మీ విచారణపై నమ్మకం లేదు

27 Oct, 2018 05:11 IST|Sakshi

డీజీపీ వ్యవహార శైలి అభ్యంతరకరం

స్టేట్‌మెంట్‌ కోరిన ‘సిట్‌’ అధికారులకు చెప్పిన వైఎస్‌ జగన్‌ 

వెనుతిరిగిన దర్యాప్తు బృందం 

సాక్షి, హైదరాబాద్‌: తనపై విశాఖపట్టణం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విచారణ పట్ల తమకు ఏమాత్రం నమ్మకం లేదని అందుకే తాను వాంగ్మూలం (స్టేట్‌మెంట్‌) ఇవ్వడానికి సిద్ధంగా లేనని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘సిట్‌’ అధికారులకు స్పష్టం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో నాగేశ్వరరావు నేతృత్వంలోని ‘సిట్‌’ అధికారుల బృందం హైదరాబాద్‌ సిటీ న్యూరో సెంటర్‌ ఆసుపత్రిలో జగన్‌ను కలుసుకుని విచారించడానికి ప్రయత్నించారు. 

ఇంకా ఎలా నమ్మమంటారు?
‘ఈ సంఘటనపై డీజీపీ ఇప్పటికే అలా మాట్లాడాక, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతున్న తీరు చూసిన తరువాత ఇంకా ఈ విచారణను ఎలా నమ్మమంటారు? మీరు మీ డీజీపీకి చెప్పగలరో  లేదో నాకు తెలియదు గానీ, నా అభిప్రాయం ఆయనకు తెలియజేయండి. ఒక డీజీపీగా ఉంటూ అలా ఏకపక్షంగా, అభ్యంతరకరంగా మాట్లాడటం సబబు కాదని చెప్పండి. ఈరోజు వాళ్లు (టీడీపీ) అధికారంలో ఉండొచ్చు... రేపు మరొకరు రావచ్చు... పోలీసు అధికారులు నిష్పాక్షికంగా వ్యవహరించాలని ఆయనకు (డీజీపీకి) చెప్పండి.

ఈ ప్రభుత్వం విచారణ మీద నమ్మకం లేకనే మేం థర్డ్‌ పార్టీ విచారణను కోరుతున్నాం’ అని ఈ సందర్భంగా జగన్‌ వారితో పేర్కొన్నారు. స్టేట్‌మెంట్‌ ఇవ్వడానికి జగన్‌ సున్నితంగా తిరస్కరించడంతో ‘సిట్‌’ అధికారులు వెనుదిరిగారు. ‘హత్యాయత్నంపై డీజీపీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడిన తీరు, వారు ఈ ఉదంతంపై వ్యవహరించిన వైఖరి చూశాక విచారణపై విశ్వాసం పోయింది.  అందుకే విచారణ నోటీసును తిరస్కరిస్తున్నాం’ అని పేర్కొంటూ జగన్‌ తరపున పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సిట్‌ నోటీసుపై సంతకం చేసి అధికారులకు అందచేశారు.  

మరిన్ని వార్తలు