పాయకపాడు చేరుకున్న వైఎస్‌ జగన్‌

11 Nov, 2018 16:37 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం/ హైదరాబాద్‌: పెను ప్రమాదం నుంచి బయటపడ్డ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం నుంచి ప్రజాసంకల్పయాత్రను పునఃప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం వైఎస్‌ జగన్‌ ఆదివారం రాత్రి విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం పాయకపాడు చేరుకున్నారు. అక్కడ ఈ రోజు రాత్రి జననేత బస చేయనున్నారు. రేపు ఉదయం మేలపువలస నుంచి వైఎస్‌ జగన్‌ పాదయాత్ర ప్రారంభించనున్నారు.

పాదయాత్రలో పాల్గొనేందుకు వైఎస్‌ జగన్‌ ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరారు. ఆ సమయంలో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. జననేత శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సమయంలో అభిమానులు ఆయన్ని చుట్టుముట్టారు. అక్కడ వారికి అభివాదం చేస్తూ ఆయన ముందుకు కదిలారు. తరువాత విశాఖకు బయలుదేరారు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న వైఎస్‌ జగన్‌కు అక్కడికి భారీగా చేరుకున్న ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. జై జగన్‌ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తన మీద ప్రేమతో అక్కడికి తరలివచ్చిన అభిమానులకు వైఎస్‌ జగన్‌ చిరునవ్వుతో అభివాదం చేస్తు ముందుకు కదిలారు. వైఎస్ జగన్‌ వెంట వైఎస్సార్‌ సీపీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మిథున్‌ రెడ్డిలు కూడా విశాఖ చేరుకున్నారు.

అక్కడి నుంచి వైఎస్‌ జగన్‌  రోడ్డు మార్గంలో పాయకపాడుకు చేరుకున్నారు. మార్గమధ్యలో రామభద్రాపురం జంక్షన్‌ వద్ద తన రాక కోసం నిరీక్షిస్తున్న అభిమానులకు వైఎస్‌ జగన్ తన వాహనాన్ని ఆపి అభివాదం చేశారు. వైఎస్ జగన్‌ బస చేస్తున్న చోటుకి భారీగా చేరుకున్న కార్యకర్తలు, అభిమానులు జై జగన్‌ అంటూ నినాదాలు చేస్తున్నారు.

గత నెల 25న వైఎస్‌ జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయనకు చికిత్స అందించిన వైద్యుల విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇవ్వడంతో పాదయాత్రకు విరామం ప్రకటించారు. ప్రాణపాయం నుంచి తప్పించుకున్న జననేత 17 రోజుల విరామం తరువాత.. తమ కష్టాలను తెలుసుకోవడానికి తిరిగి పాదయాత్రను ప్రారంభించనున్న నేపథ్యంలో ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు ప్రజలు, పార్టీ కార్యకర్తలు సిద్దమయ్యారు. విశాఖకు చేరుకోనున్న జననేతకు చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు భారీగా ఎయిర్‌పోర్ట్‌కు తరలివస్తున్నారు. ఆయన ఆరోగ్యం బాగుండాలని వైఎస్‌ జగన్‌ అభిమానులు నేడు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజన్న బిడ్డపై హత్యాయత్నం జరిగిన తరువాత ఆందోళనకు గురయిన అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు.. తిరిగి జననేత తమ మధ్యకు వస్తున్నారనే ఆనందంతో ఆయన రాక కోసం ఎదురుచూస్తున్నారు.

మరిన్ని వార్తలు