తీర ప్రాంత రక్షణలో వైఫల్యం

28 Jan, 2015 02:10 IST|Sakshi
తీర ప్రాంత రక్షణలో వైఫల్యం

చంద్రబాబు సర్కారుపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజం
రాష్ట్రంలో శాశ్వత చర్యలు చేపట్టకుంటే 282 గ్రామాలు కనుమరుగు
నిరాశ్రయులు కానున్న 13 లక్షలమంది ప్రజలు.. సమస్య పరిష్కారానికి సమగ్ర అధ్యయనం అవసరం
‘హెడ్‌గ్రోయిన్ బ్రేక్ వాటర్’ విధానమే శాశ్వత పరిష్కారం

 
సాక్షి, విశాఖపట్నం: ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడితే దుబాయ్, జపాన్, సింగపూర్ దేశాలు తిరుగుతున్నారు. అవన్నీ సముద్ర తీరమున్న దేశాలే. సముద్ర తీరం కోతలకు గురైనప్పుడు ఆ దేశాలు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకుంటున్నారో చంద్రబాబు చూడలేదా? ఆయనకు తెలియదా? రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అప్పటికప్పుడు రావడం.. తాత్కాలిక చర్యలతో సరిపుచ్చడమేతప్ప రాష్ట్రప్రభుత్వం శాస్త్రీయ విధానంలో శాశ్వత చర్యలు చేపట్టడం లేదు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు.
 
విశాఖపట్నంలో కోతకు గురి అవుతున్న ఆర్కేబీచ్‌లోని కురుసుర జలాంతర్గామి మ్యూజియం సమీప ప్రాంతాన్ని ఆయన మంగళవారం పరిశీలించారు. పార్టీ నేతలు, స్థానిక నేతలతో మాట్లాడి తీరం కోత తీవ్రతను తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ‘‘రాష్ర్టంలో 442 కిలోమీటర్ల తీరం కోతముప్పును ఎదుర్కొంటోంది. ప్రస్తుత సముద్ర నీటిమట్టం కేవలం మరో 0.6 మీటర్లు ఎత్తు పెరిగితే సముద్రం మరో 100 మీటర్ల మేర తీరంలోకి చొచ్చుకొస్తుంది. దీంతో రాష్ట్రంలోని 282  తీరప్రాంత గ్రామాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ఈ గ్రామాల్లో నివసిస్తున్న 13 లక్షలమంది ప్రజలు నిరాశ్రయులవుతారు. వారి జీవనోపాధీ దెబ్బతింటుంది.
 
మన కళ్లెదుటే ఇంతటి పెనుప్రమాదం పొంచిఉన్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. తీరప్రాంతాల్లో ఇష్టమొచ్చినట్టుగా డ్రెడ్జింగ్ సాగిస్తుండడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన పాలకులే పర్యావరణానికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అప్పటికప్పుడు రావడం.. చూడడం.. నాలుగురాళ్లు వేయడంతో సరిపెట్టడం చేస్తున్నారు.కోతకు గురైనప్రాంతాన్ని పనికిరాని రాళ్లతో నింపుతున్నారు.
 
ఇందుకోసం టీడీపీ నాయకుల జేబులు నింపేందుకు నామినేషన్ పద్ధతిలో ఏకంగా రూ.మూడున్నర కోట్ల పనులు కట్టబెట్టారు. ఇది శాశ్వత పరిష్కారం కాదు. తీరప్రాంతానికి పొంచిఉన్న ముప్పును ఎదుర్కొనేందుకు సమగ్ర అధ్యయనం జరగాలి. కేంద్రాన్ని సంప్రదించి అవసరమైతే అంతర్జాతీయస్థాయి నిపుణులను రప్పించి తరచూ కోతలకు గురవడానికి గల కారణాలు.. శాశ్వత పరిరక్షణకు తీసుకోవల్సిన చర్యలపై అధ్యయనం చేయించాలి. కోత నివారణకు విదేశాల్లో అమలు చేస్తున్న ‘హెడ్ గ్రోయిన్ బ్రేక్ వాటర్’ విధానాన్ని మన తీరంలోనూ అమలు చేయాలి. ఈ సమస్యపై ప్రతిపక్షంగా అసెంబ్లీలో ప్రస్తావిస్తాం. శాశ్వత పరిరక్షణకోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం.. విశాఖపట్నంలోని మేధావులు, వివిధ రంగాల నిపుణులు ఈ సమస్యపై ఉద్యమించాలి. అప్పుడే  పరిష్కారం దొరుకుతుంది’’.
 
