చంద్రబాబు నివాసం అక్రమ కట్టడమే

19 Jul, 2019 02:47 IST|Sakshi

ప్రభుత్వమే చట్టాన్ని ఉల్లంఘిస్తే రక్షకులెవరు?

అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి : చట్టాలను తుంగలో తొక్కి అడ్డగోలుగా నిర్మించిన అక్రమ నిర్మాణాలను చట్ట ప్రకారం తొలగిస్తామంటే జరగరాని ఘోరం జరిగిపోతున్నట్లు మాట్లాడటానికి ప్రతిపక్ష నేత చంద్రబాబుకు నోరెలా వస్తోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలదీశారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ.. 40 ఏళ్ల రాజకీయ అనుభవం.. అంటూ తనకు తాను చెప్పుకునే చంద్రబాబుకు తను నివాసం ఉంటున్న అక్రమ కట్టడాన్ని కాపాడుకోవాలన్న తపన తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా? అని సీఎం  ప్రశ్నించారు.

‘ఇలా నదీ ప్రవాహాలను అడ్డుకునేలా విచ్చలవిడిగా నిర్మాణాలు సాగిస్తే భవిష్యత్తులో జరిగే ముంపు నష్టాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? చట్టాలు చేసి వాటిని అమలు చేయాల్సిన ప్రభుత్వమే వాటిని ఉల్లంఘిస్తే ప్రజలకు ఎలాంటి సందేశం ఇచ్చినట్లు?’ అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు, టీడీపీ సభ్యులపై ప్రశ్నల వర్షం కురిపించారు. శాసనసభలో గురువారం ప్రశ్నోత్తరాల సందర్భంగా అక్రమ కట్టడాలు, ప్రజావేదిక కూల్చివేత అంశాలపై అధికార, ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు సాగాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కలుగజేసుకుని గుంటూరు జిల్లా ఉండవల్లిలో కరకట్ట కింద బాబు సర్కారు నిర్మించిన ప్రజా వేదికతోపాటు చంద్రబాబు నివాసం ఉంటున్న భవనం కూడా అక్రమ కట్టడమేనని ఆధార సహితంగా వివరించారు.

చట్టాలు చేసే సభలో అక్రమ నిర్మాణం కూల్చివేతపై చర్చా?
‘కరకట్ట కింద చంద్రబాబు అక్రమ నివాసం పక్కనే అప్పటి ప్రభుత్వం అక్రమంగా గ్రీవెన్స్‌ హాలు కట్టింది. చట్టాన్ని ఉల్లంఘించి కట్టిన అక్రమ నిర్మాణమైన ప్రజావేదికను చట్టాన్ని గౌరవిస్తూ కూల్చివేస్తే అదేదో నేరమైనట్లు చట్టాలు చేసే సభలోనే ఇవాళ చర్చ పెడుతున్నారు. వరద నీరు వెళ్లే మార్గాలకు అడ్డుగా కట్టడాలు నిర్మిస్తే జరిగే అనర్థాలు, నష్టాలు ఊహించనంత తీవ్రంగా ఉంటాయి. అందువల్ల వరద నీరు పోయే మార్గంలో ఎవరూ అడ్డుకట్ట వేయకూడదు. అలా చేయడం వల్ల నీరు నేరుగా పోవాల్సిన మార్గంలో పోకుండా దారి మళ్లుతుంది. దాని ప్రభావం వేరే ప్రాంతంపై పడి విపరీతంగా మునిగిపోయే పరిస్థితులు తరచూ సంభవిస్తున్నాయి. ఇలా జరగరాదనే ముందు చూపుతోనే ప్రజా ప్రయోజనార్థం ప్రభుత్వం రివర్‌ కన్జర్వేషన్‌ చట్టం చేసింది. ఎక్కడైనా నది పక్కన ఎవరైనా కట్టడాలు చేపడితే రివర్‌ కన్సర్వేషన్‌ యాక్ట్‌ ప్రకారం సంబంధిత విభాగం ఇంజినీరు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కరకట్ట కింద చంద్రబాబు ఉంటున్న ఇల్లుతో పాటు, ఆ పక్కనే కట్టిన భవనాలకు అనుమతి లేదు’ అని జగన్‌ వివరించారు.

ఈఈ తిరస్కరణకు ఈ లేఖ సాక్ష్యం 
నాడు గ్రీవెన్సు హాల్‌ నిర్మాణానికి అనుమతి కోరితే కృష్ణా నది కరకట్ట దిగువన ఎలాంటి నిర్మాణాలకు అనుమతి ఇవ్వకూడదని రివర్‌ కన్సర్వేటర్‌ అయిన విజయవాడలోని కేసీ డివిజన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ స్పష్టం చేసిన విషయాన్ని సీఎం ఎత్తి చూపారు. 2017 సెప్టెంబరులో ఈఈ రాసిన లేఖను అసెంబ్లీలోని టీవీ స్క్రీన్‌పై ప్రదర్శించి సీఎం చదివి వినిపించారు. కృష్ణా నదిలో అత్యధిక వరద మట్టం (మాగ్జిమమ్‌ ఫ్లడ్‌ లెవెల్‌) 22.60 మీటర్లు. చంద్రబాబు నివాసం ఉంటున్న భవనం 19.50 మీటర్ల ఎత్తులో ఉంది. అందువల్ల గ్రీవెన్స్‌ హాల్‌ నిర్మాణానికి అనుమతించలేమని ఈఈ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. ‘గరిష్ట వరద ప్రవాహ మట్టం కంటే ఇది కింద ఉంది. కట్ట ఎంత ఎత్తులో ఉంది.. కింద ఎంత దిగువన ఆ నిర్మాణాలు ఉన్నాయన్నది ఆ దారిలో వెళ్లే వారికి స్పష్టంగా కనిపిస్తుంది.

అక్కడ ఏ నిర్మాణం ఉన్నా, అది కచ్చితంగా వరద ప్రవాహాన్ని అడ్డుకోవడమేనని దీనిని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కరకట్ట మీద సచివాలయానికి వస్తుంటే పక్కనే కట్ట కింద చంద్రబాబునాయుడి నివాసంతోపాటు అనేక నిర్మాణాలు కనిపిస్తాయి. అంటే కట్ట ఎంతో ఎత్తులో ఉంటే, పక్కన చంద్రబాబు ఇంటితో పాటు, అనేక నిర్మాణాలు చాలా కిందే ఉన్నాయి.  ఇప్పుడు ఉంటున్న చోట స్విమ్మింగ్‌పూల్‌కు అనుమతి ఉందని చంద్రబాబు అంటున్నారు. అనుమతి ఉందో లేదో నాకైతే తెలియదు. స్విమ్మింగ్‌ పూల్‌ అనేది భూమి లోపలకు ఉంటుంది కాబట్టి రివర్‌ కన్సర్వేషన్‌కు దరఖాస్తు చేసుకుని ఉంటే ఆ రోజుల్లో అనుమతి ఇచ్చారేమో? అయినా స్విమ్మింగ్‌ పూల్‌ అయినా, భవనమైనా ఒకటేనా? ఈ పెద్దమనిషి ఒకటే అంటుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. 

లోకాయుక్త ఆదేశం బేఖాతరు 
కృష్ణా నది కరకట్ట వెంట ఉన్న అక్రమ నిర్మాణాలను ఆరు నెలల్లోగా తొలగించాలని లోకాయుక్త ఆదేశించినట్లు కూడా కృష్ణా రివర్‌ కన్సర్వేషన్‌ విభాగం ఈఈ సర్కారుకు రాసిన లేఖలో పేర్కొన్నారని సీఎం జగన్‌ గుర్తు చేశారు. గ్రీవెన్స్‌ హాల్‌ నిర్మాణానికి అనుమతి కోసం చేసిన దరఖాస్తుపై ఈఈ రాసిన లేఖలో మరికొన్ని అంశాలను కూడా ప్రస్తావించారని వివరించారు. ‘కృష్ణా కరకట్ట వెంట అక్రమ నిర్మాణాలను ఆరు నెలల్లోగా తొలగించాలంటూ లోకాయుక్త ఆదేశించారు. వీటన్నింటి నేపథ్యంలో కృష్ణా నది కరకట్టపై ఎలాంటి నిర్మాణాలకు అనుమతి ఇవ్వకూడదు’ అని ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ రాసిన వాక్యాలను సీఎం చదివి వినిపించారు.

