జగదానంద కారక.. జన జాతర సాగెరో..!

9 Jan, 2019 07:25 IST|Sakshi

అన్ని దారులూ ఇచ్ఛాపురం వైపే

పాదయాత్ర ముగింపు ఘట్టానికి భారీగా ప్రజలు

వైఎస్సార్‌ సీపీ జెండాలు రెపరెప

ఆ అడుగుజాడలు.. ఎన్నో కుటుంబాల్లో ఆనందాన్ని నింపాయి. ఎందరికో స్వాంతన చేకూర్చాయి.అవ్వాతాతల ముఖాల్లో చిరునవ్వులు చిందించాయి. చిన్నారులకు పునర్జన్మనిచ్చాయి. పేద కుటుంబాల్లో వెలుగులు నింపాయి.  వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన అనేక సమస్యలకు తక్షణం పరిష్కారం చూపారు. ఆరోగ్య సమస్యలతో వచ్చేవారిని చూసి చలించారు.
తక్షణ సాయం అందించారు. దీంతో జిల్లా ప్రజలు ఫిదా అయ్యారు. నీ మేలు మరువలేము..   జగదానంద కారకా.. అంటూ జగనన్నకు జై కొడుతున్నారు.   

ఈ చిత్రంలోని తల్లి శ్రావణిసంధ్య చేతుల్లో నెలల చిన్నారికి రెండునెలల వయస్సు ఉన్నప్పుడు తలలో రక్తం గడ్డ కట్టుకుపోయింది. వైద్యులకు చూపిస్తే రూ.13లక్షలు ఖర్చవుతాయన్నారు. ఏం చేయాలో పాలుపోక పేద దంపతులు శ్రావణిసంధ్య, దుర్గాప్రసాద్‌ ప్రజాసంకల్పయాత్రగా  జిల్లాకు వచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. పరిస్థితిని వివరించారు. దీంతో వెంటనే స్పందించిన జగన్‌ వైద్యానికి అయ్యే ఖర్చును భరించి తిరుపతి వైద్యశాలలో ఆపరేషన్‌ చేయించారు. చిన్నారికి పునర్జన్మనిచ్చారు. ఇప్పుడు ఆ కుటుంబం జగన్‌ను ఆరాధ్యదైవంగా కొలుస్తున్నారు.ఇలాంటి ఘట్టాలు ప్రజాసంకల్పయాత్రపొడవునా.. ఎన్నో.. ఎన్నెన్నో..  

సాక్షి ప్రతినిధి, పశ్చిమగోదావరి, ఏలూరు: వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జైత్రయాత్ర.. ఆఖరి ఘట్టానికి చేరుకుంది.  ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ కడప జిల్లా ఇడుపులపాయలోని దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్మృతివనం (వైఎస్సార్‌ ఘాట్‌) నుంచి 2017 నవంబర్‌ 6న చేపట్టిన ‘ప్రజా సంకల్పయాత్ర’ 341 రోజుల తర్వాత బుధవారం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనుంది. ఈ చారిత్రక ఘట్టాన్ని తిలకించేందుకు జిల్లా నుంచి నాయకులు, అభిమానులు, ప్రజలు పెద్దఎత్తున తరలి వెళ్లారు. 

జిల్లాలో పాదయాత్ర సూపర్‌ సక్సెస్‌
ప్రజాసంకల్ప పాదయాత్ర జిల్లాలో సూపర్‌ సక్సెస్‌ అయిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 3,648 కిలోమీటర్ల పాదయాత్ర జరిగితే మన జిల్లాలోనే నెలరోజులపాటు 316 కిలోమీటర్లు జగన్‌ పాదయాత్ర చేశారు. కనీవినీ ఎరుగని రీతిలో జిల్లాలో జరిగిన బహిరంగ సభలు విజయవంతమయ్యాయి. వీటితోపాటు పలుచోట్ల జరిగిన ఆత్మీయ సమ్మేళనాలకు వేలసంఖ్యలో ఆయావర్గాల ప్రజలు హాజరయ్యారు. పాదయాత్ర ఆద్యం తం జనజాతర మధ్య సాగింది. టీడీపీ సర్కారుపై నిప్పులు చెరుగుతూ.. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వైఎస్‌ జగన్‌ జిల్లాలో ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆయనతో సెల్ఫీలు తీసుకునేం దుకు, కరచాలనం చేసేందుకు ప్రజలు పోటీపడ్డారు.

పాదయాత్రకే హైలెట్‌ ఘట్టం : జిల్లాలో పాదయాత్ర ముగించుకుని కొవ్వూరు నుంచి రైలు కమ్‌ రోడ్డు బ్రిడ్జి మీదుగా తూర్పుగోదావరి జిల్లాలోకి వైఎస్‌ జగన్‌ అడుగుపెట్టే సమయంలో వంతెన వైఎస్సార్‌ సీపీ జెండాలతో రెపరెపలాడింది. భారీ జనసందోహంతో వారధి కిక్కిరిసింది. పాదయాత్రకే ఈ ఘట్టం హైలెట్‌గా నిలిచింది.  
ప్రజలకు భరోసా : పాదయాత్రలో భాగంగా జరిగిన బహిరంగ సభలు, ఆత్మీయ సమ్మేళనాల్లో వైఎస్‌ జగన్‌ ప్రజలకు భరోసా ఇచ్చారు. పార్టీ అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాలు అందరికీ అందిస్తామని ధైర్యం చెప్పారు. కష్టాలన్నీ తీరుస్తామని హామీ ఇచ్చారు. నవరత్నాల గురించి వివరించారు. ఇవే కాకుండా ఆటోడ్రైవర్లకు ఏడాదికి రూ.పది వేలు, అక్వా రైతులకు విద్యుత్‌ చార్జీల తగ్గింపు, వశిష్టవారధిపై వంతెన నిర్మాణంతోపాటు కొల్లేరు వాసులకు, మత్స్యకారులకు, ఇతర వృత్తుల వారికి పలు హామీలు ఇచ్చారు.

చలో ఇచ్ఛాపురం
ఈ చారిత్రక పాదయాత్ర ముగింపు ఘట్టానికి చేరుకుంది. ఇచ్ఛాపురంలో బుధవారం ముగియనుంది. ముగింపు సభలో పాల్గొనేందుకు ఇప్పటికే జిల్లా నుంచి ఇచ్ఛాపురం చేరుకున్న పలువురు నేతలు మంగళవారం జగన్‌తో కలిసి ముందుకు అడుగులు వేశారు. సోమవారం రాత్రి ఇచ్చాపురం బయలుదేరి వెళ్లిన నరసాపురం, రాజమండ్రి పార్లమెంట్, పాలకొల్లు, తణుకు, ఉండి నియోజకవర్గాల కన్వీనర్లు ముదునూరి ప్రసాదరాజు, కవురు శ్రీనివాస్, గుణ్ణం నాగబాబు, కారుమూరి నాగేశ్వరరావు, పీవీఎల్‌ నరసింహరాజు, మాజీ ఎమ్మెల్యేలు పాతపాటి సర్రాజు, ఘంటా మురళీ రామకృష్ణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు చిలువూరి కుమారదత్తాత్రేయ వర్మ, కమ్మ శివరామకృష్ణ తదితరులు మంగళవారం జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. మంగళవారం ఏలూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్ల నాని,  మాజీ ఎమ్మెల్యేలు తెల్లం బాలరాజు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, గ్రంధి శ్రీనివాస్, కొట్టు సత్యనారాయణ, తానేటి వనిత, సమన్వయకర్తలు జి.శ్రీనివాస్‌ నాయుడు, ఉన్నమట్ల ఎలీజా, గుణ్ణం నాగబాబు,  కొఠారు అబ్బయ్యచౌదరి, తలారి వెంకట్రావు, పుప్పాల వాసుబాబు తదితరులు కార్యకర్తలతో బయలుదేరి వెళ్లారు.

జగన్‌ వల్లే ఖతార్‌ నుంచి స్వదేశానికి
ఈ చిత్రంలోని మహిళ పేరు పల్లి రత్నం. ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామానికి చెందిన పల్లి నిషికుమార్‌ భార్య. 2017లో ఉపాధి కోసం ఖతార్‌ వెళ్లారు. ఏజెంట్‌ ద్వారా  అక్కడ ఓ ఇంటిలో పనికి కుదిరిన రత్నంను ఇంటి యజమానులు పలు రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు. 5 నెలల జీతం ఇవ్వకుండా కాలయాపన చేస్తూ గడిపారు. యజమానులను జీతం కోసం పట్టుపట్టడంతో రత్నంపై చేయని నేరానికి యజమానులు పోలీసు కేసు పెట్టారు. ఐదు నెలలపాటు పోలీస్‌స్టేషన్‌ చుట్టూ తిప్పారు. దీంతో ఆమె ఆచూకీ తెలియకపోవడంతో ఆమె భర్త ఆందోళన చెందారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జిల్లాకు వచ్చిన వైఎస్‌ జగన్‌ను పిల్లలతో సహా కలిసి విషయం వివరించారు.  దీంతో జగన్‌ ఎంపీ విజయసాయిరెడ్డికి ద్వారా ఎన్‌ఆర్‌ఐ సెల్‌ కన్వీనర్‌ హర్షవర్ధన్‌రెడ్డికి సమాచారం అందించారు. ఆయన ఇండియన్‌ అంబసీ అధికారులతో మాట్లాడి రత్నంను స్వదేశానికి రప్పించారు. గత అక్టోబర్‌లో రత్నం ఇక్కడికి తిరిగి వచ్చారు. ఎప్పటికైనా జగన్‌ను కలుసుకుని ధన్యవాదాలు చెబుతానని రత్నం చెబుతున్నారు. 

బాధితులకూ ఆపన్న హస్తం
అలాగే కాళ్ల గ్రామంలో కిడ్నీ బాధితుడు తోట వంశీ కృష్ణతోపాటు, అనారోగ్యంతో బాధపడుతున్న కూలా రాజేష్, బొండా హరేష్‌కు కూడా జగన్‌ ఆర్థిక సాయం చేశారు. ఆ కుటుంబాల్లో ఆనందాలు నింపారు. 

మరిన్ని వార్తలు