ధైర్యం చెప్పి..ఆప్యాయత పంచి..

24 Jul, 2015 02:08 IST|Sakshi
ధైర్యం చెప్పి..ఆప్యాయత పంచి..

 (రైతుభరోసాయాత్ర నుంచి సాక్షిప్రతినిధి):ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు భరోసానిస్తూ... గ్రామాల్లోని రైతులు.. రైతుకూలీలు, మహిళల కష్టాలు తెలుసుకుంటూ.. వారికి ధైర్యం చెబుతూ జగన్ రైతు భరోసా యాత్ర సాగుతోంది. మూడోరోజు కళ్యాణదుర్గం నుంచి మొదలైంది. ఎర్రంపల్లిగేటు, కుర్లపల్లి గేటు మీదుగా కామక్కపల్లికి చేరుకున్నారు. అక్కడ గ్రామస్తులు జగన్‌ను చూడగానే ఆనందంతో కాన్వాయ్ వద్దకు పరుగులు పెట్టారు. ‘జై జగన్’ నినాదాలు చేశారు. కొంతమంది జగన్‌ను చూసి ఆనందబాష్పాలు రాల్చారు. అందరినీ జగన్ ప్రేమతో పలకరించారు. ఇక్కడ అంగన్‌వాడీ వర్కర్లు జగన్‌ను కలిశారు. తమకు వేతనాలు పెంచాలని ఎన్నిసార్లు ప్రభుత్వం దష్టికి తీసుకొచ్చినా ధర్నాలు చేస్తున్నా పట్టించుకోలేదని జగన్ దష్టికి తీసుకొచ్చారు.
 
  వర్కర్లకు అండగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని జగన్ భరోసా ఇచ్చారు. తర్వాత దాసంపల్లి, ములకనూరు, కదిరిదేవరపల్లిగేటు మీదుగా తిమ్మాపురం చేరుకున్నారు. ప్రతీ గ్రామంలోనూ రైతులు, రైతు కూలీలు, మహిళలు, వృద్ధులూ జగన్‌ను చూసేందుకు తరలివచ్చారు. ‘వృద్ధులు కన్పించగానే బాగున్నావా? అవ్వా! అని ఆప్యాయంగా జగన్ పలకరించారు. జగన్ ప్రేమను చూసి ముసలోళ్లు సంతోషంతో మునిగిపోయారు. ‘బాగుండాం నాయనా! నువ్వు సల్లంగా ఉండాలా? దేవుడు అంతా మంచే చేస్తాడు.’ అని ధైర్యం చెప్పారు. ప్రతీ గ్రామంలోనూ వృద్ధులు, మహిళలందరినీ ఓపిగ్గా జగన్ పలకరించారు. దారిలో తన కోసం ఇద్దరు... ముగ్గురు వృద్ధులు ఉన్నా కాన్వాయ్ ఆపి వారిని ప్రేమగా పలకరించారు. పొలాల్లో పనులు చేసుకుంటున్న కూలీలు జగన్‌ను చూడగానే రోడ్డుపైకి పరుగులు పెట్టారు. తమకు బతికేందుకు పనికూడా లేదని జగన్‌తో విలపించారు.
 
 రైతులు తమకు రుణమాఫీ కాలేదని కొందరు... అరకొరగా మాఫీ అయిందని ఇంకొందరు దారిలో జగన్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వంపై పోరాడదామని వారికి ధైర్యం చెబుతూ ముందుకు కదిలారు. తిమ్మాపురంలో దివంగత సీఎం రాజశేఖరరెడ్డి, ఆర్డీటీ వ్యవస్థాపకులు ఫాదర్‌విన్సెంట్ ఫై, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న రైతు నారాయణప్ప కుటుంబాన్ని పరామర్శించారు. తర్వాత అక్కడి నుండి అండేపల్లికి చేరుకున్నారు. తిమ్మాపురం క్రాస్‌లో మునిసిపల్ కార్మికులు, కార్మికసంఘం నేతలు జగన్‌ను కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు.
 
 తర్వాత కంబదూరు చేరుకున్నారు. వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కంబదూరు  మండల కేంద్రంలో జగన్‌ను చూసేందుకు చుట్టపక్కల గ్రామాల నుంచి భారీగా జనం తరలివచ్చారు. కంబదూరు నుంచి కాన్వాయ్ దాటేందకు 1.30 గంటల సమయం పట్టింది. అక్కడి నుండి ఒంటారెడ్డిపల్లి చేరుకున్నారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న రామాంజనేయులు కుటుంబాన్ని పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని భరోసా  ఇచ్చారు. అనంతరం కర్ణాటలోని పల్లెల మీదుగా పావుగడ చేరుకున్నారు. కర్ణాటకలోని గ్రామాల ప్రజలు రాత్రి అయినా జగన్‌కోసం రోడ్డుపై వేచి ఉన్నారు. రాత్రికి వెంకటాపురం చేరుకుని బస చేశారు.
 

>
మరిన్ని వార్తలు