ముగిసిన జగన్ పర్యటన

23 Apr, 2015 02:43 IST|Sakshi

- ఆద్యంతం నాయకులు, కార్యకర్తల సందడి
- జెడ్పీ గెస్ట్‌హౌస్‌లో నాయకులతో సమావేశం
- భోగాపురం ఎయిర్‌పోర్ట్ భూ సమీకరణపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై చర్చ   

విజయనగరం మున్సిపాల్టీ :  వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల జిల్లా పర్యటన ముగిసింది. మంగళవారం ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ప్రథమ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు  హాజరవగా, రెండో రోజు బుధవారం సీని యర్ నేత పెనుమత్స సాంబశివరాజు మనవడు ఉపనయన కార్యక్రమంలో పాల్గొన్నారు.   రాత్రి బస చేసిన జెడ్పీ గౌస్ట్‌హౌస్ వద్దకు బుధవారం పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలిరావడంతో సందడి నెలకొంది.

తొలుత శ్రీకాకుళం జిల్లా నేతలు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్, రెడ్డి శాంతి తదితరులతో సమావేశమయ్యారు. అ నంతరం ఎమ్మెల్యేలు సుజయ్‌కృష్ణ రంగారావు,  పీడిక రాజన్నదొర, పాముల పుష్ప శ్రీవాణి,   పార్టీ  జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లా నేతలు శత్రుచర్ల చంద్రశేఖర్‌రాజు, బేబినాయన, బెల్లాన చంద్రశేఖర్, కడుబండి శ్రీనివాసరావు, జమ్మాన ప్రసన్నకుమార్, నెక్కల నాయుడుబాబు, అంబళ్ల శ్రీరాములనాయుడు, పతివాడ అప్పలనాయుడు, తదితరులతో సమావేశమయ్యారు.  

వైఎస్సార్‌సీపీ నాయకులు, భోగాపురం ఎయిర్‌పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ ప్రతినిధి కాకర్లపూడి శ్రీనివాసరాజుతో జగన్‌మోహన్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడారు.  భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ వల్ల రైతులకు కలిగే నష్టాలు, ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు, భూసమీకరణకు చేపడుతున్న విధానాలను  అక్కడి నాయకులు వైఎస్ జగన్‌కు వివరించారు. ఎయిర్‌పోర్ట్ కోసం 15 వేల ఎకరాలు సేకరించి రైతుల పొట్టకొట్టేందుకు ప్రభుత్వం
ప్రయత్నిస్తోందని తెలిపారు.

దీనిపై పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, ఎయిర్‌పోర్ట్ ప్రతిపాదిత స్థలాల్లో పర్యటన చేసి,  తద్వారా రైతులకు అండగా నిలవాలని కోరారు.   జిల్లాలోని మిగతా నేతలతో కూడా భోగాపురం ఎయిర్‌పోర్ట్ భూ సమీకరణ విషయమై జగన్ చర్చించారు. ఈ సందర్భంగా కాకర్లపూడి శ్రీనివాసరాజు, అంబళ్ల శ్రీరాములనాయుడు, పతివాడ అప్పలనాయుడు, బర్రి చిన్నప్పన్న, సిరుగుడి గోవిందరావు, గుండాల మన్మధరావు, బి.సత్తిబాబు తదితరులు వైఎస్ జగన్‌కు వినతి పత్రం అందజేశారు.

ఎయిర్ పోర్ట్ భూ సేకరణపై ఉత్తరాంధ్ర జిల్లాల ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో ప్రత్యేక కమిటీ వేసి, ఆ కమిటీ బాధిత గ్రామాల్లో పర్యటించాక  రైతుల  ఇబ్బందులపై ఇచ్చే నివేదిక ఆధారంగా భవిష్యత్ చర్యలు తీసుకుంటానని వైఎస్  జగన్ హామీ ఇచ్చినట్టు పార్టీ నేత కాకర్లపూడి శ్రీనివాసరాజు మీడియాకు వివరించారు.  కాగా, మొయిద బయలుదేరే ముందు వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ ఎయిర్‌పోర్ట్ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ధ్వజ మెత్తారు.  

దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడే వేలాది ఎకరాల్లో నిర్మించాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. రైతులకు అండగా పోరాడుతామని స్పష్టం చేశారు. అనంతరం మొయిద బయలుదేరి వెళ్లారు. సీనియర్ నేత పెనుమత్స సాంబశివరాజు స్వగృహంలో ఆయన మనవడు ఉపనయన కార్యక్రమంలో పాల్గొన్నారు. వరుడు సంతోష్‌ను   ఆశీర్వదించిన  అనంతరం విశాఖ బయలుదేరి వెళ్లారు. మార్గ మధ్యంలో పలువురు నుంచి వినతుల్ని స్వీకరించారు. వృద్ధులు, మహిళలను అప్యాయంగా పలకరించి, వారి  కష్టసుఖాలను తెలుసుకున్నారు.

విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమరనాథ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వరుదు కళ్యాణి,  విజయనగరం పార్లమెంటరీ పరిశీలకుడు బెల్లాన చంద్రశేఖర్, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు   గొర్లె కిరణ్‌కుమార్, కోలా గురువులు,  పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి  శత్రుచర్ల.పరీక్షిత్‌రాజు  తదితరులున్నారు.

>
మరిన్ని వార్తలు