శారదా పీఠం వార్షికోత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్‌

3 Feb, 2020 11:28 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : విశాఖ శ్రీ శారదా పీఠం వార్షికోత్సావాలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. సోమవారం శారద పీఠం చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌కు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌  పీఠాధిపతులు స్వామి స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్రల ఆశీస్సులు అందుకున్నారు. శారదా పీఠం ప్రాంగణంలోని రాజశ్యామల అమ్మవారికి ముఖ్యమంత్రి ప్రత్యేక పూజల చేశారు.  పీఠాధిపతులతో కలిసి జమ్మిచెట్టు ప్రదక్షిణ చేసిన సీఎం వైఎస్‌ జగన్‌.. గోమాతకు నైవేద్యం సమర్పించారు. పీఠంలో నూతనంగా నిర్మించిన స్వయం జ్యోతి మండపం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 


ఆగమ యాగశాలలో ఐదు రోజులుగా టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీనివాస చతుర్వేద హవనం పూర్ణాహుతిలో సీఎం వైఎస్‌ జగన్‌, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు పాల్గొన్నారు. అనంతరం లోక కల్యాణార్థం విశాఖ శారదా పీఠం చేపట్టిన రాజశ్యామల యాగం పూర్ణాహుతికి సీఎం హారజయ్యారు. అలాగే పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యానంలో ముద్రించిన తత్త్వమసి గ్రంథాన్ని సీఎం స్వీకరించారు. శ్రౌత మహాసభలో ఉత్తమ పండితునికి సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా స్వర్ణకంకణధారణ చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ వెంట వైఎస్సార్‌సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే అదీప్‌రాజు, టీటీడీ పాలక మండలి సభ్యులు ప్రశాంతిరెడ్డి, నాదెళ్ల సుబ్బారావు, శేఖర్‌రెడ్డిలు ఉన్నారు. 

విశాఖలో సీఎం జగన్‌కు ఘనస్వాగతం..
అంతకుముందు విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌కు ఘనస్వాగతం లభించింది. వైఎస్సార్‌సీపీ నేతలు, మహిళలు, అభిమానులు సీఎం వైఎస్‌ జగన్‌కు ఎయిర్‌పోర్ట్‌ వద్ద స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సీఎం వైఎస్‌ జగన్‌.. శారదా పీఠం చేరుకున్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా పోలీసులు విశాఖలో భద్రతను కట్టుదిట్టం చేశారు. 

మరిన్ని వార్తలు