‘విజయ సంకల్ప’ ఉత్సవాలు

10 Jan, 2019 04:01 IST|Sakshi

పుణ్య క్షేత్రాల్లో మొక్కులు చెల్లించిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర విజయవంతం సందర్భంగా ఉత్సవాలు

పలు జిల్లాల్లో ర్యాలీలు, వైఎస్‌ విగ్రహాలకు పాలాభిషేకాలు

3648 కొబ్బిరికాయలు కొట్టిన పార్టీ నాయకులు 

సాక్షి నెట్‌వర్క్‌:  ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ముగింపు సందర్భంగా ఆ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవాలు నిర్వహించాయి. యాత్ర విజయవంతం అయిన సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో కిలోమీటర్‌కు ఒక కొబ్బరికాయ చొప్పున 3,648 కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించారు. పలు జిల్లాల్లో ర్యాలీలు, వైఎస్‌ విగ్రహాలకు పాలాభిషేకాలు నిర్వహించారు. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు తమ అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకున్నారు. మంగళగిరి పానకాల నృసింహ స్వామి ఆలయంలో 3,648 కొబ్బరికాయలను కొట్టి మొక్కు చెల్లించి వైఎస్‌ జగన్‌ పట్ల అభిమానాన్ని చాటుకున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు ఆలయానికి స్వామివారి దర్శనార్థం వచ్చిన మహిళా భక్తులు సైతం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాలంటూ కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం గుడిచుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు మునగాల మల్లేశ్వరరావు, దామర్ల ఉమామహేశ్వరరావు, బొమ్ము శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తిరుపతిలోనూ మొక్కు చెల్లింపు 
వైఎస్సార్‌సీపీ యువనేత భూమన అభినయ్‌ నేతృత్వంలో ఆ పార్టీ నాయకులు తిరుపతిలోని అలిపిరి శ్రీవారి పాదాల చెంత 3,648 కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించారు. 


వాడవాడలా జగన్నినాదం 
అనంతపురం జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర విజయోత్సవ సంబరం అంబరాన్నంటింది. వైఎస్సార్‌సీపీ నాయకులు, పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. అన్ని నియోజకవర్గాల్లో ప్రధానంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, మసీదు, దర్గాల్లో, చర్చిల్లో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. పలు నియోజకవర్గాల్లో సంఘీభావ పాదయాత్రలు చేపట్టారు. అనంతపురంలోని వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించారు.  

నెల్లూరు జిల్లాలో పోలీసుల ఓవర్‌ యాక్షన్‌
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో వైఎస్సార్‌సీపీ నేతలు చేపట్టిన మోటార్‌ సైకిల్, ఆటోల ర్యాలీని అడ్డుకుని పోలీసులు ఓవర్‌ యాక్షన్‌ చేశారు. బుధవారం ర్యాలీ నిర్వహించేందుకు మంగళవారమే ఆ పార్టీ నేతలు 1వ పట్టణ ఎస్సై శేఖర్‌బాబుకు అర్జీని, చలానాతోపాటు అందజేశారు. దీంతో వారు అనుమతుల కోసం పోలీసు ఉన్నతాధికారులతో కూడా మాట్లాడగా, అందుకు వారు మౌఖికంగా అనుమతిచ్చారని నాయకులు తెలిపారు. అయితే ర్యాలీ ప్రారంభం కాగానే ఎస్‌ఐ వచ్చి అనుమతులు లేవని అడ్డుకున్నారు. దీంతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి నాశిన నాగులు నేతృత్వంలో పోలీసుల తీరుకు నిరసనగా టవర్‌ క్లాక్‌ సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు