అర్హులందరికీ ఇళ్ల స్థలాలు

27 Dec, 2019 05:13 IST|Sakshi

ఏ ఒక్కరికీ అన్యాయం జరగరాదు

త్వరగా స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తి కావాలి

ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం జగన్‌ ఆదేశం 

ఇప్పటి వరకు అర్హులైన వారు 22,46,139

సాక్షి, అమరావతి: ఇల్లులేని అర్హులైన ప్రతి ఒక్కరికీ నివాస స్థల పట్టా ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అర్హులై ఉండీ..లబ్ధిదారుల జాబితాలో పేరు లేదన్న మాట వినిపించరాదని స్పష్టం చేశారు. వచ్చే ఉగాది పర్వ దినం సందర్భంగా ఇల్లు లేని అర్హులందరికీ ఇంటి స్థల పట్టాలు ఇవ్వాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఇప్పటి వరకు జిల్లాల వారీగా తీసుకున్న చర్యలు, భవిష్యత్‌ కార్యాచరణపై గురువారం ఆయన సమీక్షించారు. నివాస స్థల పట్టాల పంపిణీకి జిల్లాల వారీగా గుర్తించిన అర్హుల సంఖ్య, అందుబాటులో ఉన్న భూమి, ఇంకా సేకరించాల్సిన భూమి గురించి ఆరా తీశారు.

విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇళ్ల స్థలాల కోసం అధికంగా భూములు సేకరించాల్సి ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.  స్థలాల గుర్తింపు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. లబ్ధిదారుల వారీగా ఇళ్ల స్థలాలు మార్కింగ్‌ చేసి పట్టాలను రిజి్రస్టేషన్‌ చేసి ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నివాస స్థల పట్టాలను ఏమాత్రం ట్యాంపరింగ్‌కు అవకాశం లేనివిధంగా అత్యంత ఉన్నత భద్రతా ప్రమాణాలతో రూపొందించాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి పలురకాల నమూనా పత్రాలను అధికారులు ముఖ్యమంత్రికి చూపించారు. ఈ సమీక్షలో రెవెన్యూ శాఖ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు