అడుగడుగూ జనహితం

8 Jan, 2019 13:35 IST|Sakshi

జగన్‌ వెంట జన ప్రభంజనం నేనున్నానంటూ భరోసా

యాత్ర ఆద్యంతం జగన్‌ వెంట నడిచిన మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, గౌతంరెడ్డి

వెన్నంటే మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు

ప్రజల కష్టాలు తెలుసుకుంటూ.. భవిష్యత్‌పై నమ్మకాన్ని కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర అడుగడుగునా జనహితంగా సాగింది. ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితో అష్టకష్టాలు పడుతున్న వివిధ వర్గాల ప్రజలు జగన్‌మోహన్‌రెడ్డి వెంట అడుగులు వేస్తూ తమ సమస్యలను విన్నవించారు. మద్యంతో కుదేలవుతున్న కుటుంబాల్లోని మహిళలు, ఆక్వా, వరి, పాడి రైతులు, చేనేతలు, విద్యార్థులు, చేతి వృత్తిదారులు, కుల వృత్తిదారులు.. ఇలా అనేక వర్గాల ప్రజలు తమ కష్టాలు తీరుస్తాడనే నమ్మకంతో జగన్‌కు చెప్పుకునేందుకు తరలి వచ్చారు. జిల్లాలో 9 నియోజకవర్గాల్లో 266.5 కిలో మీటర్ల యాత్ర జన ప్రభంజనంగా కొనసాగింది.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు:  మద్యపానంతో చిన్నాభిన్నమవుతున్న పేదల కుటుంబాలు. సాగునీటి సమస్యలను అధిగమించినా తగ్గిన దిగుబడులు, గిట్టుబాటు ధరల్లేక నష్టపోతున్న రైతులు. ధరల దోపిడీకి గురవుతున్న ఆక్వా రైతులు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందక చదువులు కొనసాగించలేని విద్యార్థులు, బతుకుదెరువు లేక కష్టాలు పడుతున్న వివిధ సామాజిక వర్గాల ప్రజలు.. ఇలా ఎందరెందరికో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర జనవాణిగా మారింది. సింహపురి రాజకీయ దిశా నిర్దేశాన్ని మార్చేలా జన ప్రభంజనం నడుమ జిల్లాలో పాదయాత్ర జరిగింది.  గత ఏడాది జనవరిలో జరిగిన పాదయాత్ర నింపిన స్ఫూర్తి నేటికీ ప్రజల్లో, వైఎస్సార్‌సీపీలోనూ ఆశల పరవళ్లు తొక్కుతోంది. ప్రతి పల్లెలో తమ ఆత్మీయ బంధువు వచ్చిన రీతిలో అపూర్వంగా స్వాగతించి జననేత పల్లె దాటే వరకు గ్రామం మొత్తం కదిలి వచ్చింది. పర్యవసనంగా జిల్లాలో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర జనప్రభంజనంలా కొనసాగింది. ప్రస్తుత మాజీ ఎంపీలు మొదలుకొని వేలాది మంది నేతలు జననేత వెంట జిల్లాలో నడిచారు. జిల్లాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభిమానులు కొందరయితే ఇడుపులపాయ నుంచి మొదలై జగన్‌ వెంటే ఇచ్ఛాపురం వరకు కొనసాగుతున్నారు. మొత్తం మీద జగన్‌ పాదయాత్ర జనజాతరలా కొనసాగుతోంది.జిల్లాలో గత ఏడాది జనవరి 23న ప్రజాసంకల్ప యాత్ర జిల్లాలోకి ప్రవేశించింది. చిత్తూరు జిల్లాలో యాత్ర ముగిసి ఉదయం 10.20 గంటలకు సూళ్లూరుపేట

నియోజకవర్గంలోని పెళ్లకూరు మండలం పునబాక గ్రామంలోకి ప్రవేశించి అక్కడి నుంచి జిల్లాలో పాదయాత్ర అడుగులు మొదలయ్యాయి. అశేషంగా తరలివచ్చిన జనవాహినికి అభివాదం చేస్తూ అందరిని పలకరిస్తూ స్వాగతించిన జిల్లా నేతలను అందరినీ కరచాలనం చేస్తూ మొదలైన యాత్ర ఫిబ్రవరి 15వ తేదీ వరకు కొనసాగింది. ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం నేకునాంపేటలో యాత్ర ముగిసింది. యాత్ర ఆద్యంతరం పార్టీ ముఖ్యులు, క్రియాశీలక కార్యకర్తలు, వైఎస్‌ జగన్‌ అభిమానులు ఆయన వెంటే నడిచారు. ప్రధానంగా జిల్లాలో నెల్లూరు మాజీ పార్లమెంట్‌ సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి యాత్ర ఆద్యంతం జగన్‌ వెంటే ఉన్నారు. ఏడు పదుల వయస్సులో కూడా ఆయన నిత్యం జగన్‌తో నడిచి క్యాడర్‌లో ఉత్సాహం నింపారు. ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి కూడా పునబాక గ్రామం నుంచి నేకునాం పేట ముగింపు వరకు నిత్యం జగన్‌ వెంటే నడిచారు. ప్రతి నియోజకవర్గంలో పార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు జగన్‌ వెంటే ఆయా నియోజకవర్గాలు ఆసాంతం నడిచారు. జిల్లాలో వెయ్యి కిలోమీటర్ల మైలరాయి అధిగమించిన చారిత్రాత్మక ఘట్టం సైదాపురంలో ఆవిష్కృతమైంది. ఈ సందర్భంగా వాక్‌ విత్‌ జగన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు , అశేషంగా తరలివచ్చిన జన ప్రభంజనం ఆయన వెంటే అడుగులు వేశారు. ఇక పాదయాత్రకు ఇతర జిల్లాల నేతలు కూడా పోటెత్తారు. ముఖ్యంగా శ్రీకాకుళం మొదలుకొని వైఎస్సార్‌ జిల్లా వరకు అనేక మంది ముఖ్య నేతలు ఒక్కొక్క నియోజకవర్గంలో జగన్‌ను కలిసి ఆయనతో నడిచారు. ఇక జగన్‌ అభిమానులు అనేక మంది జిల్లాలోని 9 నియోజకవర్గాల్లోని 14 మండలాలు 142 గ్రామాల్లో 266.5 కిలో మీటర్లు ఆసాంతం జననేత వెంటే ఉన్నారు. 

మరిన్ని వార్తలు