పాలనలో సీఎం స్పీడు

1 Jun, 2019 13:35 IST|Sakshi

పింఛన్ల పెంపు ఫైల్‌పై తొలి సంతకం

వికలాంగుల పింఛను రూ.3 వేలు

డయాలసిస్‌ పేషెంట్లకు రూ.10 వేలు

జీవో ఎంఎస్‌ 103 జారీ చేసిన జగన్‌ సర్కారు

సమర్థులైన అధికారుల నియామకం

కసరత్తు ప్రారంభించిన సీఎం

రెండురోజులలో బదిలీల ప్రక్రియ

జిల్లాలోనూ పలువురు అధికారుల బదిలీ

సాక్షి ప్రతినిధి,ఒంగోలు: ఏపీ సీఏంగా ప్రమాణ స్వీకారం చేసిన తొలిరోజు నుంచే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో స్పీడు పెంచారు. తొలిరోజు తొలిసంతకంతో  పెన్షన్‌ మొత్తాలను భారీగా పెంచుతూ జీవో ఎంఎస్‌ నంబర్‌ 103 జారీచేసిన సీఎం ప్రభుత్వ  పథకాలను  సమర్దవంతంగా  అమలు చేసేందుకు  అధికారుల బదిలీలకు దిగారు. జిల్లా స్థాయిలో  ముఖ్యమైన అధికారుల బదిలీలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది  ఇందుకోసం సీఎం  రెండు రోజులుగా ఉన్నతాధికారులతో కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజులలోనే అన్ని శాఖల అధికారుల బదిలీలు  జరగనున్నట్లు సమాచారం. అవినీతికి తావులేని సమర్ధులైనఅధికారుల ఎంపిక వారికి బాధ్యతలు అప్పగించేందుకు సీఎం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

డయాలసిస్‌ బాధితులకు చేయూత..
ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ల మొత్తాన్ని పెంచుతూ జగన్‌ ప్రభుత్వం తొలి జీవో జారీ చేసింది. వృద్ధులతో పాటు వికలాంగులు, చేనేత, వితంతు, ఒంటరి మహిళల, మత్స్యకారులతో పాటు కిడ్నీ వ్యాధులకు సంబంధించి డయాలసిస్‌ పేషెంట్ల పెన్షన్లను భారీగా పెంచారు.  మొత్తంగా రూ. 2 వేలు ఉన్న ఎనిమిది రకాల పెన్షన్లను రూ. 2,250 కి పెంచగా వికలాంగులకు సంబంధించిన అన్ని రకాల పెన్షన్లను ప్రభుత్వం రూ.3 వేలు చేసింది. డయాలసిస్‌ చేయించుకుంటున్న కిడ్నీ వ్యాధిగ్రస్తుల పింఛను ఇప్పటి వరకూ రూ.3500 మాత్రమే ఉండగా  దానిని రూ.10 వేలకు పెంచుతూ ప్రభుత్వం జీఓ జారీ చేయడం గమనార్హం. దీని వల్ల జిల్లాలోని 3,80,903 మంది పెన్షన్‌దారులు లబ్ది పొందనున్నారు. ఈ పెరిగిన పింఛన్లు అన్నీ జూలై నెల నుంచి అందుతాయి. ఇక పెన్షన్‌ వయస్సును 65 నుంచి 60 సంవత్సరాలకు తగ్గిస్తూ జగన్‌ సర్కార్‌ తీసుకున్న నిర్ణయంతో జిల్లాలో లక్షలాది మందికి కొత్తగా పెన్షన్లు లభించనున్నాయి. ఇక ఆగస్టు15 నాటికే గ్రామస్థాయిలో ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్‌తో పాటు అక్టోబర్‌–2 నాటికి గ్రామసచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి సచివాలయంలో పది మందికి చొప్పున ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు సీఎం జగన్‌ ప్రకటించారు. దీనివల్ల ఒక్క ప్రకాశం జిల్లాలోనే దాదాపు 40 వేలమందికి ఉద్యోగాలు లభించే అవకాశముంది.

అవినీతిపరుల గుండెల్లో రైళ్లు..
ఎన్నికలలో చెప్పిన నవరత్నాలు పథకాలతో పాటు అన్ని రకాల పథకాలను అవినీతికి తావులేకుండా సమర్ధవంతగా అమలు చేసేందుకు జగన్‌ సర్కార్‌ సర్వం సిద్ధం చేస్తోంది. ఇందుకోసం సమర్దులైన అధికారులను నియమించేందుకు సీఎం కసరత్తు వేగవంతం చేశారు. చంద్రబాబు  సర్కార్‌లో అవినీతి అక్రమాలకు పాల్పడిన అధికారులను తప్పించి సమర్దవంతమైన అధికారులను నియమించేందుకు వైఎస్‌ జగన్‌ సిద్ధమయ్యారు. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారులు, వారి పనితీరుకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం సేకరించింది. రెండు మూడు రోజుల్లోనే జిల్లా స్థాయి అధికారుల బదిలీలు జరగనున్నట్లు తెలుస్తోంది. దీంతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మొత్తంగా ప్రమాణస్వీకారం చేసిన రెండు రోజుల్లోనే సీఎం జగన్‌ పాలనలో స్వీడు పెంచారు. ఆయన తీరును గమనిస్తున్న జనం సీఎం జగన్‌ ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తారని, సమర్ధవంతమై పాలను అందిస్తారని నమ్మకంతో ఉన్నారు.

>
మరిన్ని వార్తలు