నవరత్నాల అమలుపై కసరత్తు చేస్తోన్న జగన్‌

29 May, 2019 03:48 IST|Sakshi

నవరత్నాల అమలుపై ప్రమాణ స్వీకారానికి ముందే కసరత్తు

వీలైనంత త్వరగా కేబినెట్‌ కూర్పు చేసి నవరత్నాలపై కీలక నిర్ణయాలు

ఇందులో భాగంగా సీఎస్‌ ఎల్వీ, మాజీ సీఎస్‌ అజేయ కల్లంతో ఉన్నతస్థాయి సమీక్ష

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముందే ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై నిశ్చయ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దృష్టి సారించారు. నవరత్నాల అమలుపై ఆయన కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు ఆ పథకాల అమలుపై తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి శామ్యూల్‌లతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. నవరత్నాల్లోని ప్రతీ పథకంపై ఈ సమీక్షలో చర్చించారు.

బడ్జెట్‌ కేటాయింపులపై చర్చ
నవరత్నాల్లో ఏ పథకానికి ఎంత నిధులు అవసరం, వచ్చే బడ్జెట్‌లో ఎంత కేటాయింపులు చేయాల్సి ఉంటుందనే అంశాలపై చర్చించారు. అలాగే నవరత్నాల్లో ఏ పథకాన్ని ఏ శాఖ ద్వారా అమలు చేయించాలనే విషయంపైన కూడా ఈ సమీక్షలో చర్చించారు. వీలైనంత త్వరగా కేబినెట్‌ కూర్పు చేసి నవరత్నాల అమలుపై కీలక నిర్ణయాలను తీసుకోవాలనే ఆలోచనలో జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రజలకు ఇచ్చిన మాట మేరకు సాధ్యమైనంత త్వరగా నవరత్నాలను ప్రజలకు అందించాలనే తపన జగన్‌మోహన్‌రెడ్డిలో కనిపిస్తోందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. 

లబ్దిదారుల గుర్తింపు...
నవరత్నాల్లో ప్రతీ పథకాన్ని అర్హులైన ప్రతీ ఒక్కరికి అందేలా ఏర్పాట్లు చేసే విషయమై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. ప్రమాణ స్వీకారానికి ముందే రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రి మోడీని కలిసి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలుపై జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు నవరత్నాల విషయంలో కూడా ఆయన అంతే స్పీడుతో ముందుకు సాగుతున్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


18లోగా కొత్త అసెంబ్లీ 
వచ్చే నెల 18వ తేదీలోగా కొత్త అసెంబ్లీ కొలువు తీరాల్సి ఉంది. అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రొటెం స్పీకర్‌ను ఎంపిక చేసిన తరువాత అసెంబ్లీకి ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ వచ్చే నెల 18వ తేదీలోగా పూర్తి కావాల్సి ఉంటుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అసెంబ్లీ ఏర్పడ్డాక బడ్జెట్‌ సమావేశాలను నిర్వహిస్తారని ఒక సీనియర్‌ అధికారి తెలిపారు.

మరిన్ని వార్తలు