-

స్థానిక ఎన్నికల తరువాతే నామినేటెడ్‌ పదవులు

5 Sep, 2019 04:53 IST|Sakshi

మంత్రులకు స్పష్టతనిచ్చిన సీఎం 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయిన తరువాతే నామినేటెడ్‌ పదవులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ అంశంపై సీఎం వైఎస్‌ జగన్‌ బుధవారం మంత్రివర్గ సమావేశంలో సహచర మంత్రులకు స్పష్టత ఇచ్చినట్లు తెలిసింది. నామినేటెడ్‌ పదవులను భర్తీ చేస్తే బాగుంటుందని, ఆశావహులు ఎదురు చూస్తున్నారని ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం. మరో రెండు నెలల్లో పంచాయతీరాజ్, మున్సిపల్‌ ఎన్నికలు పూర్తి కావాల్సిన తరుణంలో ఇప్పుడు నామినేటెడ్‌ పదవుల నియామకం సరికాదనే అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం... బుధవారం కేబినెట్‌ భేటీ ముగిశాక వైఎస్‌ జగన్‌ కొద్దిసేపు మంత్రులతో పిచ్చాపాటీగా మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల తరువాతే నామినేటెడ్‌ పదవులను భర్తీ చేయాలన్న జగన్‌ వాదనతో పలువురు మంత్రులు ఏకీభవించారు. గ్రామ సచివాలయ కార్యదర్శుల నియామకాలపై మంత్రులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. పోటీ పరీక్షలు నిర్వహించి, సచివాలయ కార్యదర్శులను ఎంపిక చేయడమే అన్ని విధాలా సరైందని, దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రాదని సీఎం చెప్పారు. ప్రతిభావ ంతులకే అవకాశం కల్పించినట్లవుతుందన్నారు.   

పథకాలన్నీ మొదటినుంచే అమలు చేయాలి 
మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలన్నీ ఇప్పుడే అమలు చేయడం సరైంది కాదేమోనని ఓ మంత్రి సీఎం దృష్టికి తీసుకొచ్చారు.  పథకాలను దశల వారీగా అమలు చేయడం తమ విధానం కాదని, అన్నీ మొదటినుంచే అమలు చేసి తీరాల్సిందేనని జగన్‌ స్పష్టం చేశారు. వనరులను ఎలాగైనా సమీకరించుకోవాలే తప్ప పథకాల అమలును వాయిదా వేయడం మంచి పద్ధతి కాదన్నారు. మంత్రివర్గం కూర్పును తేలిగ్గా చేసుకోగలిగానని, కానీ తిరుమల టీటీడీ పాలకమండలి సభ్యుల నియామకాన్ని ఖరారు చేసే విషయంలో ఇబ్బందులు పడాల్సి వచ్చిందని వైఎస్‌ జగన్‌ తన మంత్రివర్గ సహచరులతో చెప్పినట్లు సమాచారం.  

మరిన్ని వార్తలు