మాట నిలబెట్టుకున్న వైఎస్‌ జగన్‌

11 Jun, 2019 03:56 IST|Sakshi
హర్షం వ్యక్తం చేస్తున్న సచివాలయ ఉద్యోగులు

కృతజ్ఞతలు తెలియజేసిన ఉద్యోగుల జేఏసీ 

నవరత్నాలను బాధ్యతతో అమలు చేస్తామని వెల్లడి

సాక్షి, అమరావతి : ఉద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం తొలి కేబినెట్‌లోనే కీలక నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర నాయకత్వం కృతజ్ఞతలు తెలియజేసింది. సోమవారం ఏపీ జేఏసీ (అమరావతి) చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు విలేకర్లతో మాట్లాడుతూ సీఎం తొలిసారి ఉద్యోగ సంఘాల నాయకులను కలిసినప్పుడు చెప్పిన మాట ప్రకారం తొలి కేబినెట్‌ సమావేశంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత ఉద్యోగులకు సంబంధించిన అనేక సానుకూల నిర్ణయాలు ప్రకటించడం అభినందనీయమన్నారు. పే రివిజన్‌ కమిటీ నివేదిక సమర్పించేందుకు కొంత సమయం పడుతున్న నేపథ్యంలో ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతిని ప్రకటించడం, జులై 1వ తేదీ నుంచి పెంచిన మొత్తాన్ని చెల్లించేందుకు నిర్ణయం తీసుకోవడం ఉద్యోగులకు ఎంతో మేలుచేస్తుందన్నారు.

ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎన్నో సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్న సీపీఎస్‌ రద్దుకు నేడు సూత్రప్రాయంగా అంగీకారం తెలియజేసి సాంకేతిక పరమైన తదితర అంశాలపై చర్చించేందుకు కమిటీని నియమించడం, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి అంగీకరిస్తూ విధివిధానాలు ఖరారుకు కమిటీ వేయడం సాహసోపేతమైన నిర్ణయమన్నారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయడానికి నిర్ణయించడంతో పాటు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఏజెన్సీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి నేరుగా జీతం ఇచ్చేలా చర్యలు తీసుకునేందుకు చీఫ్‌ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీని నియమించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఏళ్లుగా ఎదురుచూస్తోన్న ఉద్యోగుల ఆశలకు కార్యరూపం ఇచ్చిన ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయన్నారు. సీఎం ఇచ్చిన స్ఫూర్తితో ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తోన్న నవరత్నాలను, సంక్షేమ పథకాలను ఉద్యోగులంతా క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయితీతో ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ముందుంటారన్నారు.

>
మరిన్ని వార్తలు