అర్హులందరికీ ఇళ్ల పట్టాలు: సీఎం జగన్‌

24 Jan, 2020 15:59 IST|Sakshi

ఇళ్ల పట్టాల పంపిణీపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష

సాక్షి, అమరావతి: అర్హులు ఎంతమంది ఉన్నా అందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఉగాది నాటికి పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీపై క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సీఎం సమీక్ష జరిపారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, అధికారులు హాజరయ్యారు. ‘అమ్మఒడి’ తర్వాత ప్రభుత్వం చేపడుతున్న మరో అతి పెద్ద కార్యక్రమం అని సీఎం పేర్కొన్నారు. ఏ ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో ఇళ్ల పట్టాలు ఇవ్వలేదని తెలిపారు. ప్రజాసాధికార సర్వే అన్నది ప్రమాణం కాకూడదని.. వాలంటీర్లు క్షేత్రస్థాయిలో గుర్తించిన అంశాలు ప్రామాణికం కావాలన్నారు. ఇళ్ల పట్టాల కోసం గుర్తిస్తున్న స్థలాలు ఆవాస యోగ్యంగా ఉండాలన్న ప్రాథమిక విషయాన్ని మరిచిపోకూడదని అధికారులకు సీఎం సూచించారు.



ఇళ్ల స్థలాల పట్ల లబ్ధిదారులు సంతృప్తి చెందాలి..
‘అందరికీ పట్టాలు ఇవ్వాలి కదా అని... లబ్ధి దారులకు ఉపయోగం లేని చోట ఇవ్వడంలో అర్థం లేదు. ఇళ్లపట్టాలు ఇస్తున్న స్థలాలు పట్ల లబ్ధిదారులు సంతృప్తి వ్యక్తం చేయాలి. వారికి ఆవాసయోగ్యంగా ఉండాలి. ఈ అంశాలను అధికారులు దృష్టిలో పెట్టుకోవాలి. వీలైనంత వరకు ఇళ్ల పట్టాలకోసం అసైన్డ్‌ భూములను తీసుకోవద్దు’ అని సీఎం సూచించారు. ఇళ్లపట్టాల కోసం సడలించిన అర్హతల వివరాలను గ్రామ సచివాలయాల్లో డిస్‌ప్లే చేయాలని సీఎం పేర్కొన్నారు. ఈ వివరాలను గ్రామ సచివాలయాలకు అందుబాటులో ఉంచడంతో పాటు.. ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే.. వారు దరఖాస్తు చేసుకునేలా ఆ సమాచారం గ్రామ సచివాలయాలకు అందుబాటులో ఉండాలని సీఎం పేర్కొన్నారు.

లబ్ధిదారుల అభిప్రాయం తప్పనిసరి..
‘లబ్ధిదారుల అభిప్రాయం తప్పనిసరిగా తీసుకోవాలి. ఇళ్ల పట్టాల కోసం ఎంపిక చేసిన స్థలాలపై లబ్ధిదారులు ఆమోదం తెలిపిన తర్వాతనే ప్లాటింగ్‌ చేయాలి. లేకపోతే డబ్బు వృథా అవుతుందని’ సీఎం స్పష్టం చేశారు. ఇళ్ల పట్టాల కోసం కేటాయించిన స్థలాల్లో మొక్కలను పెంచాలని ముఖ్యమంత్రి సూచించారు. మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీల్లో లబ్ధిదారులందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఆయన ఆదేశించారు.

ఇంటి స్థలం లేనివారు ఎవరూ ఉండకూడదు..
పేదలకు కట్టించే ఇళ్ల డిజైన్‌ బాగుండాలని ఆ మేరకు ప్రతిపాదనలు తయారు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. ఇంటి స్థలం లేనివారు ఎవ్వరూ ఉండకూడదని స్పష్టం చేశారు. అభ్యంతరకర ప్రాంతాల్లో ఉన్న నిరుపేదలకు ప్రత్యామ్నాయం కూడా వెంటనే చూపించాలని సీఎం తెలిపారు. వారికి ఇళ్లపట్టాలు ఎక్కడ ఇస్తున్నామో చెప్పాలని.. వారికి ఇళ్లు కట్టి అప్పగించి.. వారిని సంతోషం పెట్టిన తర్వాతనే వారిని అక్కడ నుంచి ఖాళీ చేయమని కోరాలని సీఎం పేర్కొన్నారు. ఇళ్ల పట్టాలు ఇవ్వగానే ఇళ్లు కట్టడానికి, లబ్ధిదారులు అక్కడకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఈ విషయంలో అధికారులు హడావుడిగా వ్యవహరించడం తగదని.. ఈ మేరకు కలెక్టర్‌ ఆదేశాలు ఇవ్వాలని సీఎం అన్నారు.

1 నుంచి గ్రామాల్లో పర్యటిస్తా..
‘ఫిబ్రవరి 1 నుంచి నేను గ్రామాల్లో పర్యటిస్తాను. రాండమ్‌గా ఒక పల్లెలోకి వెళ్లి పరిశీలిస్తాను. లబ్ధిదారుల ఎంపిక, పథకాలు అమలు జరుగుతున్న తీరును స్వయంగా పరిశీలిస్తాను’ అని సీఎం పేర్కొన్నారు.  పొరపాట్లు జరిగితే కచ్చితంగా అధికారులను బాధ్యులను చేస్తామన్నారు. ఇళ్ల పట్టాల కోసం అధికారులు గుర్తించిన స్థలాల వివరాలను గ్రామ సచివాలయాల్లో డిస్‌ప్లే చేయాలన్నారు.  అక్కడ ప్రజల అభిప్రాయాలను స్వీకరించాలన్నారు. ప్రజలను సంతోషంగా ఉంచాలి కాని, దాన్ని డ్యూటీగా చూడకూడదని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

(చదవండి: ఫిబ్రవరి 1 నుంచి సీఎం వైఎస్‌ జగన్‌ పల్లెబాట)

మరిన్ని వార్తలు