అవినీతి రహిత పాలనే లక్ష్యం

11 Jun, 2019 03:48 IST|Sakshi
కేబినెట్‌ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం జగన్‌. చిత్రంలో సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం

మంత్రివర్గ తొలి భేటీలో సీఎం వైఎస్‌ జగన్‌

అవినీతి మరక అంటితే మంత్రులనూ వదిలేది లేదని స్పష్టీకరణ

తమ ప్రభుత్వంలో మంత్రులు డమ్మీలు కాదని వెల్లడి

టెండర్ల పరిశీలనకు జ్యుడీషియల్‌ కమిషన్‌

సాక్షి, అమరావతి: ఎటువంటి అవినీతి లేని.. పారదర్శకమైన పాలన అందించాలన్నదే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం నిర్వహించిన మంత్రివర్గ తొలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో శాఖల వారీగా ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో వెలికి తీయాలని మంత్రులను ఆదేశించారు. ఏ శాఖలో.. ఎక్కడ అవినీతి జరిగినా గుర్తించి ఆ వివరాలను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పొందుపర్చాలని నిర్ణయించారు. మంత్రి పదవికి రెండున్నరేళ్లు అనే గ్యారంటీ ఏమీ లేదని, ఏ మంత్రిపై అయినా అవినీతి ఆరోపణలు వస్తే దర్యాప్తు జరిపిస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ చెప్పారు. ఆరోపణలు రుజువైతే తక్షణమే మంత్రివర్గం నుంచి తొలగించడానికి వెనుకాడబోనని స్పష్టం చేశారు.

ఏ మంత్రికైనా అవినీతి మరక అంటితే వెంటనే మంత్రి మండలి నుంచి దూరమవుతారన్నారు. తమ ప్రభుత్వంలో మంత్రులు డమ్మీలు కాదని, వారికి కేటాయించిన శాఖల బాధ్యత పూర్తిగా వారిదేనని స్పష్టం చేశారు. పారదర్శకమైన పాలన అందించే దిశగా ఇప్పటికే చర్యలు చేపట్టామని.. వివిధ పనుల టెండర్ల పరిశీలనకు జ్యుడీషియల్‌ కమిషన్‌ ఏర్పాటు నిమిత్తం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విన్నవించామని గుర్తు చేశారు. వివిధ పనులకు సంబంధించిన వివరాలను టెక్నికల్‌ సపోర్టింగ్‌ టీమ్‌ జ్యుడీషియల్‌ కమిషన్‌ ముందు పెడుతుందని చెప్పారు. కమిషన్‌ సిఫార్సులలోని ప్రతి అంశాన్ని అమలు చేయాలన్నారు. దీనికి సంబంధించి సలహాలు, సూచనలు ఉంటే ఎవరైనా చెప్పవచ్చని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 

విద్యుత్‌ ఒప్పందాల పునఃసమీక్ష
విద్యుత్‌ శాఖలో పేరుకుపోయిన అవినీతిపై మంత్రివర్గం ప్రధానంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఇప్పటివరకు చేసుకున్న అన్ని ఒప్పందాలను పునఃసమీక్షించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రైవేట్‌ విద్యుత్‌ సంస్థలకు లబ్ధి చేకూర్చే విధంగా ఎక్కువ ధరకు విద్యుత్‌ కొనుగోలు చేస్తూ గత ప్రభుత్వం దీర్ఘకాలిక ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

నామినేటెడ్‌ కమిటీలు రద్దు
గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన అన్నిరకాల నామినేటెడ్‌ కమిటీలను రద్దు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీంతో మార్కెటింగ్, సహకార సంస్థలు, ఆలయాలకు సంబంధించిన పాలకమండళ్ల పదవులతోపాటు ఇతర నామినేటెడ్‌ పదవులు సైతం రద్దు కానున్నాయి. ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలు, కన్సల్టెన్సీలను వెంటనే రద్దు చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. ప్రత్యామ్నాయంగా ఆ ఉద్యోగులకే లబ్ధి చేకూర్చే చర్యల కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీని మంత్రివర్గం ఏర్పాటు చేసింది. 

ఇసుక విధానం ప్రక్షాళన
అవినీతికి తావులేని ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకురావాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. గత ఐదేళ్లలో ఇసుక విధానం రాజకీయ నేతలకు ఆదాయ వనరుగా మారిందని, దీనిని సమూలంగా ప్రక్షాళన చేయాలని కోరారు. ఇసుక విధానం ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే విధంగా ఉండాలన్నారు. అదే సందర్భంలో సరసమైన ధరకు ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు