అకాల వర్షాలు: పంట నష్టంపై సీఎం జగన్‌ సమీక్ష

10 Apr, 2020 12:37 IST|Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు, పంట నష్టంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పంట నష్టం వివరాలను వెంటనే నమోదు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని, యుద్ధ ప్రతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పిడుగుపాటు, బోటు ప్రమాదాల్లో మరణించినవారికి 24 గంటల్లో పరిహారం చెల్లించాలని జిల్లా కలెక్టర్లను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఈ సమావేశానికి మంత్రి మోపిదేవి వెంకటరమణ, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, హెల్త్ చీఫ్‌ స్పెషల్ సెక్రటరీ హాజరయ్యారు. 

ఇక పంటలు చేతికొచ్చి కోయాల్సిన సమయంలో అకాల వర్షాలు రైతులను దెబ్బతీశాయి. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా చేతికొచ్చిన పంట నేలపాలయ్యింది. ఈదురు గాలులతో కూడిన వాన రైతుల్ని అతలాకుతలం చేసింది. వందల ఎకరాల్లోని పంటలు నేలకొరిగాయి. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు