నిధుల వినియోగంలో జాగ్రత్త వహించాలి : వైఎస్‌ జగన్‌

28 Oct, 2019 15:08 IST|Sakshi

జలవనరుల శాఖ అధికారులతో సీఎం సమీక్షా సమావేశం

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  జలవనరులశాఖ ఉన్నతాధికారులతో సోమవారం సచివాలయంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ పోలవరం, వెలిగొండ, వంశధార సహా కొత్త ప్రతిపాదిత ప్రాజెక్టులపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. నిధుల వినియోగంలో జాగ్రత్త వహించాలని, ప్రాధాన్యత పరంగా ఖర్చు చేయాలని సీఎం పేర్కొన్నారు.కృష్ణా, గోదావరి, పెన్నా బేసిన్లలో రిజర్వాయర్ల నీటిమట్టాలు, ప్రస్తుత పరిస్థితిపై అధికారులు సీఎంకు వివరించారు. అంతేగాక జిల్లాల వారిగా జరుగుతున్న ప్రాజెక్టుల వివరాలను నివేదిక రూపంలో తయారు చేసి ముఖ్యమంత్రికి అందజేశారు.

కొంతకాలంగా కురుస్తున్న వర్షాలకు భారీగా వరదలు వచ్చినా కొన్ని ప్రాజెక్టులు ఎందుకు నింపలేదంటూ అధికారులను ఆరా తీశారు.  వచ్చే 40 రోజుల్లో వరద జలాలతో అన్ని ప్రాజెక్టులు నిండేలా కార్యచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కాల్వల సామర్థ్యం , పెండింగ్‌లో ఉన్న పనులపై అధికారుల నుంచి సమాచారాన్ని కోరారు. అలాగే ప్రస్తుతం కొత్తగా చేపట్టాల్సిన ప్రాజెక్టులకు సంబంధించి అంచనాలను ప్రాధాన్యత క్రమంలో విభజించి నివేదిక రూపంలో అందజేయాలని వెల్లడించారు.

భూసేకరణ, అటవీ అనుమతుల సమస్యల కారణంగా జలయజ్ఞం పనులు చాలా వరకు పెండింగ్‌లో ఉన్నాయని, వీటికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్‌ సానుకూలంగా స్పందిస్తూ.. ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళ్తూ చేసే పనికి మంచి ఫలితం వచ్చేలా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

మరిన్ని వార్తలు