షాక్‌ కొట్టేలా మద్యం ధరలు: వైఎస్‌ జగన్‌

9 Jul, 2017 18:10 IST|Sakshi
షాక్‌ కొట్టేలా మద్యం ధరలు: వైఎస్‌ జగన్‌

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ వేదికగా పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కీలక ప్రకటన చేశారు.  సంపూర్ణ మద్య నిషేధం దిశగా మూడు దశల్లో కార్యాచరణ చేపడతామని వెల్లడించారు. అందులో భాగంగా ప్రజలను మద్యపానానికి దూరం చేసేందుకు మద్యంపానంపై ఉక్కుపాదం మోపుతామని, ధరలను షాక్‌ కొట్టే రీతిలో పెంచుతామని చెప్పారు. మద్యం కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోందని.. మద్యం సేవించిన వ్యక్తులు విచక్షణ కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ కుటుంబం కూడా మద్యపానం కారణంగా ముక్కలు కానివ్వనని హామీ ఇచ్చారు.

మద్యపాన నిషేధంపై వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే.. మొత్తం మూడు దశల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం. గ్రామాలకు వెళ్లండి అందరీకి చెప్పండి అన్న వస్తున్నాడు. మద్యాన్ని నిషేధిస్తానని అన్న మాట చెప్పాడు అని గ్రామాల్లో ప్రతి అక్కచెల్లెమకు చెప్పండి. మద్యం రాకాసి ఇంటింటా కాపురాలను కూలుస్తోంది. దాని కారణంగా ఎన్ని జీవితాలు పాడవుతున్నాయో నేను నా కళ్లారా చూశాను. పిల్లలు తాగుబోతులు అయితే తల్లిదండ్రులు నరకయాతన పడుతున్నారు. భర్తలు తాగుబోతులుగా మారితే కుటుంబాల ఆర్థిక పరిస్ధితి దెబ్బతింటోంది. నేరాలు ఘోరాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. మద్యం మానేస్తేనే కుటుంబ సభ్యుల పట్ల ప్రేమ ఆప్యాయతలు పెరుగుతాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. మీరు తాగండి మేమున్నాం అంటూ యువతను మద్యానికి బానిస చేస్తోంది. ప్రభుత్వం దగ్గర మంచినీటికి సంబంధించిన విజన్‌ డాక్యమెంట్‌ లేదు. మద్యానికి సంబంధించిన విజన్‌ డాక్యుమెంట్‌ మాత్రం ఉంది. మద్యానికి విస్తారంగా లైసెన్సులు ఇస్తున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మద్యంపై నిషేధం విధించొచ్చు.

మీకు ఒక ఉదాహరణ చెబుతా. మీ అందరికీ కూడా గుర్తు ఉండి ఉంటుంది. 1969 నుంచి 1990 దాకా ఎక్కువగా సిగరెట్‌ తాగేవాళ్లు. ఇవాళ ఎందుకు సిగరెట్‌ వినియోగం తగ్గిందో ఆలోచించాలి. దానికి కారణం పొగతాగడం వల్ల నష్టాలను గ్రహించిన సుప్రీంకోర్టు సిగరెట్‌ ప్యాకెట్లపై పెద్ద అక్షరాలతో డేంజర్‌ గుర్తును వేయించింది. ధూమపానానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అవగాహనా కార్యక్రమాలు చేపట్టేలా ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇలా చేయడం వల్లే మార్కెట్‌లో సిగరెట్‌ తాగే వాళ్ల సంఖ్య తగ్గింది. మద్యాన్ని ఒకేసారి నిషేధిస్తే మద్యం తాగేవారు వేరే మార్గాలను వెతుక్కుంటారు. వారందరూ మద్యపానాన్ని విడనాడేలా ముందు అవగాహన కల్పించాలి. ఇందుకోసం దశల వారీగా మద్యపానంపై నిషేధం తెస్తాం. మూడు దశల్లో నిషేధం విధిస్తాం. మద్యపాన నిషేధానికి సంబంధించిన మూడు దశల వివరాలు ఇలా ఉన్నాయి.

మొదటి దశ:
తొలి దశలో మద్యం దుకాణాల సంఖ్యను భారీగా తగ్గిస్తామని వైఎస్‌ జగన్‌ చెప్పారు. అంతేకాకుండా మద్యం వల్ల కుటుంబాలు ఎలా నాశనం అవుతున్నాయో వివరించేందుకు సినిమా థియేటర్లలో, టీవీల్లో పెద్ద ఎత్తున ప్రకటనలు ఇస్తామని తెలిపారు. కనీవినీ ఎరుగని రీతిలో షాక్‌ కొట్టేలా మద్యం ధరలు పెంచుతామని వెల్లడించారు.

రెండో దశ:
మద్యం సేవించడం వల్ల కలిగే నష్టాలపై మీడియాలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. అంతేకాకుండా దేశమంతటికీ ఇదే విధానాన్ని అవలంభించేలా కేంద్ర ప్రభుత్వాన్ని, మిగతా రాష్ట్రాలను ఒప్పించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. మద్యపానం నుంచి బయటపడాలనుకునే వ్యక్తుల కోసం ప్రతి జిల్లాలో రీ-హాబిలిటేషన్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తామని వారికి అండగా ఉంటామని వెల్లడించారు.

మూడో దశ:
ఆఖరు దశలో మద్యం కేవలం కోటీశ్వరులు తిరిగే ఫైవ్‌ స్టార్‌ హోటళ్లలో అందుబాటులో ఉండేలా చేస్తామని వైఎస్‌ జగన్‌ చెప్పారు. తాగి తాగి వారి లివర్‌ చెడిపోతే.. ఏ అమెరికాకో పోయి వైద్యం చేయించుకుంటారని, వాళ్లే నాశనమవుతారని అన్నారు. ప్రభుత్వ ఆదాయం తగ్గినా సరే.. మద్యం రేట్లను విపరీతంగా పెంచుతామని చెప్పారు. మద్యం తయారు చేసినా.. అమ్మినా ఏడేళ్ల పాటు శిక్ష విధించేలా చట్ట సవరణ చేస్తామని వెల్లడించారు. మద్యం తాగేవారి ఓట్లు పడవేమోనన్న భయం కొద్దో గొప్పో ఉండొచ్చని అన్నారు. వారందరికీ అన్న చేసే పని.. డాక్టర్‌ చేసే పని ఒక్కటే అని చెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మూడు దశల్లో మద్య నిషేధం అమలు చేస్తానని మాట ఇస్తున్నట్లు చెప్పారు వైఎస్‌ జగన్‌. వీటన్నింటినీ ప్రతి గ్రామానికి తీసుకువెళ్లాలని కార్యకర్తలను కోరారు.