పోలవరంపై వైఎస్‌ జగన్‌ ప్రత్యేక దృష్టి

20 Jun, 2019 04:20 IST|Sakshi

నేడు క్షేత్ర స్థాయిలో పనులను స్వయంగా పరిశీలించనున్న ముఖ్యమంత్రి  

పోలవరం ప్రాజెక్టు అథారిటీ, అధికారులతో సమీక్షా సమావేశం

ప్రాజెక్టు నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడానికి సర్కారు కసరత్తు

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, ఆంధ్రప్రదేశ్‌ను అన్నపూర్ణగా మార్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నడుం బిగించారు. ఆయన గురువారం ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించనున్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) ముఖ్యకార్యనిర్వహణ అధికారి ఆర్కే జైన్, సభ్య కార్యదర్శి ఏకే ప్రధాన్, రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు తదితరులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఈ సమీక్షలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడానికి చర్యలు తీసుకోనున్నారు.  
 
వైఎస్సార్‌ హయాంలో పనులకు శ్రీకారం  
ఆంధ్రప్రదేశ్‌ రూపురేఖలు మార్చే పోలవరం ప్రాజెక్టు ప్రతిపాదన స్వాతంత్య్రం రాక ముందు నుంచే అంటే 1941 నుంచే ఉంది. 2004 వరకూ ఏ ముఖ్యమంత్రి కూడా ఈ ప్రాజెక్టుపై శ్రద్ధ చూపలేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తెలుగు నేలను సుభిక్షం చేయడానికి 2005లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అటవీ, పర్యావరణం సహా అన్ని అనుమతులూ తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదాను సాధిస్తే నిధులకు ఇబ్బంది ఉండదని భావించిన మహానేత వైఎస్‌.. ఆ దిశగా అడుగు ముందుకేశారు. సత్వర సాగునీటి ప్రయోజన కల్పన పథకం(ఏఐబీపీ) కింద పోలవరం ప్రాజెక్టును చేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించడానికి కేంద్రం సిద్ధమవుతున్న సమయంలోనే  వైఎస్‌ రాజశేఖరరెడ్డి హఠన్మరణం చెందారు. ఆయన హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.5,135.87 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పటిదాకా జరిగిన పనుల్లో సింహభాగం పనులు అప్పట్లో పూర్తయినవి కావడం గమనార్హం.  
 
బాబు కక్కుర్తితో పడకేసిన ప్రాజెక్టు  
రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. వంద శాతం ఖర్చుతో తామే పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. ఆ క్రమంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీని(పీపీఏ) ఏర్పాటు చేసింది. పీపీఏ నేతృత్వంలో పోలవరాన్ని శరవేగంగా పూర్తి చేయడానికి చర్యలు చేపట్టింది. కానీ, 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు పోలవరం నిర్మాణ బాధ్యతలను కేంద్రానికి అప్పగించకుండా మోకాలడ్డారు. రాష్ట్ర ప్రభుత్వానికే దక్కేలా చక్రిం తప్పి, కమీషన్ల కక్కుర్తితో ప్రాజెక్టును నీరుగార్చారు.  
 
పోలవరంపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి  
మొన్నటి ఎన్నికల్లో ఆఖండ విజయం సాధించిన వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే మే 26న ఢిల్లీకి వెళ్లి, ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి సహకరించాలని కోరారు. ఆ తర్వాత మే 30న ప్రమాణ స్వీకారం చేశాక.. జూన్‌ 3న సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులపై సమీక్షా సమావేశం నిర్వహించారు.. పోలవరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కేంద్రం నుంచి నిధుల విడుదలకు మార్గం సుగమం చేయడానికి జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ను ఢిల్లీకి పంపించారు.

ఈ నెల 15న ఢిల్లీలో జరిగిన నీతి అయోగ్‌ సమావేశంలోనూ పోలవరం ప్రాజెక్టు ఆవశ్యకతను జగన్‌ వివరించారు. పోలవరం పనులపై కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ 2011లో జారీ చేసిన పనుల నిలిపివేత ఉత్తర్వులను పూర్తిగా ఎత్తేయాలని కేంద్రానికి లేఖ రాశారు. ఇలా అడ్డంకులను తొలగిస్తూనే.. ప్రాజెక్టు నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. జగన్‌మోహన్‌రెడ్డి గురువారం పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో తనిఖీ చేయనున్నారు. హెడ్‌ వర్క్స్‌(జలాశయం), కుడి, ఎడమ అనుసంధానాలు(కనెక్టివిటీస్‌), నావిగేషన్‌ కెనాల్, పవర్‌ ప్రాజెక్టు, కుడి, ఎడమ కాలువల పురోగతి, భూసేకరణ, నిర్వాసితుల పునరావాసంపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ప్రాజెక్టు నిర్మాణం విషయంలో వారికి దిశానిర్దేశం చేయనున్నారు.   

మరిన్ని వార్తలు