సీఎంను అనే గర్వం..
‘అప్పటి సీఎం చంద్రబాబు ఇంటి పక్కనే గ్రీవెన్స్‌ హాల్‌ నిర్మాణానికి అనుమతి ఇవ్వలేమని అధికారులు స్పష్టంగా లేఖ రాసినా ‘నేను సీఎంని, నన్ను ఎవడు ఆపుతాడు? నేను ఏదైనా చేయాలనుకుంటే ఆపడానికి మీరెవరు?’ అనే గర్వంతో చంద్రబాబు వ్యవహరించారు. ‘రివర్స్‌ కన్సర్వేటర్‌ ఇచ్చిన ఆదేశాలను చెత్తబుట్టలో పడేసి అక్కడ ప్రభుత్వమే దగ్గరుండి అక్రమ నిర్మాణం చేపట్టింది. దీంతో ఒకరిని చూసి మరొకరు అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఇది చాలా ప్రమాదకరం. ఈ అక్రమ కట్టడాల వల్ల భారీ వర్షాలు వచ్చినప్పుడు వరద ప్రవాహం మార్గం లేక దారిమళ్లి ఎక్కడెక్కడికో పోతుంది. దీనివల్ల విజయవాడ నగరం కూడా మునిగిపోయే ప్రమాదం ఉంది’ అని జగన్‌ వివరించారు. 

అందుకే అక్కడ సమావేశం 
ఇలాంటి పరిస్థితుల్లో జరుగుతున్న అన్యాయాన్ని చూడలేక.. కలెక్టర్లు, ఎస్పీల సమావేశం ప్రజావేదిక అనే అక్రమ భవనంలోనే ఏర్పాటు చేశా. మంత్రులు, ఉన్నతాధికారులు, కలెక్టర్లు, ఎస్పీలను అక్కడే కూర్చోబెట్టిన నేను వారందరినీ ఒకే మాట అడిగాను. మనమంతా చట్టాలు రూపొందించే వాళ్లం. ప్రభుత్వాన్ని నడిపే వాళ్లం. ఇక్కడ అక్రమంగా నిర్మించిన ఒక భవనంలో కూర్చుని వ్యవస్థ మార్పు గురించి మాట్లాడుకుంటున్నాం. అందరికీ ఒకే నియమం.  ముఖ్యమంత్రి అయినా, సామాన్యుడు అయినా ఒకటే రూల్‌. అలాంటిది మనం ఈ అక్రమ నిర్మాణంలో కూర్చుని చట్టాలు చేసుకోవడం ఎంత వరకు సమంజసం? అని ప్రశ్నించా. ప్రభుత్వ పెద్దే అక్రమ నిర్మాణంలో ఉంటే తప్పులను ప్రశ్నించే హక్కు ఎలా ఉంటుంది? అందుకే దీని కూల్చివేతతోనే అక్రమ కట్టడాల తొలగింపునకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించి అదే వేదికగా ప్రకటించా’ అని సీఎం వివరించారు. 

ప్రతి విషయంలో వక్రీకరణే
‘బాబు సర్కారు 2018లో భవనాల క్రమబద్ధీకరణ పథకం (బీఆర్‌ఎస్‌) తెచ్చింది. అందులో కూడా గరిష్ట వరద మట్టం నిబంధనకు లోబడి అని ఉంది.  ప్రతి విషయంలో వక్రీకరణ తప్ప వాస్తవం లేదు. ఆయన నివాస భవనం వరద ప్రవాహాన్ని అడ్డుకుంటుందనే అనుమతులు ఇవ్వలేదు. ఆ పెద్ద మనిషి అదే భవనంలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వారు నేను అక్కడే ఉంటా. రాష్ట్రానికి, ప్రజలకు ఏమి జరిగినా నాకు బాధ్యత లేదు.. అనే చందంగా ఉంటారా? ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తికి ఆ మాత్రం బుర్ర, జ్ఞానం ఉండదా?’ అని సీఎం వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకు ముందు చంద్రబాబు భవన నిర్మాణ రూల్స్‌ గురించి చదువుతుండగా జీవో తేదీ చెప్పాలని అధికార పక్ష సభ్యులు అడిగారు. మీరే చూసుకోండని చంద్రబాబు అనడంతో ‘చంద్రబాబు అక్రమాలు మెదలు పెట్టి దుర్భుద్ధితోనే సీఎంగా రూల్స్‌ మార్చారేమో లేకపోతే తేదీ ఎందుకు చెప్పరు’ అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.  

40 ఏళ్ల ఇండస్ట్రీ అంటే ఇదేనా?
‘చంద్రబాబు పదే పదే 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటారు. 40 ఏళ్ల అనుభవం అంటారు. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఆంటారు. ఏంటి అధ్యక్షా ఆయన రాజకీయ చర్రిత? అంత అనుభవం ఉంటే నలుగురికి మార్గదర్శకంగా ఉండాలి. ఆ రాజకీయ చరిత్ర నలుగురు చూసి, అలాంటి నాయకుడు మా నాయకుడు అనుకునేలా ఉండాలి. అధికారంలో ఉన్న వ్యక్తులే మాకు నియమాలు వర్తించవు.. సామాన్యుడికి ఒక రూలు, అధికారంలో ఉన్న మాకు వేరే రూల్‌.. అనే సందేశం పంపేలా ఉండరాదు. ఇలాగైతే ఈ వ్యవస్థ బతకదు. అందుకే ఆక్కడ ప్రజావేదిక నుంచే మొట్టమొదటగా అక్రమ నిర్మాణాల కూల్చివేత మొదలు పెట్టాలని కలెక్టర్ల సదస్సు తొలిరోజే ఆదేశించాను.

ఆ రోడ్డులో ఉన్న అన్ని అక్రమ భవనాలను వెంటనే భాళీ చేయాలని, అలా చేయకపోతే వాటిని కూడా పడగొడతామని నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆదేశించగా వారు ఆ పని చేశారు. రాష్ట్ర స్థాయిలో దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని జిల్లాల్లో కూడా ఇదే విధంగా పని చేయాలని కలెక్టర్లందరికీ చెప్పాం. ఎక్కడైనా కూడా సామాన్యుడికి, అధికారంలో ఉన్న వారికి, పెద్ద వారికి, చిన్నవారికీ ఒకే రూల్‌ ఉండాలి. చట్ట విరుద్ధంగా ఎక్కడ నిర్మాణం చేపట్టినా కూల్చి వేయాల్సిందే. అలాంటి ఆదేశాలు ఇచ్చి ఈ చెడిపోయిన వ్యవస్థలో మార్పు చేయాలని ముందుకు అడుగులు వేస్తుంటే, దాన్ని కూడా వక్రీకరించి తప్పులు పట్టే ఇలాంటి రాజకీయ నాయకులు ఉన్నంత వరకు ఈ వ్యవస్థ ఎప్పటికీ బాగుపడదు అధ్యక్షా’ అని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.

బాబు తీరుతోనే విచ్చలవిడి అక్రమ నిర్మాణాలు 
అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఈ రకంగా అక్రమ నిర్మాణంలో ఉండడం, ఆయనే స్వయంగా వరద ప్రవాహాన్ని ఆపడం, వరద ప్రవాహం వచ్చినా సరే అది దారి మళ్లినా నేను మారను.. అనే వ్యవహార శైలి కలిగి ఉండడంతో ఆ రోడ్డు వెంబడి విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు పెరిగిపోయాయని సీఎం జగన్‌ ఎత్తిచూపారు. అక్రమాలకు సీఎం స్వయంగా ఆద్యుడైతే చట్టాలను ఎవరు ఖాతరు చేస్తారని నిలదీశారు. ‘ఎప్పుడైతే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నియమాలను బేఖాతరు చేస్తారో.. తనకు నియమాలు వర్తించవని అనుకుంటారో.. అప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికీ చులకన అవుతారు’ అని సీఎం అన్నారు. ముఖ్యమంత్రే స్వయంగా నిబంధనలు ఉల్లంఘించినప్పుడు, అవి తాము మాత్రం ఎందుకు పాటించాలనే భావన ప్రతి ఒక్కరిలో కలుగుతుందని చెప్పారు. ఇలా అక్రమ కట్టడాలు పెరగడానికి చంద్రబాబు అనుసరించిన వ్యవహార శైలే కారణమని ఎండగట్టారు. 

చంద్రబాబు మాటలన్నీ అసత్యాలే 
ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నారని, ఇది ఏమాత్రం సమంజసం కాదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అనుమతి లేని భవనాలకు కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఉందని ప్రతిపక్షనేత చంద్రబాబు అనడంతో ఈ మేరకు సీఎం కౌంటర్‌ ఇచ్చారు. చంద్రబాబు అసత్యాలతో సభను తప్పుదోవ పట్టిస్తున్నందునే తాను మళ్లీ కలుగజేసుకుని వివరణ ఇవ్వాల్సి వచ్చిందన్నారు. ‘క్లారిఫికేషన్‌ తర్వాత ఫుల్‌ స్టాప్‌ పెట్టాలి. అయితే ఇందుకు భిన్నంగా మళ్లీ అవకాశం ఇవ్వడం వల్ల ఇలా జరుగుతోంది. రాబోయే రోజుల్లో అయినా మార్పు వస్తుందని ఆశిస్తున్నాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌ ఉందని చంద్రబాబు అంతగా చెబుతున్నారు. ప్రజా వేదిక కూల్చకముందు చంద్రబాబు కోర్టుకు వెళ్లారు.

అర్ధరాత్రి తర్వాత హైకోర్టులో హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ వేశారు. నిజంగా ఏదో ఉపద్రవం జరుగుతోందేమోనని కోర్టు స్పందించి వాదనలు వినింది. అర్ధరాత్రి దాటాక 2.30 గంటలకు ప్రజావేదిక అక్రమ కట్టడమేనని, దీనిని కూల్చివేయవచ్చని హైకోర్టు తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు ఉంటే దానికి భిన్నంగా హైకోర్టు ఎందుకు తీర్పు ఇచ్చింది? కోర్టు ఉత్తర్వుల తర్వాతే ప్రభుత్వం ప్రజా వేదికను కూల్చింది. సుప్రీంకోర్టు తీర్పు కేవలం ప్రయివేటు స్థలాల్లో కట్టడాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి సంబంధించింది మాత్రమే. అయితే అది నీటి వనరులకు కూడా వర్తిస్తుందని అన్వయిస్తూ చంద్రబాబు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు’ అని సీఎం అన్నారు. ఇటీవల మహారాష్ట్రలోని ముంబయిలో భారీ వర్షాలు కురిసి వరదలొచ్చాయి. తమిళనాడులోనూ చాలాసార్లు వరదలొచ్చాయి.  మొన్న ముంబయిలో ఇళ్లలోకి వరద నీరు వచ్చి జనం ఏ రకంగా ఇబ్బంది పడ్డారో అందరం చూశాం. వరద సమయంలో ముంబయి నగరంలో మనిషి భుజం లోతు వరకూ నీరు నిలిచిపోయి ప్రజలు నానా అవస్థలు పడ్డారు. వరద నీరు వెళ్లే మార్గాలు లేనందునే భారీ వర్షాలకు నగరాలు విలవిల్లాడే పరిస్థితి వచ్చింది. 

మరిన్ని వార్తలు