కడప ఉక్కు కల సాకారం

23 Dec, 2019 03:43 IST|Sakshi
వైఎస్సార్‌ జిల్లా సున్నపురాళ్లపల్లి వద్ద సిద్ధమైన శిలాఫలకం

నేడు శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మందికి ఉపాధి 

30 లక్షల టన్నుల వార్షిక సామర్థ్యంతో ఏర్పాటు

రూ.15 వేల కోట్ల పెట్టుబడి అంచనా  

ఇప్పటికే కర్మాగారానికి ముడి ఇనుము, నీటి కేటాయింపులు

వైఎస్సార్‌ జిల్లాలో ముఖ్యమంత్రి మూడు రోజుల పర్యటన..

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి కడప: రాయలసీమ ప్రజల దశాబ్ధాల కల నేడు సాకారం కానుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మందికి ఉపాధి కల్పించాలన్న దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్టు అయిన కడప ఉక్కు కర్మాగారానికి సోమవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. రూ.15 వేల కోట్ల పెట్టుబడి అంచనాతో ఏడాదికి 30 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్న ఈ కర్మాగారానికి వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి, పెదనందలూరు గ్రామాల్లో 3,275.66 ఎకరాలను కేటాయించారు. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు వడివడిగా అడుగులు వేశారు.

ఇందుకోసం రూ.10 లక్షల మూల ధనంతో ఏపీ హైగ్రేడ్‌ స్టీల్స్‌ లిమిటెడ్‌ పేరిట ఒక ప్రత్యేక కంపెనీ ఏర్పాటు చేశారు. విభజన హామీ చట్టం ప్రకారం వైఎస్సార్‌ జిల్లాలో ఏర్పాటు చేయాల్సిన ఉక్కు కర్మాగారానికి సంబంధించి కేంద్రంతో పలుదఫాలు చర్చించి కీలకమైన ముడి ఇనుము సరఫరా కోసం ఎన్‌ఎండీసీతో డిసెంబర్‌ 18న ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ యూనిట్‌ ఏర్పాటుకు ప్రస్తుతం 4.8 మిలియన్‌ టన్నుల ముడి ఇనుము అవసరం కాగా, ఎన్‌ఎండీసీ 5 మిలియన్‌ టన్నులు సరఫరా చేయడానికి అంగీకరించింది. గండికోట రిజర్వాయర్‌ నుంచి 2 టీఎంసీల నీటిని సరఫరా చేయనున్నారు.

ఈ యూనిట్‌కు కేటాయించిన స్థలం నుంచే కడప–నంద్యాల రైల్వే ట్రాక్‌ ఉండటంతో పాటు ఏడు కిలోమీటర్ల దూరంలోనే 400 కేవీ సబ్‌స్టేషన్‌ కూడా ఉంది. ఇలా కీలకమైన అన్ని వనరులు సమకూరిన తర్వాతే శంకుస్థాపన చేస్తుండటం.. ఈ ప్రాజెక్టుపై సీఎంకు ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోంది. ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో ఈ కర్మాగారానికి రూ.250 కోట్లు కేటాయించగా అందులో ఇప్పటికే రూ.62 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ యూనిట్‌కు శంకుస్థాపన చేసిన మూడేళ్లలో ఉత్పత్తి ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.
 
కేంద్రం నుంచి రాయితీల డిమాండ్‌

ఈ యూనిట్‌ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలకు అదనంగా కేంద్రం నుంచి కూడా పలు రాయితీలను కోరుతోంది. ఉత్పత్తి ప్రారంభించినప్పటి నుంచి తొలి ఏడేళ్లు ఐజీఎస్టీ మినహాయింపు, పదేళ్ల పాటు ఆదాయపు పన్ను మినహాయింపు, దిగుమతి చేసుకునే ముడి సరుకులపై సుంకాల మినహాయింపులను కోరుతోంది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లపాటు యూనిట్‌ విద్యుత్‌ రూపాయికే ఇవ్వనుంది. స్టాంప్‌ డ్యూటీ, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ, భూమి కొనుగోలు లేదా లీజు ఫీజుపై 100 శాతం మినహాయింపు, ఏడేళ్లపాటు ఎస్‌జీఎస్టీ వంటి అనేక రాయితీలను ఆఫర్‌ చేస్తోంది.

కడపలో అభివృద్ధి పరుగులు  
వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఆరు నెలల్లోనే వైఎస్సార్‌ జిల్లాలో రూ.వేల కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం పట్ల జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కడప, పులివెందుల, జమ్మలమడుగు, మైదుకూరు, రాయచోటి నియోజకవర్గాల్లో పలు నీటి పారుదల ప్రాజెక్టులతోపాటు వైద్యశాలలు, రోడ్లు, డ్రైనేజీలు, గ్రామ సచివాలయ భవనాలతోపాటు పలు అభివృద్ధి పనులు ప్రారంభిస్తుండటంతో జిల్లా దశ తిరిగినట్లేనని అన్ని వర్గాల ప్రజలు భావిస్తున్నారు. ఉక్కు ఫ్యాక్టరీ వల్ల స్థానికంగా వేలాది మంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలగనుంది.
 
సీఎం శంకుస్థాపనలు, ప్రారంబోఉత్సవాలు ఇలా..
►23వ తేదీ ఉదయం 10 గంటలకు జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె వద్ద ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన. అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.  
►కుందూనదిపై కుందూ – తెలుగుగంగ ఎత్తిపోతల పథకానికి, కర్నూలు – వైఎస్సార్‌ జిల్లాల సరిహద్దులో నిరి్మస్తున్న రాజోలి ఆనకట్ట నిర్మాణానికి, కర్నూలు జిల్లా కోయిలకుంట్ల మండలం జోలదరాశి వద్ద నిర్మించనున్న ఆనకట్టకు సంబంధించి దువ్వూరు మండలం నేలటూరు వద్ద శంకుస్థాపన శిలాఫలకాలు ఆవిష్కరిస్తారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.  
►సాయంత్రం కడపలో రిమ్స్‌ పరిధిలో రూ.107 కోట్లతో ఏర్పాటు చేయనున్న క్యాన్సర్‌ ఆస్పత్రి, రీసెర్చ్‌ సెంటర్,  రూ.175 కోట్లతో  నిర్మించే సూపర్‌ స్పెషాలిటీ విభాగం, రూ.40.80 కోట్లతో నిర్మించే మానసిక చికిత్సాలయం, ఎల్వీ ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌లకు శంకుస్థాపన చేస్తారు. ఇదే సందర్భంలో కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి సొంత నిధులతో నిరి్మంచిన ఉచిత అన్నదాన, వసతి భవనాన్ని ప్రారంభిస్తారు.  
►రూ.20 కోట్లతో కడపలో నిరి్మంచనున్న డి్రస్టిక్ట్‌ పోలీసు కార్యాలయ భవనాలకు శంకుస్థాపన.
►కడప – రాయచోటి రోడ్డులో రూ.82.73 కోట్లతో నిరి్మంచిన రైల్వే ఓవర్‌ బ్రిడ్జిని ప్రారంభిస్తారు.     
►24వ తేదీ రాయచోటి ప్రాంతంలో రూ.1,272 కోట్లతో ఎత్తిపోతల ద్వారా జీఎన్‌ఎస్‌ఎస్‌ (గాలేరు నగరి సుజల స్రవంతి) – హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌  (హంద్రీ నీవా సుజల స్రవంతి) అనుసంధాన పథకానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం రాయచోటి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. రాయచోటి జూనియర్‌ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.   
►25వ తేదీ పులివెందులలో రూ.347 కోట్లతో నిరి్మంచనున్న మెడికల్‌ కళాశాల, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. రూ.17.50 కోట్లతో నిరి్మంచిన స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను ప్రారంభిస్తారు.   

మరిన్ని వార్తలు