‘నాడు–నేడు’ పనుల్లో నాణ్యత ముఖ్యం

20 Dec, 2019 03:31 IST|Sakshi
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖ అధికారులతో జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం జగన్‌

అధికారుల సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి : ప్రభుత్వ స్కూళ్ల రూపు రేఖలు మార్చేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘నాడు–నేడు’ పనుల్లో నాణ్యత ముఖ్యమని, ఈ విషయంలో ఎక్కడా రాజీపడొద్దని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. స్కూళ్లలో బాత్‌రూములు రన్నింగ్‌ వాటర్‌తో పరిశుభ్రంగా ఉండాలని, ప్రతి పాఠశాలలో విద్యార్థులకు పరిశుభ్రమైన తాగునీరు అందేలా ఏర్పాట్లు ఉండాలని చెప్పారు. గ్రామాల పర్యటనలకు వెళ్లినప్పుడు తానే ఆయా ప్రాంతాల్లోని స్కూళ్లను స్వయంగా పరిశీలిస్తానని స్పష్టం చేశారు.

‘నాడు–నేడు’, ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం నేపథ్యంలో ఉపాధ్యాయులకు శిక్షణ.. తదితర అంశాలపై గురువారం ఆయన పాఠశాల విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మొదటి విడతలో 15,715 పాఠశాలల్లో ‘నాడు–నేడు’ పనులు చేపడుతున్నామని, ఇందులో పాల్గొనే 1100 మంది ఇంజనీర్లకు 55 మంది మాస్టర్‌ ట్రయినర్ల ద్వారా శిక్షణ ఇచ్చామని అధికారులు వివరించారు.  మండలాల స్థాయిలో 2010 మందికి, పేరెంట్స్‌ కమిటీల్లోని 50 వేల మందికి వచ్చే నెలలోపు శిక్షణ పూర్తి చేయనున్నామని తెలిపారు. పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని, అన్ని పనులు వంద శాతం నాణ్యతతో ఉండాలని సీఎం వారికి స్పష్టం చేశారు. రెండో విడతలో నాడు–నేడు కింద చేపట్టే పనులను జూన్‌ నుంచి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

నాడు–నేడుకు అందరి సహకారం అవసరం
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నాడు–నేడు కార్యక్రమానికి సహకారం అందించేందుకు కార్పొరేట్‌ సంస్థలు ముందుకు వస్తున్నాయి. హెటిరో, వసుధ ఫార్మా, ఆదిలీల ఫౌండేషన్, రెయిన్‌ కార్బన్‌ లారస్‌ ల్యాబ్స్‌ సంస్థలు పాఠశాల విద్యాశాఖ గుర్తించిన 2,566 ప్రభుత్వ స్కూళ్లలో రూ.85.65 కోట్లతో నాడు–నేడు కింద అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నాయి. కనెక్ట్‌ టు ఆంధ్రా కార్యక్రమం కింద నాడు–నేడులో భాగస్వామ్యం అయ్యేలా గురువారం సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో 5 కార్పొరేట్‌ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ స్కూళ్లు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి.

నాడు– నేడు ద్వారా వాటిని అభివృద్ధి చేస్తున్నాం. 45 వేలకుపైగా ప్రభుత్వ స్కూళ్లను రూ.12 వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నాం. ఇంగ్లిష్‌ ల్యాబ్‌లు, 9 రకాల సదుపాయాలను ప్రతి ప్రభుత్వ స్కూల్లోనూ కల్పిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంను 1 నుంచి 6వ తరగతి వరకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రవేశపెడుతున్నాం. ఆ తర్వాత ఒక్కో ఏడాది ఒక్కో తరగతి పెంచుకుంటూ వెళ్తాం. ‘అమ్మ ఒడి’ ద్వారా పిల్లలను బడికి పంపే తల్లులను ఆదుకుంటున్నాం. 2011 జనాభా లెక్కల ప్రకారం 33% ఉన్న నిరక్షరాస్యతను గణనీయంగా తగ్గిస్తాం’ అని అన్నారు.

విద్యా సంవత్సరం ఆరంభంలోనే బుక్స్, స్కూల్‌ కిట్లు
వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి పుస్తకాలు సహా స్కూలు కిట్లను విద్యార్థులకు అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెడుతున్నందున పాఠ్యాంశాల తయారీపైనా చర్చించారు. 94,889 మంది టీచర్లకు ఇంగ్లిష్‌ మీడియంలో బోధనపై శిక్షణ ఇస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇంగ్లిష్‌లో మంచి పరిజ్ఞానం ఉందన్న విషయం శిక్షణ కార్యక్రమాల ద్వారా వెల్లడైందని, ఆంగ్లంలో బోధన పట్ల ఉపాధ్యాయులు ఉత్సాహంగా ఉన్నారని వివరించారు.

స్కూళ్లలో 5, 6 తరగతుల్లోకి ప్రవేశించే విద్యార్థులకు సమ్మర్‌ క్యాంపులు నిర్వహిస్తామని చెప్పారు.కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్, ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్, ప్రణాళికా శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్, ప్రణాళికా శాఖ డిప్యూటీ సెక్రటరీ, కనెక్ట్‌ టు ఆంధ్రా సీఈఓ కోటేశ్వరమ్మ, నార్త్‌ అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పి.రత్నాకర్, వసుధ ఫార్మా మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం.వెంకట రామరాజు, లారస్‌ ల్యాబ్స్‌ సీఈవో చావా సత్యన్నారాయణ, హెటిరో డ్రగ్స్‌ ఎండీ వంశీకృష్ణ, రెయిన్‌ కార్బన్‌ సీజీఎం ఆదినారాయణస్వామి, సీఎఫ్‌ఎం జి.ఆర్‌.కుమార్, ఆదిలీల ఫౌండేషన్‌ నేషనల్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ ఎస్‌.ఆదినారాయణ పాల్గొన్నారు.

ఇంగ్లిష్‌ మీడియం.. దేశ, విదేశీ సంస్థల సహకారం
యూనివర్సిటీ ఆఫ్‌ షికాగో, సింగపూర్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ ఆఫ్‌ కాన్‌బెర్రా, కేంబ్రిడ్జ్‌ ఇంటర్నేషనల్, ఇంగ్లిష్‌ అండ్‌ ఫారెన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ (ఇఫ్లు), రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్, నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ ప్లానింగ్, రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్, ఐఐటీ మద్రాస్, అన్నా యూనివర్సిటీలు పాఠ్యాంశాల తయారీపై సహకారం అందిస్తున్నాయి.     
– సీఎం వైఎస్‌ జగన్‌తో అధికారులు

నాడు– నేడు కార్యక్రమంలో భాగస్వామ్యమవుతున్న వారందరినీ అభినందిస్తున్నా. అందరూ తలా ఒక చేయి వేయాలి. రాష్ట్రం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది. అలాగని, దృష్టి పెట్టాల్సిన అంశాలను విస్మరించలేం. ముఖ్యంగా విద్య, ఆరోగ్య రంగాలపై కచ్చితంగా దృష్టి పెట్టాల్సిందే. అందుకనే మీ అందరి సహకారం కోరుతున్నాం. మీరు చేస్తున్న సహాయాన్ని విస్మరించం. సహాయం చేస్తున్న వారి పేర్లు స్కూళ్లలో కూడా పెడతాం. ఈ కార్యక్రమం గురించి మీరు ఇతర సంస్థలకూ చెప్పాలి. తద్వారా అందరూ భాగస్వాములు కావాలి.
– సీఎం వైఎస్‌ జగన్‌

>
మరిన్ని వార్తలు