సంక్రాంతి సంబరాల్లో సీఎం జగన్‌  

15 Jan, 2020 04:22 IST|Sakshi
సంక్రాంతి సంబరాల్లో భాగంగా మంగళవారం కృష్ణా జిల్లా గుడివాడ మండలం లింగవరంలో జాతీయ స్థాయి ఎడ్ల బండ లాగుడు పోటీలను ప్రారంభిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో మంత్రి కొడాలి నాని, ఎంపీ బాలశౌరి తదితరులు

జాతీయ స్థాయి ఎడ్ల బండ లాగుడు పోటీలను ప్రారంభించిన వైఎస్‌ జగన్‌  

అందరితో ఆప్యాయంగా పలకరింపు.. 

మహిళల కోలాటం.. గంగిరెద్దుల విన్యాసం.. చిన్నారులకు భోగిపళ్లు.. 

మురిసిన పల్లెలు.. జైకొట్టిన అభిమానులు.. దారిపొడవునా ఘన స్వాగతం 

సాక్షి, మచిలీపట్నం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృష్ణా జిల్లా గుడివాడ మండలంలో మంగళవారం సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. పలు పోటీలను ప్రారంభించి తిలకించారు. ముఖ్యమంత్రి తమ మధ్య పండుగ సంబరాల్లో పాల్గొనడం స్థానికులను ఆనందోత్సాహంలో ముంచెత్తింది. పార్టీ నేతలు, కార్యకర్తలు, చట్టుపక్కల ఊళ్ల నుంచి వచ్చిన ప్రజలు మురిసిపోయారు. తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరిన సీఎం మధ్యాహ్నం గుడివాడ ఎన్టీఆర్‌ స్టేడియం చేరుకున్నారు. అక్కడ మంత్రులు కొడాలి వెంకటేశ్వరరావు (నాని), పేర్ని వెంకట్రామయ్య (నాని), వెలంపల్లి శ్రీనివాసరావు, బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరిలు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నెహ్రూ చౌక్, ఏలూరు రోడ్, నాగవరప్పాడు మీదుగా గుడివాడ మండలం లింగవరం గ్రామంలోని కె.కన్వెన్షన్‌ గ్రౌండ్‌కు చేరుకున్నారు. దారిపొడవునా వేలాది మంది మహిళలు, యువకులు బారులు తీరి వైఎస్‌ జగన్‌కు స్వాగతం పలికారు.   


సంక్రాంతి స్టాల్స్‌ను తిలకించిన వైఎస్‌ జగన్‌  
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తొలుత వేదపండితులు వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వచనం పలికారు. అనంతరం ఆయన సంక్రాంతిని ప్రతిబింబించేలా గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను, బొమ్మల కొలువు, సంప్రదాయ వంటల తయారీ తీరును తిలకించారు. చిన్నారులకు భోగిపళ్లు పోశారు. మహిళల కోలాటాలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలను ఆస్వాదించారు. భోగిమంటల వద్ద కొద్దిసేపు నిల్చొన్నారు. పండితులు పండుగ విశిష్టతను ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు పోటీలను ప్రారంభించి, కొద్దిసేపు తిలకించారు. పుంగనూరు జాతి గిత్తలను పరిశీలించారు. అనంతరం పొట్టేలు పోటీలను తిలకించారు.  
కృష్ణా జిల్లా గుడివాడ మండలం లింగవరం గ్రామంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో వల్లభనేని వంశీ, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, కొక్కిలిగడ్డ రక్షణనిధి, కైలే అనిల్‌కుమార్, దూలం నాగేశ్వరరావు, పేర్ని నాని, కొడాలి నాని, బాలశౌరి, వెలంపల్లి శ్రీనివాస్, ఏఎండీ ఇంతియాజ్‌ (ఎడమ నుంచి కుడికి) 

హోరెత్తిన జగన్నినాదాలు 

రాష్ట్రం నలుమూలల నుంచి ఈ పోటీలను తిలకించేందుకు వచ్చిన వేలాది మంది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాకతో కేరింతలు కొట్టారు. గౌండ్‌కు ఇరువైపులా గ్యాలరీలో కూర్చున్న ప్రజలకు సీఎం అభివాదం చేయడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. జై జగన్‌.. జైజై జగన్‌.. సీఎం.. సీఎం అంటూ నినాదాలతో హోరెత్తించారు. అందరికీ విద్య ‘అమ్మ ఒడి’తో సాధ్యం, మన బడి నాడు – నేడు.. తదితర నవరత్నాలను ప్రతిబింబించే ప్లకార్డులను గ్రౌండ్‌కు ఇరువైపులా కూర్చున్న ప్రజలు చేతబట్టి సీఎం జిందాబాద్‌.. అంటూ నినాదాలు చేశారు. వేదికపై కూర్చున్న ప్రతి ఒక్కరినీ పేరు పేరునా పలుకరించారు. వేదికపై కూర్చున్న వారితో ఫొటోలు దిగారు. ఎడ్ల బండ లాగుడు పోటీల నిర్వాహకులతో మాట్లాడారు. హెలిప్యాడ్, లింగవరం వద్ద ప్రజల వినతి పత్రాలను స్వీకరించారు. 
గంగిరెద్దుల విన్యాసాలను తిలకిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

గ్రామీణ సంప్రదాయాన్ని గౌరవిస్తూ.. 
గ్రామీణ సంప్రదాయాలను గౌరవిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్రాంతి çసంబరాల్లో పాల్గొన్నారని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా కృష్ణా జిల్లా గుడివాడలో తొలిసారి కాలుపెట్టిన వైఎస్‌ జగన్‌కు జిల్లా వాసులు ఘన స్వాగతం పలికారన్నారు. గత ఐదేళ్లుగా బందరు పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని, ఇకపై అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. ఈ ఏడాది అన్ని విధాలా అన్నదాతలకు కలిసి వచ్చిందన్నారు. వైఎస్సార్‌ రైతు భరోసా, గిట్టుబాటు ధర కల్పన, ధరల స్థిరీకరణ వంటి పథకాలతో వ్యవసాయం పండుగలా మారిందని చెప్పారు. ఈ నేపథ్యంలో సీఎం తమ మధ్య పండుగ జరుపుకోవడంతో అన్నదాతలు ఉప్పొంగిపోయారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, వైఎస్సార్‌ సీపీ నేతలు పాల్గొన్నారు.
గుడివాడ మండలం లింగవరంలో ఎడ్ల బండ లాగుడు పోటీలను ఆసక్తిగా తిలకిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా