బాబు పాలనలో ప్రజలకు దక్కింది కరువే!

4 Mar, 2018 09:40 IST|Sakshi

 పొలాలకు సాగర్‌ నీరు ఎక్కడ?

 పంటలకు గిట్టుబాటు ధరల్లేవు..

దొనకొండలో పరిశ్రమలు శూన్యం

 వెలిగొండను గాలికొదిలారు..

తాళ్లూరు సభలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో ప్రజలకు దక్కింది కరువు తప్ప.. మరేమీ లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. ఇదే విషయాన్ని ప్రజలు అడుగడుగునా తనకు చెబుతున్నారని అన్నారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా శనివారం మధ్యాహ్నం మండల కేంద్రంతాళ్లూరులో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. నాలుగేళ్లుగా వరుస కరువులతో జిల్లా రైతాంగం తీవ్రంగా నష్టపోయిందన్నారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో తప్ప సాగర్‌ ఆయకట్టులో వరి పంటకు నీరివ్వలేదని గుర్తు చేశారు. ఎడమ కాలువ ద్వారా పక్కన తెలంగాణలో వరి పంటకు నీరిస్తుంటే.. మన వద్ద మాత్రం నీరిచ్చే పరిస్థితి లేదన్నారు. ఆ సీఎంకు ఉన్నదేమిటి.. మనకు లేనిదేమిటని జగన్‌ ప్రశ్నించారు. అరకొరగా పండిన కంది పంటకు మద్దతు ధర రూ.5,450 ఇవ్వాల్సి ఉండగా రూ.4 వేలు కూడా ఇచ్చే పరిస్థితి లేదని మండిపడ్డారు. రైతు పండించిన పంటలో 10 శాతం పంటను కూడా మార్క్‌ఫెడ్‌ కొనడం లేదని దుయ్యబట్టారు. గిట్టుబాటు ధర ఇచ్చి సుబాబుల్, జామాయిల్‌ రైతులను దివంగత వైఎస్‌ ఆదుకున్నారని చెప్పారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో వెలిగొండ పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టారని గుర్తు చేశారు. దర్శి సమన్వయకర్త బాదం మాధవరెడ్డి పాల్గొన్నారు.

శివకు తోడుగా ఉంటా..మాధవ్‌ను ఆశీర్వదించండి
బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డికి తోడుగా ఉంటానని, బాదం మాధవరెడ్డిని ఆశీర్వదించాలని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. దర్శిలో పార్టీ పరంగా కన్‌ఫ్యూజన్‌ ఉండకూడదని ఈ విషయం చెబుతున్నానని పేర్కొన్నారు. శివ తనకు స్నేహితుడు.. ఆప్తుడన్నారు. శివ అన్ని రకాలుగా తనకు తోడుగా ఉంటాడని.. తాను కూడా తనకు తోడుగా ఉంటానని జగన్‌ ప్రకటించారు. తాను పోటీ చేయనని శివ చెప్పడం వల్లే.. బాదం మాధవరెడ్డిని ఇన్‌చార్జిగా నియమించామని వెల్లడించారు. దర్శి నియోజకవర్గంలో మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో ఉత్సాహవంతుడు మాధవరెడ్డికి మీ అందరి చల్లని ఆశీస్సులు ఇవ్వాలని వైఎస్‌ జగన్‌ కోరారు.  

జిల్లాకు అన్యాయం చేసిన ద్రోహి చంద్రబాబు
వెలిగొండ ప్రాజెక్టును అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి చేస్తానని చెప్పి గద్దెనెక్కాక ప్రాజెక్టును గాలికొదిలి జిల్లా ప్రజలకు అన్యాయం చేసిన ద్రోహి చంద్రబాబు..అని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఘాటుగా విమర్శించారు. తాళ్లూరు బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వెలిగొండ పూర్తి చేసి ఉంటే జిల్లా వాసులకు తాగునీటి కష్టాలు తప్పేవన్నారు. ఫ్లోరైడ్, కిడ్నీ వ్యాధుల బాధలు ఉండేవి కావన్నారు. జిల్లాలోని దొనకొండ, కనిగిరి ప్రాంతాల్లో రూ.లక్షల కోట్లతో పరిశ్రమలు నెలకొల్పి లక్షలాది ఉద్యోగాలిస్తామని చెప్పిన ప్రభుత్వం ఒక్కటీ నెరవేర్చలేదని ఎంపీ వైవీ విమర్శించారు. దొనకొండలో విమాన పరిశ్రమకు రూ.20 వేల కోట్ల పెట్టుబడులు, 3 వేల ఉద్యోగాలంటూ మంత్రి శిద్దా రాఘవరావు ఇచ్చిన హామీ నెరవేరలేదని విమర్శించారు. చంద్రబాబు ఉత్తుత్తి హామీలతో వంచించారన్నారు. హోదా వస్తే జగన్‌ నాయకత్వంలో దొనకొండలో నూరు రోజుల్లోనే పరిశ్రమలు నెలకొల్పుతామని భరోసా ఇచ్చారు. దర్శి నియోజకవర్గంలో విషజ్వరాలతో వందలాది మంది చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. జిల్లాలో వెలిగొండ, గుండ్లకమ్మ, తదితర ప్రాజెక్టులను నిర్మించింది దివంగత నేత వైఎస్‌ హయాంలోనేనని గుర్తు చేశారు. చంద్రబాబు సొంత ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టాడని ఎంపీ వైవీ ధ్వజమెత్తారు.

ఒక్కరికైనా ఉద్యోగమిచ్చారా?
రూ.లక్షల కోట్లతో పరిశ్రమలు, లక్షలాది ఉద్యోగాలని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం నాలుగేళ్ల పాలనలే ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా..? అని వైస్సార్‌ సీపీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా తాళ్లూరు బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో మోసపూరిత హామీలతో ప్రజలను మాయ చేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని బాలినేని విమర్శించారు. ఆ తర్వాత ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. రైతులకు రుణమాఫీ, ఉద్యోగాలివ్వలేక నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చినా నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. బాబు వస్తేనే జాబు వస్తుందని చెప్పారని.. ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి రాగానే ఉన్న జాబులు ఊడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే నవరత్నాలు అమలు చేస్తారన్నారు. వైఎస్సార్‌ కుటుంబం మాట మీద నిలబడే కుటుంబమని చెప్పారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఒక అడుగు వేస్తే.. వైఎస్‌ జగన్‌ రెండు అడుగులు వేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని బాలినేని విశ్వాసం వ్యక్తం చేశారు.

>
మరిన్ని వార్తలు