ఇప్పటికైనా పంచుతారా?

4 Jul, 2015 04:03 IST|Sakshi
ఇప్పటికైనా పంచుతారా?

 పిఠాపురం / తుని : కాకినాడ సెజ్ (కేఎస్‌ఈజెడ్) భూములు కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ నేతలకు చెందినవంటూ తెలుగుదేశం నేతలు చేసిన గోబెల్స్ ప్రచారానికి తెరపడింది. ‘ఆ భూములు తనవైతే వాటిని సంబంధిత రైతులకు పంచేయాలని’ వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం పెరుమాళ్లపురంలో బహిరంగసభలో మాట్లాడుతూ చేసిన ప్రకటనతో ‘దేశం’ నేతల గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టరుుంది. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సెజ్ భూముల్లో ఏరువాక సాగించి, అధికారంలోకి వస్తే రైతులకు భూములు తిరిగి ఇస్తామన్నారని, ఇప్పటి వరకూ మీనమీషాలు లెక్కించిన సర్కారు ఇప్పుడైనా భూముల్ని పంచుతుందా అని రైతులు ప్రశ్నిస్తున్నారు.

ఎన్నికల ముందు వరకూ సెజ్ భూములు జగన్‌వి అంటు ప్రచారం చేసి, సెజ్ వ్యతిరేక పోరాట సమితికి వెన్నుదన్నుగా ఉంటామని ప్రకటనలు చేసిన పిఠాపురం, తుని నియోజకవర్గాల తెలుగుదేశం నేతలు ఎన్నికల అనంతరం పారిశ్రామికీకరణ మంత్రం జపిస్తుండడం వెనుక మర్మమేమిటని నిలదీస్తున్నారు. భూములు సేకరించి ఏళ్లు దాటినా ఒక్క పరిశ్రమా రాలేద ని బహిరంగంగా ప్రకటనలు చేసిన ‘దేశం’ నేతలు ప్రస్తుతం సెజ్ వ్యతిరేక పోరాట సమితి నాయకులనే సెజ్ అనుకూల సమితిగా మార్చేసి మరీ పరిశ్రమలు రావాలని జపం చేస్తుండడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు.

 పగ్గాలు చేపట్టి ఏడాదైనా ఏవీ పరిశ్రమలు?
 తమ జీవనాధారమైన భూములను బలవంతంగా లాక్కుని అన్యాయం చేస్తున్నారని స్థానిక సెజ్ రైతులు గురువారం  వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌కు వినతి పత్రం ఇచ్చారు. దీంతో ఆయన రైతుల ‘ఆ భూములు తనవని ప్రచారం చేస్తున్న తెలుగుదేశం నాయకులు తక్షణం వాటిని రైతులకు పంచడానికి తాను సుముఖంగా ఉన్నానని, వెంటనే పంచేయాలని’ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘అలా పంపిణీ చేస్తే చాలా సంతోషిస్తా’నని ఆయన అన్న మాటలతో సెజ్ రైతుల్లో నూతనోత్సాహం పెల్లుబికింది.

అలాగే ఎకరం రూ.కోటి వరకు పారిశ్రామికవేత్తలకు అమ్ముకుంటున్న ప్రభుత్వం సెజ్‌కు సేకరించిన భూముల రైతులకు రూ.70 లక్షలైనా చెల్లించాలని బహిరంగ సభలో డిమాండ్ చేశారు. 2002లో కాకినాడ సెజ్‌కు నోటిఫికేషన్ ఇచ్చి, జీఓ విడుదల చేసింది చంద్రబాబు నాయుడేనని, అప్పట్లో ఎకరం ధర రూ.1.50 లక్షలుగా నిర్ణయించింది తెలుగుదేశం ప్రభుత్వమేనని, సెజ్‌లో భూములు కోల్పోయిన  రైతులను నిలువునా నమ్మించడానికి ఏరువాక సాగిస్తూ ‘దేశం’ అధినేత ఆడింది నాటకమని జగన్ ధ్వజమెత్తడంతో తమ బతులకు భరోసా ఇచ్చారంటు సెజ్ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పదివేల ఎకరాలు సేకరించి ఇప్పటి వరకు ఆరేళ్లుగా ఎటువంటి పరిశ్రమలు స్థాపించలేదని, గత ప్రభుత్వాలను విమర్శించిన తెలుగుదేశం అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఎందుకు పరిశ్రలు స్థాపించలేక పోయిందని, నిరుద్యోగులకు భరోసా ఇవ్వలేక పోయిందని రైతులు ప్రశ్నిస్తున్నారు. నిన్నటి వరకు ఆ భూములు కాంగ్రెస్‌వని ఒకసారి, వైఎస్సార్ సీపీవని ఒకసారి ప్రకటనలు చేసిన ‘దేశం’ నేతలు జగన్ ప్రకటనతో ఇప్పటికైనా స్పష్టత ఇవ్వాలని, భూములు ఎప్పుడు పంచేది బహిరంగంగా తెలపాలని కోరుతున్నారు.

 ఎమ్మెల్యే దాడిశెట్టికి అభినందన
 తమ సమస్యను జగన్ దృష్టికి తీసుకెళ్లిన తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా చొరవతోనే ఆయన తమకు భరోసా ఇచ్చారని సెజ్ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమను నమ్మించి నట్టేట ముంచిన ‘దేశం’ నేతల అసలు స్వరూపం జగన్ ప్రకటనతో బయట పెట్టించారని ఎమ్మెల్యే రాజాను అభినందిస్తున్నారు.

మరిన్ని వార్తలు