‘కాలేజీలు నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి’

28 Nov, 2019 19:31 IST|Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని అన్ని కాలేజీలు నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీచేశారు. గురువారం ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌తో సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌తో పాటు కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య, కమిటీ సభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషన్‌ చేపడుతున్న కార్యక్రమాలపై అధికారులు సీఎం వైఎస్‌ జగన్‌కు ప్రజంటేషన్‌ ఇచ్చారు. అలాగే కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పిల్లలకు పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వబోతున్నామని మరోసారి స్పష్టం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లలతోపాటు పేద పిల్లలు చాలా మంది దీనివల్ల లబ్ధి పొందుతారని తెలిపారు. 

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కాకుండా డిగ్రీ, ఆపై కోర్సులు చదువుతున్న వారికి ఏడాదికి రూ. 20వేల వసతి, భోజన ఖర్చుల కోసం ఇవ్వబోతున్నట్టు తెలిపారు. కోర్సుల పాఠ్యప్రణాళిక మార్చబోతున్నట్టు తెలిపిన సీఎం వైఎస్‌ జగన్‌.. ఉద్యోగం, ఉపాధి కల్పించేలా  రూపొందించబోతున్నట్టు పేర్కొన్నారు. అలాగే ఏడాది పాటు అదనంగా అప్రెంటిస్‌ ఉంటుందని.. అందువల్ల వీటిని మాములు డిగ్రీలుగా కాకుండా ఆనర్‌ డిగ్రీలుగా పరిగణించాలని సూచించారు. ఒక ఏడాది అనుభవంతో కూడిన డిగ్రీకి మంచి విలువ ఉంటుందని.. సరైన ప్రాక్టికల్‌ అనుభవం లేకపోతే పోటీ ప్రపంచంలో నిలవలేరని అభిప్రాయపడ్డారు. ఉద్యోగాల కోసం దేశంలో కానీ, ప్రపంచంలో కానీ తీవ్రమైన పోటీ నెలకొందని గుర్తుచేశారు.

అన్ని కాలేజీలు నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. లంచాలు ఇస్తే సరిపోతుందనే భావన కనిపించకూడదని తెలిపారు. నిర్దేశించుకున్న ప్రమాణాలను కాలేజీలు తప్పకుండా పాటించాలని అన్నారు. అందుకోసం అవసరమైతే కాలేజీలకు ఆరు నెలల సమయం ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు మెరుగుపడ్డాయన్న సందేశం వినిపించాలని అన్నారు. నియమాలు,  నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవనే భయం ఉండాలన్నారు. అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విషయంలో కాలేజీలకు ఎలాంటి బకాయిలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం వైపు నుంచి చేయాల్సిందంతా చేద్దామని చెప్పారు.

కాలేజ్‌ల్లో తనిఖీల సందర్భంగా గుర్తించిన అంశాలను కమిషన్‌ సభ్యులు ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌కు వివరించారు. కాలేజీల్లో ఏఐసీటీఈ మార్గదర్శకాల ప్రకారం క్వాలిఫైడ్‌ స్టాఫ్‌ లేరని కమిషన్‌ సభ్యులు తెలిపారు. ప్రయోగశాలల్లో పరికరాలు సరిగ్గాలేవని గుర్తించామన్నారు. టీచర్లు, స్టూడెంట్స్‌ హాజరు రిజిస్టర్‌లు కూడా సరిగా లేవని చెప్పారు. ఫైనాన్స్‌, జీతాల చెల్లింపులకు సంబంధించిన రికార్డులు సక్రమంగా లేవని.. చాలా కాలేజీల్లో ఆడ్మిషన్లు చాలా స్వల్ఫంగా ఉన్నాయని వివరించారు. 

ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెడుతున్నందుకు ధన్యవాదాలు..
పాఠశాలల్లో 1వ తరగతి నుంచి ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెడుతున్నందుకు సీఎం వైఎస్‌ జగన్‌కు కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య ధన్యవాదాలు తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ అమలు చేస్తోన్న కార్యక్రమాలపై దేశం మొత్తం చూస్తోందన్నారు. తన చిన్నతనంలో ఒక ముక్క ఇంగ్లిష్‌ మాట్లాడితే గొప్పగా చూసేవాళ్లమని గుర్తుచేశారు. అలాంటిది పేదపిల్లలకు చిన్నప్పటి నుంచే ఇంగ్లిషులో బోధన ద్వారా ఉత్తమ విద్య అందించాలన్న సంకల్పం చాలా గొప్పదని అన్నారు. వాళ్లు ఒకటి పాటించి.. వేరేవాళ్లు ఇంకోటి చేయాలన్న రీతిలో ఇంగ్లిష్‌ మీడియంపై కొందరు మాట్లాడటం సరికాదని సూచించారు. 

>
మరిన్ని వార్తలు