ఇసుక రీచ్‌లు పెంచాలి

28 Aug, 2019 03:52 IST|Sakshi

మార్కెట్‌లో ఉన్న ధర కంటే తక్కువకే అందుబాటులోకి తేవాలి

అధికారులకు సీఎం ఆదేశం  

సాక్షి, అమరావతి: గుర్తించిన ప్రతి స్టాక్‌ యార్డులో ఇప్పటినుంచే ఇసుక నింపడం ప్రారంభించాలని, డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని వీలైనన్ని ఎక్కువ రీచ్‌లను అందుబాటులోకి తేవాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మార్కెట్‌లో ఉన్న ధర కంటే తక్కువకే ఇసుక అందుబాటులోకి తీసుకు రావాలని సూచించారు. ‘స్పందన’పై సమీక్షలో భాగంగా మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా సెప్టెంబర్‌ 5 నుంచి కొత్త ఇసుక పాలసీని ప్రభుత్వం అమల్లోకి తీసుకురానున్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన పలు సూచనలు చేశారు. 

ఎక్కడా తప్పులు జరగకుండా జాగ్రత్త తీసుకోవాలి..
‘‘సెప్టెంబర్‌ 5 నుంచి ఇసుక సరఫరాకు కొత్త విధానం అమల్లోకి వస్తుంది. మార్కెట్‌లో ఇవాళ ఉన్న ధర కంటే తక్కువ రేటుకే ఇసుకను అందుబాటులోకి తేవాలి. ఇసుక సరఫరా పెంచకపోతే ధరలు తగ్గవు. అందువల్ల ఇప్పటి నుంచి తరలించి స్టాక్‌ యార్డులను ఇసుకతో నింపడంతోపాటు వీలైనన్ని ఎక్కువ రీచ్‌లను ఏర్పాటు చేయాలి. ప్రజలకు ఇసుక రవాణాకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఏర్పాట్లు చేయాలి. ఇసుక రవాణా చేసేందుకు ఎక్కువ మందికి అవకాశం కల్పించండి. ఎక్కడా ఎలాంటి తప్పులు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. టన్ను ఇసుక కూడా అక్రమ తవ్వకం, రవాణా జరగడానికి వీల్లేదు.

గతంలో ఇసుక ద్వారా దోచుకున్న మాఫియా వారే ఇప్పుడు మన ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలని రకరకాల కుట్రలు చేస్తున్నారు. మనం ప్రజలకు మంచి చేస్తే చూడలేక దెబ్బతీయాలని చూస్తున్నారు. అందువల్ల అన్ని విధాలా అప్రమత్తంగా ఉండాలి. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా కఠినంగా వ్యవహరించండి. ఉద్దేశపూర్వకంగా ఇసుక విధానాన్ని దెబ్బతీయాలనే కుట్రలతో కృత్రిమ కొరత సృష్టించాలని చూసినా, ఇతరత్రా మోసాలు చేసినా ఎక్కడా సమస్యలు రాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అందుబాటులో ఉంచుకోండి’’ అని సీఎం తన ఆదేశాల్లో స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు