6 Mar, 2018 19:01 IST|Sakshi
ఇంకొల్లు బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌

ఇంకొల్లు బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి

సాక్షి, ప్రకాశం : చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ప్రజలు సంతోషంగా లేరని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ప్రకాశం జిల్లా పర్చూర్‌ నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగిస్తున్న ఆయన.. ఇంకొల్లు గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. 

అభివృద్ధి ఎక్కడుంది?
‘నిన్నటి కంటే నేడు బాగుంటే అది అభివృద్ధి. కానీ, చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో అది మచ్చుకు కూడా కనిపించటం లేదు. మహిళలు, చిన్న పిల్లలను కూడా వదలకుండా అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే ధరలు అధికంగా ఉన్నాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ కూడా ఆయన నెరవేర్చలేదు. పిల్లలు తాగి చెడిపోతున్నారని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు మద్యం షాపులను ప్రొత్సహిస్తున్నాడు. అధికారంలోకి వచ్చాక కరెంట్‌ బిల్లులు తగ్గిస్తానన్నాడు. అవేమో ఇప్పుడు విపరీతంగా వస్తున్నాయి. రేషన్‌ సరుకుల్లో కోత పడింది. రైతుల కోసం ప్రవేశపెట్టిన రుణ మాఫీ పథకం వడ్డీలకు కూడా సరిపోని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతీ మహిళా కన్నీరు పెట్టే పరిస్థితి కనిపిస్తోంది. చివరకు నిరుద్యోగుల భృతి విషయంలో మాట తప్పాడు. ఇలా అబద్ధాలు, మోసాలతో అధికారంలోకి వచ్చిన వ్యక్తి అసలు ముఖ్యమంత్రి ఎలా అవుతాడు’ అని వైఎస్‌ జగన్‌ నిలదీశారు.

వాళ్లను బంగాళాఖాతంలో కలిపేయండి
చెడిపోయిన రాజకీయాల్లోకి విశ్వసనీయత వస్తేనే బాగుపడుతుందని, నేతలు ఎవరైనా సరే ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఇంటికి వెళ్లే పరిస్థితి రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. అవినీతితో అడ్డగోలు డబ్బు సంపాదించి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన చంద్రబాబు.. వారిని ప్రజల్లోకి తీసుకెళ్లి గెలిపించుకోలేని స్థితిలో ఉన్నారన్నారు. నిజాయితీ, విలువలతో కూడిన రాజకీయాలు తేవాలన్న తన ప్రయత్నానికి ప్రజల నుంచి మద్ధతు కావాలని జగన్‌ కోరారు. ‘ఇప్పుడు చంద్రబాబును క్షమిస్తే రేపు పెద్ద మోసాలకు తెరలేపుతాడు. అలాంటి వాళ్లకు తగిన బుద్ధి చెప్పి బంగాళాఖాతంలో కలిపేయండి. మనస్సాక్షిగా ఓటేయండి’ అంటూ ప్రజలను జగన్‌ కోరారు. 

నవరత్నాల్లో రైతన్నల కోసం... 
ఇక సభలో నవరత్నాల ద్వారా రైతులకు ఏం చేయబోతున్నారన్నది జగన్‌ ప్రస్తావించారు. చంద్రబాబు పాలనలో రైతులు దీనావస్థలో ఉన్నారన్న జగన్‌.. ప్రజాప్రభుత్వంలో వారిని ఆదుకునేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తామని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో వారికున్న సమస్యలను వివరించిన ఆయన.. రైతులకు పెట్టుబడి తగ్గించగలిగితే ఆదాయాలు బాగా పెరుగుతాయన్న అభిప్రాయ పడ్డారు. 

 రైతుల కోసం ప్రకటించిన హామీలు
-  పగటి పూట 9గంటల ఉచిత కరెంట్
- క్రాప్‌ లోన్లపై వడ్డీలు భారం లేకుండా చూడటం
- రైతులకు ఉచితంగా బోర్లు వేయించటం
- మే నెలలో రైతులకు సాయం కింద రూ. 12,500 అందజేత
- పంట వేయకముందే మద్ధతు ధర ప్రకటించి.. కొనుగోలు చేయటం
- గిట్టుబాటు ధర కోసం రూ. 3వేల కోట్లు కేటాయింపు
- విపత్తు నిధి కింద రూ. 4 వేల కోట్ల కేటాయింపు. తద్వారా కరువు, వరదల నుంచి రైతులను ఆదుకోవటం
- యుద్ధ ప్రతిపాదికన పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తి
- కో-ఆపరేటివ్‌ డైరీల పునరుద్ధరణ. పాడి రైతులను అన్ని రకాలుగా ఆదుకోవటం

మరిన్ని వార్తలు