నిలువెత్తు నమ్మకం.. కొండంత ధైర్యం...

16 Nov, 2018 07:07 IST|Sakshi
వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డితో కలసి అడుగులేస్తున్న పార్వతీపురం సమన్వయకర్త అలజంగి జోగారావు, అరకు పార్లమెంటరీ జిల్లా సమన్వయకర్త మాధవి, అనకాపల్లి పార్లమెంటరీ జిల్లా సమన్వయకర్త వరుదు కల్యాణి,

విజయవంతంగా సాగుతున్న జగన్‌ ప్రజాసంకల్పయాత్ర

అడుగడుగునా అఖండ నీరాజనం పలుకుతున్న అభిమానులు

సుదూరం నుంచి కష్టాలు తెలిపేందుకు తరలివస్తున్న జనాలు

ఉద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకుంటున్న అక్క చెల్లెమ్మలు

అందరిలో కొండంత భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్న జననేత

సాక్షి ప్రతినిధి, విజయనగరం: సమస్యలనుంచి గట్టెక్కించేందుకు వస్తున్న నాయకుడతడు. సంక్షేమ పథకాలను నిష్పాక్షికంగా అందించగల పాలకుడతడు. ఆయనే రాజన్న బిడ్డ జగనన్న. మాట తప్పని... మడమ తిప్పని లక్షణాన్ని పుణికిపుచ్చుకున్న జననేత. అందుకే ఆ పేరు ఇప్పుడు రాష్ట్ర ప్రజల గుండెల్లో కొండంత ధైర్యంగా మారింది. కష్టాల్లో ఉన్న వారికి భరోసానిస్తోంది. అనారోగ్యంతో ఉన్న వారికి జీవితంపై ఆశ కల్పిస్తోంది. జిల్లాలో సాగుతున్న జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్రకు అడుగడుగునా జనాభిమానం ఉప్పొంగిపోతోంది. ఆయన్ను చూడగానే ఎన్నాళ్లుగానో గుండెల్లో గూడుకట్టుకున్న బాధల్ని ఆయనతో పంచుకుని కన్నీటి పర్యంతమవుతున్నారు. అందరి కష్టాలను కడతేర్చగల నిలువెత్తునమ్మకాన్ని చూసి కొండంత భరోసా పొందుతున్నారు.

ఆ బాటసారికి అపూర్వ ఆదరణ
వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న ప్రజా సంకల్పయాత్ర పార్వతీపురం నియోజకవర్గంలో అపూర్వ జనాదరణ నడుమ సాగుతోంది. 298వ రోజైన గురువారం సీతానగరం మండలం చిన్నరాయుడుపేట నుంచి ప్రారంభమైన యాత్ర నిడగల్లు క్రాస్, మరిపివలస మీదుగా సూరంపేట క్రాస్‌ వద్దకు చేరుకుంది. పూర్తిగా  విశాఖ–రాయపూర్‌ అంతర్‌రాష్ట్ర రహదారిపై కొనసాగిన పాదయాత్రలో పాల్గొనేందుకు అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఉదయం నుంచి ఎదురుచూస్తూ తమ అభిమాన నేత గ్రామాల్లో అడుగిడగానే జై జగన్‌ నినాదాలతో హోరెత్తించారు. వయసుతో నిమిత్తం లేకుండా అన్నిస్థాయిల వారూ ఆయనకోసం ఎదురు చూశారు. ఆయనతో సెల్ఫీలు, ఆటో గ్రాఫ్‌లు తీసుకుని అపురూపంగా పదిలపరుచుకున్నారు. తమ భవిష్యత్‌కు బంగారుబాటలు వేయగల నాయకుడి అడుగులో అడుగు కలిపారు.

బాధలు వింటూ... భరోసానిస్తూ...
ప్రజాసంకల్ప యాత్రలో వినతుల జోరు పెరుగుతోంది. వేదన వినిపిస్తూ... గుండెల్లోని బరువు దించుకుంటున్నారు. ఆయనభరోసాతో కొండంత ధైర్యాన్ని పొందుతున్నారు. సూరంపేటకు చెందిన రైతులు ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో వ్యవసాయ శాఖ నకిలీ విత్తనాలు పంపిణీ చేసి నట్టేట ముంచారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేస్తే ఆదుకుంటామని చెప్పి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపించారు. జంఝావతి హైలెవెల్‌ కెనాల్‌ ద్వారా సాగునీటిని అందించాలని  నర్సిపురం గ్రామస్తులు కోరారు. హైలెవెల్‌ కెనాల్‌ పనులు చేపట్టకపోవటంతో 24వేల ఎకరాలకు సాగు నీరు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మైదాన ప్రాంత ఎస్టీలను గిరిశిఖర ఎస్టీలతో సమానంగా  రిజర్వేషన్లు కల్పించా లని కోరారు. నాలుగేళ్లుగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకుండా తాత్సారం చేస్తున్నారని డీఎస్సీ శిక్షణాభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్‌ సంస్థలో పెట్టుబడులు పెట్టి నష్టపోయిన బాధితులు తమ గోడు చెప్పుకున్నారు. అధికారంలోకి రాగానే ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తామన్న జననేత ప్రకటనపై డైట్‌ విద్యార్థులు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. తెలంగాణలో మాదిరిగా రాష్ట్రంలో కూడా భూములు రీసర్వే జరపాలని పలుచోట్ల రైతులు కోరారు. అందరితో ఆప్యాయంగా మాట్లాడిన జగన్‌ వారికి భరోసా కల్పించారు.

పాదయాత్రలో పాల్గొన్నపార్టీ నాయకులు: పాదయాత్రలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిశీలకుడు భూమన కరుణాకరరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పార్టీ ప్రొగ్రామ్స్‌ కమిటీ కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం,  పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, విజయనగరం, అరకు, అనకాపల్లి పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు బెల్లాన చంద్రశేఖర్, శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, గుడివాడ అమర్‌నాథ్, పార్వతీపురం, బొబ్బిలి నియోజకవర్గాల సమన్వయకర్తలు అలజంగి జోగారావు, శంబంగి వెంకట చినప్పలనాయుడు,అనకాపల్లి, అరకు పార్ల మెంటరీ జిల్లాల సమన్వయకర్తలు వరుదు కల్యాణి, మాధవి, పార్టీ విజయవాడ సిటీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లాది విష్ణు, పార్టీ నాయకులు జమ్మాన ప్రసన్నకుమార్, రాష్ట్ర ఎస్సీసెల్‌ కార్యదర్శి గర్భాపు ఉదయభాను, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మావిడి శ్రీకాంత్, పార్టీ జిల్లా కోశాధికారి కందుల రఘుబాబు, పెడన నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు