విజయ ‘సంకల్పం’

9 Jan, 2019 08:37 IST|Sakshi

అలుపెరుగకుండా జిల్లాలో సాగిన జగన్‌ యాత్ర

ప్రాణాపాయం నుంచి బయటపడినా సడలని ధైర్యం

తొమ్మిది నియోజకవర్గాల్లో 36 రోజులపాటు సాగిన పాదయాత్ర

214 గ్రామాల్లోని ప్రజలతో మమేకం

ప్రజా సంకల్పయాత్రలో అరుదైన ఘట్టాలకు వేదికైన జిల్లా

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా... సమస్యల పరిష్కారమే లక్ష్యంగా... సంకల్పమే ఆయుధంగా... అలుపెరుగకుండా సాగిన విపక్ష నేత ప్రజాసంకల్ప యాత్ర తుదిదశకు చేరుకుంది. జిల్లాలో దాదాపు రెండు నెలల్లో 36రోజులపాటు అకుంఠిత దీక్షతో సాగిన పాదయాత్రలో ఆయన వేలాదిమంది సమస్యలు తెలుసుకున్నారు. 214 గ్రామాలను సందర్శించారు. ఎక్కడ చూసినా ఆయనకోసం ఆత్రంగా ఎదురుచూసిన జనం కనిపించారు. తమ గోడు వినిపించుకోవాలనీ... సాంత్వన పొందుదామనీ ఆకాంక్షించారు. వారి అందరి ఆశలను తీరుస్తూ ఆయన శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్నారు. ఇప్పుడు ఆ జిల్లాలో బుధవారంతో ఆయన యాత్ర పూర్తవుతోంది. ఆ చివరి ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు పెద్ద ఎత్తున జనం తరలివెళ్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఆయన పర్యటన వివరాలు.

సాక్షిప్రతినిధి విజయనగరం: 2017 నవంబర్‌ ఆరో తేదీ. వైఎస్సార్‌కడప జిల్లా ఇడుపులపాయ ఓ చారిత్రాత్మక నిర్ణయానికి సాక్షీభూతమైంది. ప్రజల కష్టాలు క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు తమ ప్రభుత్వం వస్తే వారికి న్యాయం చేసుకునేలా ప్రణాళిక రూపకల్పనకు ఓ మహోన్నత లక్ష్యంతో విపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర మొదలైంది. 269 రోజుల యాత్ర అనంతరం 12వ జిల్లాగా విజయనగరంలో గతేడాది సెప్టెంబర్‌ 24న ఎస్‌కోట నియోజకవర్గంలోని కొత్తవలస మండలంలోప్రవేశించింది. జిల్లాలో జగన్‌మోహన్‌రెడ్డి మొత్తం 36 రోజుల పాటు యాత్రసాగించి 311.5 కిలోమీటర్ల నడిచారు. 9 నియోజకవర్గాలు.. 18 మండలాలు, 214 గ్రామాలు, నాలుగు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీలో పర్యటించారు. 9 నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించగా... రెండు ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొని 305వ రోజు నవంబర్‌ 25న విజయవంతంగా శ్రీకాకుళం జిల్లాకు పయనమయ్యారు.

స్వర్ణకారులతో ఆత్మీయ సమ్మేళనం
కార్పొరేట్‌ జ్యూయలరీ షాపులతో కుదేలవుతున్న విశ్వబ్రహ్మణులకు (స్వర్ణకారులకు) చేయూతనిస్తూ.. వీరు మాత్రమే మంగళసూత్రాలను తయారు చేసేలా పేటెంట్‌ హక్కు కల్పిస్తామని వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి హమీ ఇచ్చారు. విజయనగరం నియోజకవర్గంలో స్వర్ణకారులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఈ మేరకు ప్రకటించారు. దీనిపై తొలి చట్ట సభలో తీర్మానించనున్నట్టు హామీ ఇచ్చారు. పోలీసుల వేధింపులు లేకుండా ఇప్పుడున్న చట్టానికి సవరణలు చేస్తామన్నారు. ఎమ్మెల్సీ సీటు ఇచ్చి విశ్వబ్రహ్మణలకు చట్ట సభల్లో స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు.

శెట్టి బలిజలతో మరో సమ్మేళనం
శెట్టిబలిజ కులస్తుల అభ్యున్నతికి రూ.2వేల కోట్లతో కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని ఆ సామాజిక వర్గ నేతలు జగన్‌ను కోరారు. జియ్యమ్మవలస మండలం శిఖబడి క్రాస్‌ వద్ద వారితో జగన్‌ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. వారి కోరికను మన్నించిన కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

ప్రతి చోటా జన ఉప్పెన
ప్రజా సంకల్పయాత్రలో భాగంగా జగన్‌మోహన్‌రెడ్డి  జిల్లాలోని నియోజకవర్గాల వారీగా నిర్వహించిన తొమ్మిది భారీ బహిరంగ సభలకు జన సునామీ ఎగసిపడింది. ఎస్‌కోట నియోజకవర్గం కొత్తవలస, విజయనగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల, గజపతినగరం, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం, కురుపాం నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన బహిరంగ సభలు జన ఉప్పెనను తలపించాయి. పాదయాత్రలోనూ ఆయన వెంట వేలాదిగా జనం అనుసరించారు.

రక్తం చిందినా సడలని సంకల్పం:అపూర్వ జనాదరణ నడుమ ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న ప్రజా సంకల్పయాత్రలో ఎయిర్‌పోర్టు ఘటన జిల్లా ప్రజలను కలచివేసింది. జిల్లాలోని సాలూరు నియోజకవర్గం మక్కువ మండలంలో పాదయాత్ర ముగించుకుని హైదరాబాద్‌ బయలుదేరిన జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో అక్టోబర్‌ 25న జరిగిన హత్యాయత్నంతో జిల్లా ప్రజలు ఉలిక్కిపడ్డారు. అప్పటి వరకు తమ మధ్యనే పాదయాత్ర చేపట్టిన అభిమాన నేత కత్తిపోటుతో గాయపడ్డారని తెలిసి జిల్లావాసులంతా తల్లడిల్లారు. ఈ దుర్ఘటన నుంచి 17 రోజుల్లోనే వజ్ర సంకల్పంతో కోలుకున్న జగన్‌ నవంబర్‌ 12న జిల్లాలో యాత్రను పునఃప్రారంభించారు.

ప్రతి అడుగూ ఓ చరిత్రః ఈ యాత్రలో జననేత వేసిన ప్రతి అడుగు చారిత్రాత్మకంగానే నిలిచింది. గతేడాది సెప్టెంబర్‌ 24న విశాఖ జిల్లా నుంచి విజయనగరం జిల్లాలో అడుగిడిన అభిమాననేత అదే రోజున కొత్తవలసలో 3000 కిలోమీటర్ల మైలు రాయిని దాటారు. దానికి గుర్తుగా ప్రత్యేక పైలాన్‌ను జగన్‌ ఆవిష్కరించారు. గుర్ల మండలం ఆనందపురం క్రాస్‌ వద్ద 3100 కిలోమీటర్లు, సాలూరు మండలం బాగువలస వద్ద 3200 కిలోమీటర్లు మైలురాయిని అధిగమించారు. నవంబర్‌ 17వ తేదీనాటికి 300 రోజుల యాత్ర పూర్తి చేసుకోవటం ద్వారా మరో నూతన రికార్డు సష్టిŠంచారు. జియ్యమ్మవలస మండలంలోని తురకనాయుడు వలసలో 3300 కిలోమీటర్ల మైలు రాయిని జగన్‌ దాటారు.

సంకల్పంలో జిల్లా గుర్తులు
సెప్టెంబర్‌ 24: జిల్లాలో పాదయాత్ర ప్రవేశం. దేశపాత్రుని పాలెంలో 3 వేల కిలోమీటర్లను అధిగమించిన ప్రస్థానం. సెప్టెంబర్‌ 30: విజయనగరం నియోజకవర్గంలో విశ్వబ్రాహ్మణులతో ఆత్మీయసమ్మేళనం.
అక్టోబర్‌1:     విజయనగరం పట్టణంలోని మూడు లాంతర్ల సెంటర్‌లో బహిరంగసభ.
అక్టోబర్‌ 3:    నెల్లిమర్ల నియోజకవర్గ కేంద్రం మొయిద జంక్షన్‌లో బహిరంగసభ.
అక్టోబర్‌ 7:    చీపురుపల్లి నియోజకవర్గం గుర్లలో బహిరంగసభ.
అక్టోబర్‌ 8:    గుర్ల మండలం ఆనందపురం క్రాస్‌ వద్ద 3100 కిలోమీటర్లు దాటిన యాత్ర
అక్టోబర్‌ 10:    గజపతినగరంలో బహిరంగ సభ.
అక్టోబర్‌ 17:    బొబ్బిలిలో బహిరంగ సభ.
అక్టోబర్‌ 22:    సాలూరులో బహిరంగ సభ
అక్టోబర్‌ 24:    సాలూరు మండలం బాగువలస వద్ద 3200 కిలోమీటర్ల మైలురా యిని దాటిన ప్రతిపక్షనేత
అక్టోబర్‌ 25:    మక్కువ నుంచి విశాఖపట్నం విమానాశ్రయానికి వెళ్లి వీఐపీ లాంజ్‌లో ఉన్న జగన్‌పై హత్యాయత్నం
నవంబర్‌ 12:    పదిహేడు రోజుల విరామం తర్వాత తిరిగి సాలూరు నియోజకవర్గం పాయకపాడు నుంచి పాదయాత్ర ప్రారంభం
నవంబర్‌ 17:    పార్వతీపురంలో బహిరంగ సభ. తనపై హత్యాయత్నం తర్వాత తొలిసారి సభలో మాట్లాడిన జగన్‌.
నవంబర్‌ 18:    300 రోజుకు చేరిన ప్రజాసంకల్పయాత్ర.
నవంబర్‌ 20:    కురుపాంలో బహిరంగ సభ.
నవంబర్‌ 24:    జియ్యమ్మవలస మండలం తురకనాయుడు వలస శివారులో 3300 కి.మీల మైలురాయి అధిగమించిన జగన్‌
నవంబర్‌ 25:    విజయనగరం జిల్లాలో పూర్తయిన పాదయాత్ర.

మరిన్ని వార్తలు