ఎగసిన జన తరంగం

6 Apr, 2019 12:37 IST|Sakshi


సాక్షి, చిత్తూరు/ కుప్పం: సీఎం నియోజకవర్గం కుప్పం జనసంద్రమైంది. వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సభకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు. షెడ్యూల్‌ ప్రకారం శుక్రవారం ఉదయం 10.30 గంటలకు బహిరంగ సభ. చెరువుకట్ట దగ్గర ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు జగన్‌మోహన్‌రెడ్డి చేరుకున్నారు. ఉదయం 7 గంటల నుంచే అభిమానులు, పార్టీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. చెరువు కట్ట నుంచి ఎమ్మార్‌ రెడ్డి సర్కిల్‌ వరకు కార్యకర్తలతో కుప్పం కిక్కిరిసిపోయింది. జగన్‌కు సభాస్థలికి చేరుకోడానికి దాదాపు 45 నిమిషాలు పట్టింది.
నవరత్నాలు.. మా జీవితాల్ని మారుస్తాయి

కుప్పంలో జరిగిన సభలో జగన్‌ నవరత్నాల గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. ఆలోచించండి మేలు జరుగుతుంది అంటూ కుప్పం ప్రజలకు నవరత్నాల గురించి వివరించారు. నవరత్నాలతో ప్రతి కుటుంబానికీ ఐదేళ్లలో రూ.5లక్షల వరకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. పిల్లల్ని బడికి పంపితే చాలు నేరుగా డబ్బు అకౌంట్లో పడుతుందని తెలిపారు. రైతులకు పెట్టుబడి సహాయం కింద ఏటా రూ.12,500 ఇస్తామని పేర్కొన్నారు. అవ్వాతాతలకు పింఛన్‌ రూ.3 వేల వరకు పెంచుకుంటూ పోతామన్నారు. 

ఆలోచింపజేసేలా ప్రసంగం..
సభ ముగించుకుని కడపకు వెళ్లిన తర్వాత కూడా జగన్‌ ప్రసంగంపై కుప్పం ప్రజలు చర్చించుకున్నారు. ‘ఆలోచించండి 30 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు. 14 సంవత్సరాలు సీఎంగా పనిచేశారు. కుప్పంకు ఒక్క మంచి పని అయినా చేశారా’ అనే ప్రశ్న వారిని కదిలించింది. ‘నిజమే కదా? ఒక్క మంచి పని కూడా చేయలేదు. ఇన్నాళ్లూ నెత్తిన పెట్టుకున్నాం. ఈసారి మంచి చేసే వారికే మా ఓటు’ అనుకుంటూ వెళ్లడం కనిపించింది. కుప్పంలో జగన్‌ సభ టీడీపీకి మరణశాసనమే అని వి«శ్లేషకులు అంటున్నారు.

వెళ్లకండి.. రూ.200 తీసుకోండి..
వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సభకు వెళ్లకుండా రెండు మూడు రోజుల నుంచే టీడీపీ నాయకులు పథకాలు పన్నుతున్నారు. పురుషులకు మందు, విందు ఏర్పాటు చేశారు. మహిళలకు పసుపు–కుంకుమ కింద రూ.200 పంపిణీ చేయాలని చూశారు. ప్రజలు వాటినేమీ పట్టించుకోకుండా జగన్‌ సభకు వచ్చారు. గుడిపల్లి, శాంతిపురం, రామకుప్పం మండలాల్లో సభకు రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కేసులు పెడతామని బెదిరించినా సభకు తరలివచ్చారు.

గెలుపుపై సందేహమే..
జగన్‌కు వచ్చిన ఆదరణ చూసి కుప్పం టీడీపీ నాయకుల్లో గుబులు మొదలైంది. చంద్రబాబునాయుడుకు కూడా ఇంతలా జనాలు రాలేదని టీడీపీ నాయకులే ఒప్పుకుంటున్నారు. దీనికి తోడు జగన్‌మోహన్‌రెడ్డి కుప్పానికి దివంగత సీఎం రాజశేఖరరెడ్డి చేసిన అభివృద్ధి పనులను గుర్తు చేయడంతో టీడీపీ నాయకులు ఉలిక్కిపడ్డారు. వన్నెకుల క్షత్రియులు మొత్తం చంద్రమౌళి వెంటే ఉన్నారని, వారి ఓట్లు ఈసారి టీడీపీకి ఒక్కటి కూడా పడవని తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు.

గెలుస్తామా? గెలవమా?
జగన్‌ సభ గ్రాండ్‌ సక్సెస్‌తో సీఎం ఇప్పటికే పలుసార్లు కుప్పం నాయకులతో మాట్లాడారు. సీఎం సతీమణి భువనవేశ్వరి వీడియో కాన్ఫరెన్స్‌లో టీడీపీ నాయకులతో మాట్లాడారు. ఇంటెలిజెన్స్‌తో రిపోర్టులు తెప్పించుకున్నారు. జగన్‌ సభకు దాదాపు 25 వేల మంది హాజరయ్యారని ఇంటెలిజెన్స్‌ వారు సీఎంకు తెలిపారు. వారిపై సీఎం చంద్రబాబు సీరియస్‌ అయ్యారు. ఇంత వ్యతిరేకత ఉందని ముందే ఎందుకు చెప్పలేదని చిందులేశారు. ఏం చేస్తే గెలుస్తామో చెప్పాలంటూ హుకూం జారీ చేశారు.  

మరిన్ని వార్తలు