‘అవని’కి ఆశాజ్యోతి.. వైఎస్‌ జగన్‌

20 Mar, 2019 13:26 IST|Sakshi

సాక్షి, మచిలీపట్నం: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సమరోత్సాహంతో ప్రారంభించింది. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం మధ్యాహ్నం 2.10 గంటలకు అవనిగడ్డలో ఎన్నికల ప్రచార బహిరంగ సభ నిర్వహించారు. ఆయనకు హెలిప్యాడ్‌ వద్ద వైఎస్సార్‌ సీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి అవనిగడ్డ వంతెన సెంటర్‌కు చేరుకుని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. 

జనసంద్రం..
ప్రతిపక్ష నేత సభ మధ్యాహ్నం 12 గంటలకు సభ ప్రారంభమవుతుందని తెలుసుకున్న ప్రజలు అప్పటికే భారీ సంఖ్యలో రావడంతో ఆ సర్కిల్‌ జనంతో కిక్కిరిసిపోయింది. ఎటు చూసినా జననేత కోసం ఎదుచుచూసే కళ్లే కనిపించాయి. ఒక వైపు మిట్ట మధ్యాహ్నం వేళ.. భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నా.. ఎండ కాకరేపుతున్నా ఒక్క అడుగు సైతం పక్కకు పడలేదు. తమ అభిమాన నేతను చూడాలని, చేసే ప్రసంగాన్ని వినాలని ఎంతో ఆశతో ఎదురు చూశారు. జననేత కన్పించగానే ఒక్క సారిగా ప్రజల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈలలు, కేకలు, చప్పట్ల శబ్దాలతో సభ ప్రాంగణాన్ని హోరెత్తింది. 

జిల్లాకు చేసిందేమీ లేదు.. 
జననేత వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక అసెంబ్లీలో ఇచ్చిన హామీలకే దిక్కులేదన్నారు. మచిలీపట్నం పోర్టు, రిఫైనరీ, పింగాణీ పరిశ్రమ, మెట్రోరైలు, ఆటోమొబైల్‌ లాజిస్టిక్‌ హబ్, ఫుడ్‌పార్క్, విజయవాడ మెగాసిటీ, స్మార్ట్‌సిటీ, ఆక్వా కల్చర్‌ ప్రాసెసింగ్‌ యూనిట్, టెక్స్‌టైల్‌ పార్క్, ఐటీ హబ్, నూజివీడులో మామిడి పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పి.. ఐదేళ్లయినా ఒక్కటైనా నెరవేర్చారా? అని జనసందోహాన్ని ప్రశ్నించగా.. ప్రజలు చేతులెత్తి లేదు.. లేదు.. అని సమాధానమిచ్చారు. 

నేనున్నాను..
పాదయాత్రలో చంద్రబాబు చేతిలో మోసపోయిన మహిళలు, ఇంటికో ఉద్యోగం వస్తుందని ఆశపడి చంద్రబాబుకు గత ఎన్నికల్లో ఓటు వేసి వంచనకు గురైన విద్యార్థులు.. రైతులు, ఉద్యోగులు.. ఇలా అన్ని వర్గాల వారి కష్టాలు కళ్లారా చూశానని.. వారి బాధలన్నీ విన్నానన్నారు. మీకు నేనున్నాను అంటూ భరోసా ఇచ్చారు. వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి, కైకలూరు, పామర్రు, బందరు, పెడన నియోజకవర్గాల సమన్వయ కర్తలు దూలం నాగేశ్వరరావు, కైలే అనిల్‌కుమార్, పేర్ని నానీ, జోగి రమేష్‌ పాల్గొన్నారు.  

మనసులేని మనిషి చంద్రబాబు
మాజీ ఎంపీ అంబటి బ్రాహ్మణయ్య పేరును ఉళ్లిపాలెం–భవాణిపురం బ్రిడ్జికి నామకరణం చేయమని మాజీ ఎమ్మెల్యే అంబటి శ్రీహరి ప్రసాద్‌ చంద్రబాబుని అడిగితే పట్టించుకోలేదని వైఎస్‌ జగన్‌ అన్నారు. వైఎస్సార్‌ హయాంలోనే బ్రిడ్జి మంజూరైందని, ఆయన హయాంలోనే నిధులు కూడా వచ్చాయన్నారు. కేవలం పేరు పెట్టే  విషయంలో అంబటి హరి అడిగితే చంద్రబాబు స్పందించలేదన్నారు.

అధికారంలోకి రాగానే బ్రిడ్జికి అంబటి బ్రాహ్మణయ్య బ్రిడ్జ్‌గా నామకరణం చేస్తానని జగన్‌ హామీ ఇచ్చారు. 10 వేల మందికి లబ్ధిచేకూరే ఎదురుమొండి వారథిని ఈ ప్రాంతంలోనే ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఐదేళ్లు చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. మనసులేనివారు పరిపాలనచేస్తే అదే జరుగుతుందని.. ఈ బ్రిడ్జిని తాను నిర్మిస్తానని హామీ ఇచ్చారు. 

పార్టీ శ్రేణుల్లో జోష్‌..
జిల్లాలో మొదటి ఎన్నికల సభలో పాల్గొన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తల్లో జోష్‌ నింపారు. అవినీతి టీడీపీ ప్రభుత్వానికి మరి కొద్ది రోజులే గడువు ఉందని, మనకు మంచి రోజులు రానున్నాయని చెప్పడంతో కేడర్‌లో ఉత్సాహం నెలకొంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పథకాలు, నవరత్నాలతో జరిగే మేలును ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. సమస్యలను గుర్తించి.. పరిష్కారానికి హామీ ఇవ్వాలని, అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. అధినేత ఇచ్చిన ధైర్యంతో రెట్టింపు ఉత్సాహంతో ప్రచారం చేసేందుకు నాయకులు సంసిద్ధమవుతున్నారు. 

వైఎస్‌ జగన్‌తోనే రాష్ట్రాభివృద్ధి
రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమవుతుంది. ఆయన ప్రకటించిన నవరత్నాల పథకాలతో అన్ని వర్గాలకు మేలు చేకూరుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర ద్వారా ప్రజల చెంతకు వెళ్లి వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. ఒక్క అవకాశం కల్పిస్తే సువర్ణపాలన తథ్యం. ప్రజల ఆశీర్వాదం ఉంటుందన్న నమ్మకం ఉంది.
–సింహాద్రి రమేష్‌ బాబు, వైఎస్సార్‌ సీపీ అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థి

జగన్‌ అధికారంలోకి వస్తే పోలవరం పూర్తి 
ప్రజలు చల్లని దీవెనలతో వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వస్తే పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ పోలవరం ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తారు. తద్వారా ప్రజలకు తాగు, సాగునీటిని అందుతుంది. టీడీపీ పాలకులు రైతులకు సాగునీరు అందించలేని పరిస్థితిలో ఉన్నారు. ఎక్కడ చూసినా పంటలకు నీరందక రైతాంగం అల్లాడిపోతోంది. జననేత వైఎస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలతో మంచి జరుగుతుంది. 
–వల్లభనేని బాలశౌరి, వైఎస్సార్‌ సీపీ బందరు ఎంపీ అభ్యర్థి
 

>
మరిన్ని వార్తలు