సైతం జననేత చేయి చేయి కలిపి ప్రజా సంకల్పయాత్రలో భాగస్వాములవుతున్నారు. తమ సమస్యలను వినేందుకు వచ్చిన రాజన్న బిడ్డకు నీరాజనం పలుకుతున్నారు. వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు బస్సులు, కార్లు, ఇతర వాహనాల్లో ప్రయాణిస్తున్న వారు సైతం జాతీయ రహదారిపై జననేత కోసం అతృతగా ఎదురు చూశారు. ఆయనతో కరచాలనం చేసేందుకు పో టీ పడుతున్నారు. అధిక సంఖ్యలో యువకులు, మహిళలు ఆయనతో అడుగేస్తుండటం విశేషం.

జనసంద్రమైన జాతీయ రహదారి
సీతానగరం మండలం తామరఖండి నుంచి బుధవారం ప్రారంభమైన పాదయాత్ర చినభోగిలి, సీతానగరం మీదుగా అప్పయ్యపేట వద్దకు భోజన విరామ సమయానికి చేరుకుంది. అనంతరం జోగింపేట, గుచ్చిమి మీదుగా చిన్నరాయుడు పేటకు చేరుకుని ముగిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పూర్తిగా విశాఖ –రాయపూర్‌ జాతీయ రహదారిపై పాదయాత్ర కొనసాగించిన జననేతకు  ప్రజలు నీరాజనాలు పలికారు. సీతానగరం ఫ్లైఓవర్‌కు చేరుకున్న సమయంలో తరలివచ్చిన జనప్రవాహంతో బ్రిడ్జి కిటకిటలాడింది. అంతేగాదు... సుమారు కిలోమీటరు మేర ఏర్పాటు చేసిన జననేత పాదయాత్ర చేపట్టిన నియోజకవర్గాల చిత్రమాలిక భారీ బ్యానర్‌ అందరినీ ఆకట్టుకుంది.

రైతన్నలతో ఆత్మీయ కలయిక
ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వచ్చిన జగనన్న సీతానగరం మండలం అప్పయ్యపేట పంట పొలంలో వరి పంట కోస్తున్న రైతులతో ఆత్మీ యంగా మాట్లాడారు.  రైతుల వద్దకు నేరుగా వెళ్లి వరి పంట సాగుకు పెట్టుబడులు, గిట్టుబాటు ధర కల్పన గురించి అడిగి తెలుసుకోగా.. రైతులు త మ సమస్యలను ఏకరువు పెట్టారు. ప్రస్తుతం కరు వు తాండవిస్తోందని, రాయితీపై విద్యుత్, సోలార్‌ వ్యవసాయ విద్యుత్‌ సర్వీసులు మంజూరు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటిస్తున్నా అమలుకు నోచుకోకపోవటంతో చేతికందాల్సిన పంట నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. రాబోయే తమ ప్రభుత్వంలో వ్యవసాయానికి పెద్దపీట వేస్తామని వారికి భరోసా కల్పించారు.

పాదయాత్రలో వినతుల వెల్లువ
నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలనపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వివిధ గ్రామాల విద్యార్థులు అందుబాటులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేక ఉన్నత విద్యకు దూరమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 31 గ్రామాల విద్యార్ధులకు అవసరమైన ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని కోరారు. తామరఖండికి చెందిన విద్యార్థులు బొబ్బిలి వెళ్లేందుకు బస్సు సౌకర్యం లేక తాము పడుతున్న అవస్థలు విన్నవించారు. ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నాయకులు కలిసి ప్రభుత్వ విద్యా రంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. గిరిజన గురుకులాల ఉపాధ్యాయులు, భోధనేతర సిబ్బంది 20 ఏళ్లుగా పని చేస్తున్నా సర్వీసు క్రమబద్ధీకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెదపెంకి గ్రామానికి చెందిన ఫైలేరియా వ్యా«ధిగ్రస్థులు తమ గోడును వివరించారు. తమను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం తమపై కక్షగట్టి అడుగడుగునా అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తోందని సోషల్‌మీడియా వలంటీర్లు తెలిపారు.

వైఎస్సార్‌సీపీలోకి వలసలు
సీతానగరం, బలిజపేటకు చెందిన నలుగురు సర్పంచ్‌లు, నలుగురు ఎంపీటీసీలతో పాటు దాదాపు 2 వేల మంది టీడీపీ ఆగడాలతో విసిగిపోయి ఆ పార్టీని వీడి జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. అయ్యన్నపేట వద్ద జననేతను కలిసిన పార్వతీపురం మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ దొడ్డి విజయకృష్ణ, ఎనిమిది మంది కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్‌లు, ముఖ్య నేతలు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.

పాదయాత్రలో అడుగులు వేసిన నాయకులు
పాదయాత్రలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం శ్రీకాకుళం జిల్లాల పరిశీలకుడు భూమన కరుణాకరరెడ్డి, రాష్ట్ర ప్రొగ్రామ్స్‌ కమిటీ కన్వీనర్‌ తలశిల రఘురాం, పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, విజయనగరం, అరకు  పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు బెల్లాన చంద్రశేఖర్, శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, అరకు పార్లమెంటరీ సమన్వయకర్త మాధవి, పార్వతీపురం, గజపతినగరం, బొబ్బిలి సమన్వయకర్తలు అలజంగి జోగారావు, బొత్స అప్పలనర్సయ్య, శంబంగి వెంకట చినఅప్పలనాయుడు పార్టీ నాయకులు జమ్మాన ప్రసన్నకుమార్, రాష్ట్ర ఎస్సీసెల్‌ కార్యదర్శి గర్భాపు ఉదయభాను తదితరులు పాల్గొన్నారు.  

ఆశ వర్కర్లను ఆదుకోవాలి సార్‌!
‘తెలంగాణలో ఆశావర్కర్లకు రూ.8వేలు అందిస్తున్నారు. మాకు ఇక్కడ కేవలం రూ.3 వేలే ఇస్తున్నారు. మాకు పనిఉంటేనే మిగతా వెయ్యో రెండు వేలో అదనంగా ఇస్తున్నారు. మాకు మీరే ఆదుకోవాలి. నిత్యం రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక పని మాకు అప్పగిస్తోంది. కానీ వేతనం మాత్రం పెంచడం లేదు. మీ ప్రభుత్వం వచ్చాక మమ్మల్ని ఆదుకోవాలి సార్‌!’ అని విజయనగరం కంటోన్మెంట్‌కు చెందిన దత్తి పద్మ అనే ఆశ వర్కర్‌ చెప్పగానే ప్రభుత్వం వచ్చాక మీ కోరికలను నెరవేరుస్తానని అనడంతో ఆశవర్కర్లంతా ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఇచ్చేకన్నా ఎక్కువే ఇస్తామని జగన్‌ మోహన్‌ రెడ్డి అనడంతో ఆమె సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బయింది.

మరిన్ని వార్తలు