సాగునీటి ప్రాజెక్టులపై సీఎం జగన్‌ సమీక్ష

7 Jan, 2020 20:48 IST|Sakshi

సాక్షి, అమరావతి: అనుకున్న సమయానికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. అలసత్వానికి తావు లేకుండా.. శ్రద్ధ వహించాలని చెప్పారు. పనులకు అడ్డంకులు రాకుండా నిధులు ఎప్పటికప్పుడు సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. మంగళవారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో ఇరిగేషన్‌ శాఖపై సీఎం సమీక్షించారు. ఈ సమావేశానికి మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతిపై..
పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతిపై సీఎం సమీక్షిస్తూ.. ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత గల ప్రాజెక్టు పోలవరం అని స్పష్టం చేశారు. పనులకు ఒక్క రోజు కూడా ఇబ్బంది వచ్చే పరిస్థితి రాకూడదని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, కరవు బాధిత ప్రాంతాలకు జలాల తరలింపుపై సీఎం సమీక్షించారు. రాయలసీమ ప్రాజెక్టులకు వెళ్లే కాల్వల విస్తరణపై ప్రతిపాదనలను అధికారులు వివరించారు. సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలను కరవు పీడత ప్రాంతాలకు తరలింపుపై సీఎం సమీక్షించారు. గోదావరి నీటిని వయా బొల్లాపల్లి మీదగా బనకచర్లకు తరలించే ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిపైనా కూడా సీఎం సమీక్ష జరిపారు. విశాఖకు నిరంతరం తాగునీటి సరఫరా కోసం పైపులైన్లు వేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

>
మరిన్ని వార్తలు