సింహాద్రి అప్పన్న దర్శనం
 వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం మధ్యాహ్నం సింహాచలం దేవస్థానాన్ని సందర్శించి వరాహలక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. దేవస్థానంవద్ద ఆలయ అధికారులు, వేదపండితులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. జగన్ దేవస్థానంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని బేడా మండపం చుట్టూ ప్రదక్షిణ చేశారు. అనంతరం దేవస్థానం అంతరాయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు జగన్ పేరిట అష్టోత్తర పూజ చేశారు.
 
 గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన నిర్వహించారు. తర్వాత ఆస్థాన మండపంలో అర్చకులు జగన్‌ను వేదమంత్రోచ్ఛారణతో ఆశీర్వదించారు. ఆలయ ఈవో కె.రామచంద్రమోహన్ ఆయనకు స్వామివారి ప్రసాదాన్ని అందించారు. అనంతరం సింహాచల దేవస్థానం రాజగోపురం వద్ద తనను కలిసిన విలేకరులతో జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అందరికీ మంచి జరగాలని దేవున్ని ప్రార్థించానని చెప్పారు. దేవస్థానం పరిధిలోని పంచగ్రామాల భూసమస్యను విలేకరులు ప్రస్తావించగా జగన్ స్పందిస్తూ.. పంచగ్రామాల్లో భూములను క్రమబద్ధీకరించాలన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిఉంటే ఆ భూముల్ని క్రమబద్ధీకరించి ఉండేవాళ్లమన్నారు.
 
 శారదా పీఠం సందర్శన..
 కాగా జగన్‌మోహన్‌రెడ్డి పెందుర్తి నియోజకవర్గం చినముషిరివాడలోని విశాఖ శారదా పీఠాన్ని సందర్శించి పీఠం ఆవిర్భావోత్సవ పూజల్లో పాల్గొన్నారు. పీఠం ప్రధాన ద్వారం వద్ద వేదపండితులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
 
 తదుపరి జగన్ నేరుగా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిని కలుసుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయనతో కొద్దిసేపు సమావేశమయ్యారు. అనంతరం స్వామీజీతో కలసి పీఠప్రాంగణంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగశాలను సందర్శించి కలశారాధన చేశారు. జమ్మిచెట్టుకు పూజలు చేశారు. పీఠం సంప్రదాయం ప్రకారం వేదపండితులు జగన్‌ను సత్కరించారు. అనంతరం వైఎస్ జగన్ హైదరాబాద్‌కు తిరుగుప్రయాణమయ్యారు.
 
ఈ పర్యటనలో జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, ఎమ్మెల్సీ డి.సూర్యనారాయణరాజు, ఎమ్మెల్యేలు సుజయ్‌కృష్ణ రంగారావు, బూడి ముత్యాలనాయుడు, కిడారి సర్వేశ్వరరావు, గిడ్డి ఈశ్వరి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, విశ్వసరాయి కళావతి, కంబాల జోగులు, మాజీ ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, కర్రి సీతారాం, మళ్ల విజయ్ ప్రసాద్, తైనాల విజయ్‌కుమార్, కరణం ధర్మశ్రీ, తిప్పల గురుమూర్తిరెడ్డి, చెంగల వెంకట్రావు, పాలవలస రాజశేఖరం, నియోజకవర్గాల సమన్వయకర్తలు వంశీకృష్ణ, కోలా గురువులు, తిప్పల నాగిరెడ్డి, అదీప్‌రాజ్, పెట్ల ఉమాశంకర్ గణేష్, ప్రగడ నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శులు జాన్‌వెస్లీ, కంపా హనోక్, పార్టీ నేతలు కొయ్య ప్రసాద్‌రెడ్డి, ఉషాకిరణ్, బల్లాడ జనార్దన్‌రెడ్డి, హేమమాలినిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రానికి మంచి జరగాలని జగన్ రావడం సంతోషం స్వరూపానందేంద్ర స్వరస్వతి స్వామీజీ
సాక్షి, విశాఖపట్నం: శారదా పీఠం మహా సంస్థానం ఆవిర్భావ మహోత్సవాలకు ప్రతిపక్ష నేత హోదాలో రాష్ట్రానికి మంచి జరగాలని కోరుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రావడం సంతోషదాయకమని పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ అన్నారు. పీఠాన్ని జగన్ మంగళవారం సాయంత్రం సందర్శించిన అనంతరం స్వామీజీ విలేకరులతో మాట్లాడారు.

మరిన్ని వార్తలు