'నైపుణ్య కేంద్రాల్లో అంతర్జాతీయ స్థాయి శిక్షణ'

16 Apr, 2020 18:56 IST|Sakshi

సాక్షి, అమరావతి : అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులు ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  పేర్కొన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై గురువారం పరిశ్రమలు, ఐటీ శాఖల అధి​కారులతో క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యునివర్సిటీ ఏర్పాటు, భవనాల నిర్మాణం, ప్రవేశ పెట్టాల్సిన కోర్సులపై చర్చించారు. కోర్సులు, పాఠ్యప్రణాళిక తయారీలో అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యం తీసుకోవాలన్నారు. ఐటీఐ, డిప్లమో, ఇంజినీరింగ్‌ సహా ఇతర కోర్సులు పూర్తిచేసినవారి నైపుణ్యాలను మరింత మెరుగుపరచాలన్నారు. (విద్యార్థుల మృతదేహాలను రప్పించండి)

ఇప్పటికే ఆ తరహా  కోర్సులు చేస్తున్న వారికి ఏడాది అప్రెంటిస్‌ ఇవ్వడమే యూనివర్శిటీ, నైపుణ్య కేంద్రాల ప్రధాన ఉద్దేశం అని సీఎం స్పష్టం చేశారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు అభివృద్ధి చేయడం, అంతర్జాతీయ స్థాయి శిక్షణను ఇవ్వడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి నైపుణ్య కేంద్రంలో కూడా ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్‌ తదితర కోర్సుల విద్యార్థుల నైపుణ్యాలను అభివృద్ది చేయడంతో పాటు జీవనోపాధి కోసం ఇతరులకు చిన్న చిన్న పనులు నేర్పించడానికి శిక్షణా తరగతులు నిర్వహించాలని వెల్లడించారు. ఈ మొత్తం కార్యక్రమాలను ఎన్‌ఐసీ ద్వారా నిర్వహించాలని జగన్‌ పేర్కొన్నారు. ఇందుకోసం ఒక్కో ఫ్యాకల్టీలో ప్రముఖ సంస్థల భాగస్వామ్యాలు తీసుకోవాలన్నారు. దీనివల్ల ఈ కోర్సులకు మరింత విలువ ఉంటుందని, వైద్య రంగంలో అందించే సర్వీసులకు కూడా ఈ నైపుణ్య కేంద్రాల్లోనే శిక్షణ అందించాలని తెలిపారు.

 హై ఎండ్‌ స్కిల్స్‌ కోసం విశాఖలో మరో ప్రతిష్టాత్మక విద్యాసంస్థకోసం ప్రయత్నాలు ముమ్మరం చేయాలని జగన్‌ అధికారులను కోరారు. ఏ కోర్సుకైనా కనీస కాల వ్యవధి 6 నెలలు ఉండాలన్నారు. ఇప్పటివరకూ పాలిటెక్నిక్, ఇంజినీరింగ్‌ లాంటి వివిధ కోర్సులు చదువుతున్న వారే కాదు, కోర్సులు పూర్తైన వారు కూడా ఈ కేంద్రాల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. అలాగే అధ్యాపకులను అప్‌గ్రేడ్‌ చేసేందుకు వారికి సంబంధించిన శిక్షణా తరగతులు కూడా నైపుణ్య కేంద్రాల్లోనే నిర్వహించాలని జగన్‌ వెల్లడించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి గౌతంరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు