ముందే 'మద్దతు'

4 Oct, 2019 03:26 IST|Sakshi

పంటలు వేసేటప్పుడే ధరలు ప్రకటించాలి

రైతులకు నష్టం రాకుండా ప్రణాళిక రూపొందించాలి

మార్కెటింగ్, సహకార శాఖలపై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌

కనీస మద్దతు ధరలు లేని పంటలకూ ధరలు ప్రకటించాలి

ఆరు నెలల్లోగా దళారీ వ్యవస్థను నిర్మూలించాలి

చిరుధాన్యాల హబ్‌గా రాయలసీమ

నెలాఖరులోగా చిరుధాన్యాల బోర్డు

వ్యవసాయ ఉత్పత్తుల నిల్వకు గోడౌన్లు,కోల్డ్‌ స్టోరేజీలపై సమగ్ర పరిశీలన

సహకార రంగం బలోపేతానికి ప్రతిష్టాత్మక సంస్థతో అధ్యయనం

ప్రభుత్వం జోక్యం చేసుకున్న తర్వాత పరిస్థితి కచ్చితంగా మారాల్సిందేనని, రైతులకు భరోసా ఇచ్చామన్న నమ్మకం కలగాలని స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయి వరకు అది జరగాలని చెప్పారు. ఆరు నెలల్లోగా దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు అధికారులు సవాలుగా తీసుకుని పని చేయాలని ఆదేశించారు.  రైతుల ప్రయోజనమే లక్ష్యంగా మార్కెటింగ్‌ విధానాలు ఉండాలని, గ్రామ సచివాలయాల్లోనే క్రాప్‌ వివరాలు, ధరలు ప్రకటించాలని.. రైతులు నేరుగా ఫోన్‌ చేసి సహాయం అడిగే అవకాశం ఉండాలని చెప్పారు.

దీనివల్ల ప్రైవేట్‌ వ్యక్తులు కూడా మంచి ధరలకు రైతుల నుంచి పంట కొనుగోలు చేస్తారని, ఇ–క్రాప్‌ నమోదుపై వలంటీర్ల ద్వారా రైతులకు సమాచారం ఇవ్వాలని, గ్రామ సచివాలయాల్లో డిస్‌ప్లే బోర్డులు ఉంచాలని సీఎం సూచించారు. కనీస మద్దతు ధర లేని పంటలకు ధరలు ప్రకటించాలని, రైతుకు నష్టం రాకుండా ఈ ధరలు నిర్ణయించాలని స్పష్టం చేశారు. పంటల దిగుబడి ఏ స్థాయిలో ఉంటాయన్న దానిపై అంచనాలు రూపొందించాలని, గత ఏడాదితో పోల్చి ఈ వివరాలు తయారు చేయాలని ఆదేశించారు.

మార్కెట్లపై నిరంతర సమాచారం
మూడు మార్గాల్లో వ్యవసాయ ఉత్పత్తులు, వాటికున్న డిమాండ్, వివిధ ప్రాంతాల్లో ధరలపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాలని, ఇప్పుడున్న అగ్రికల్చర్‌ మార్కెట్‌ కమిటీలు, అగ్రివాచ్‌ సహా మరో ఏజెన్సీ ఏర్పాటుకు గత సమీక్షలో తీసుకున్న నిర్ణయంపై ప్రతిపాదనలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వ్యవసాయ ఉత్పత్తుల భవిష్యత్‌ ధరలు, బిజినెస్‌ కన్సల్టెన్సీ, ధరల స్థిరీకరణ నిధి నిర్వహణ, వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువ జోడించడం ఈ ఏజెన్సీ విధులుగా ఉండాలని ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు.

ఇందులోనూ నిపుణులు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ కోసం ఇప్పుడున్న గోడౌన్లు, కోల్డ్‌ స్టోరేజీలపై సమగ్ర పరిశీలన చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న అవసరాలు, వాటిని తీర్చేలా గోడౌన్లు, కోల్డ్‌ స్టోరేజీలపై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. చేపలు, ఇతర సముద్ర ఉత్పత్తుల కోసం ఎన్ని కోల్డ్‌ స్టోరేజీలు ఉండాలన్న దానిపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. ఇందుకు ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ఆలోచించాలని సూచించారు. 

సహకార రంగాన్ని పునర్‌ వ్యవస్థీకరించాలి
జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల నష్టాలను అధ్యయనం చేసేందుకు ఒక కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులను తిరిగి బలోపేతం చేయడంపై కార్యాచరణ ప్రణాళిక ఇవ్వాలన్నారు. ప్రస్తుతం ఉన్న సమస్యలు, వాటిని పరిష్కరించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి అందులో సమగ్రంగా ఉండాలని సూచించారు. అవినీతి, పక్షపాతానికి తావులేని విధానం ఉండాలని, సహకార రంగాన్ని పూర్తి స్థాయిలో పునర్‌ వ్యవస్థీకరించాలని స్పష్టం చేశారు.

ఈ వ్యవస్థను బాగు చేయడానికి ఏం చేయాలో అది చేద్దామని, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను కంప్యూటరీకరించే దిశగా చర్యలు తీసుకుంటామని, ప్రతిష్టాత్మక సంస్థతో సమగ్ర పరిశీలన, అధ్యయనం చేయించాలని సీఎం పేర్కొన్నారు. ఆప్కో పునరుద్ధరణ, బలోపేతంపై కూడా అధ్యయనం చేయించాలని, ఆరు నెలల్లో సిఫార్సుల అమలు ప్రారంభంకావాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షలో మంత్రులు కన్నబాబు, మోపిదేవి వెంకటరమణతో పాటు సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొన్నారు.    

ప్రభుత్వ జోక్యంతో మార్కెట్లో ధరల స్థిరీకరణ
రాష్ట్రంలో 85 రైతు బజార్లలో కిలో రూ.25 చొప్పున ఉల్లిపాయలు విక్రయిస్తున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. 660 మెట్రిక్‌ టన్నులు వినియోగదారులకు ఇచ్చామని, కిలో ఉల్లి ధరను రూ.32కు అదుపు చేయగలిగామని వివరించారు. మళ్లీ ధరలు పెరిగిన క్రమంలో ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. రాష్ట్రంలో ఇప్పుడు సరిపడా నిల్వలు ఉన్నాయా? లేదా? అని ఆరా తీయగా సరిపడా నిల్వలు ఉన్నాయని అధికారులు తెలిపారు. టమాటా రైతులను కూడా ఆదుకున్నామని, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో మార్కెటింగ్‌ అవకాశాలు చూసి ఆ మేరకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. పప్పు ధాన్యాల కొనుగోళ్లపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. రైతులు ఈ నెల 10వ తేదీ నుంచి అన్ని ఆరు తడి పంటల వివరాలను ఆన్‌లైన్లో నమోదు చేయించుకోవాలని అధికారులు తెలిపారు. ఈ నెల 15 నుంచి కొనుగోలు ప్రారంభిస్తామని చెప్పారు.

చిరు ధాన్యాల బోర్డు ఏర్పాటు
రాయలసీమ ప్రాంతాన్ని చిరు ధాన్యాల హబ్‌గా రూపొందించాలని, ఈ నెలాఖరులోగా చిరు ధాన్యాల బోర్డును ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. వచ్చే 9 నెలల పాటు గ్రీన్‌ కవర్‌ ఉండేలా చూడాలని సూచించారు. చిరుధాన్యాల బోర్డులో సంబంధిత రంగాలకు చెందిన నిపుణులకు పెద్దపీట వేయాలన్నారు. వ్యవసాయ విధానాలు, మార్కెటింగ్, ప్రాసెసింగ్‌ తదితరాలను బోర్డు పరిధిలోకి తీసుకురావాలన్నారు. బోర్డు విధి విధానాలపై కూడా చర్చించారు.

►రైతుల ప్రయోజనమే లక్ష్యంగా మార్కెటింగ్‌ విధానాలు ఉండాలి. దళారులకు పంటలను తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి రైతులకు రాకూడదు. దళారులు లేకుండా వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలు జరగాలి. అరటి, చీని, మామిడి, కమల, బొప్పాయి సహా ఏ పంట విషయంలోనైనా దళారులు లేకుండా చూడాలి. సీఎం వైఎస్‌ జగన్‌

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా