రైతులకు ఆపన్నహస్తం

11 Jul, 2019 07:05 IST|Sakshi

సాక్షి, తిరుపతి : వాతావరణ ప్రతికూల పరిస్థితులు.. గత పాలకుల నిరాదరణకు గురై అప్పులతో ఉక్కిరిబిక్కిరైన అన్నదాతలు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆ కుటుంబాలను టీడీపీ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. గత ఐదేళ్లలో ఆత్మహత్య చేసుకున్న బాధిత కుటుంబాలు దీనస్థితిలో ఉన్నాయి. అటువంటి కుటుంబాల పరిస్థితి తెలుసుకున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మానవీయకోణంలో ఆలోచించి వారిని ఆదుకోవాలని నిర్ణయించారు. గత పాలకుల నిరాదరణకు గురైన బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలని జిల్లా కలెక్టర్‌కు వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల వివరాలు పంపమని కలెక్టర్‌ నారాయణ భరత్‌ గుప్త వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. 

వ్యవ‘సాయం’ మరిచారు
జిల్లాలో గత ఐదేళ్ల కాలంలో టీడీపీ ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని విస్మరించింది. సకాలంలో విత్తనాలు పంపిణీ చేసిన దాఖలాలు లేవు.  రైతులు అప్పులు చేసి ప్రైవేటు వ్యాపారుల వద్ద విత్తనాలు కొనుగోలు చేశారు. పంట సాగు చేశాక వాతావరణం కరుణించకపోవడంతో బోర్లు వేసి తీవ్రంగా నష్టపోయిన వారు ఉన్నారు. చాలీ చాలని నీటితో పంట చేతికొచ్చి నా... గిట్టుబాటు ధరలు లేవు.  అన్నదాతలు పెట్టిన పెట్టుబడికి వడ్డీలు చెల్లించలేని దుస్థితి. ఆదుకోవాల్సిన టీడీపీ ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా సుమారు 26మంది రైతులు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా పుంగనూరు పరిధిలో మరో రైతు ఆత్మహత్య బలవన్మరణానికి పాల్పడ్డాడు

కరుణించని టీడీపీ ప్రభుత్వం
రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా టీడీపీ ప్రభుత్వం కరుణించలేదు. జిల్లాలో మొత్తం 26 మంది మరణిస్తే కేవలం 12 మందికి మాత్రమే పరిహారం అందించి చేతులు దులుపుకుంది. అందులోనూ ఒక్కొక్కరికి ఒక్కో రకంగా పరిహారం అందజేశారు. మిగిలిన 14 మంది రైతు కుటుంబాలకు పరిహారం విషయంలో మొండిచెయ్యి చూపారు. తంబళ్లపల్లి నియోజకవర్గ పరిధిలోనే ఏడుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో టి.నారాయణరెడ్డి, వి.కృష్ణప్ప, ఎం.పెద్దరెడ్డెప్ప, ఎన్‌.మోహన్‌రెడ్డి, జి.ఆనందరెడ్డి, వి.మల్లప్పనాయుడు, జి.గంగులప్ప ఉన్నారు.

వీరిలో ముగ్గురికి మాత్రమే పరిహారం అందింది. వరదయ్యపాళెం మండలం యానాదివెట్టు దళితవాడకు చెందిన కౌలు రైతు దొడ్డి వెంకటయ్య ఎనిమిది నెలల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇంతవరకు పరిహారం చెల్లించకపోగా.. ఇతని ఆత్మహత్యకు సంబంధించిన వివరాలు నమోదు కాలేదని కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. కేవీబీపురం మండలం కోవనూరుకు చెందిన కౌలు రైతు రామయ్య అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఇంతవరకు పరిహారం అందలేదు.

రామసముద్రం మండలం రాగిమాకులపల్లె కొత్తూరు, పూరాండ్లపల్లె గ్రామానికి చెందిన హరి, రామ్మోహన్‌ ఆత్మహత్య చేసుకున్నారు. వీరిద్దరి కుటుంబాలకు పరిహారం విషయంలో మొండిచెయ్యే ఎదురైంది. చౌడేపల్లి మండలం కాటిపేరికి చెందిన రైతు ఎస్‌.అగస్తి రెడ్డి రూ.13 లక్షల అప్పులు తీర్చులేక 8 నెలల క్రితం ఉరివేసుకుని చనిపోయాడు. ఆయన కుటుంబానికి పరిహారం అందలేదు. ఇదే తరహాలో మిగిలిన బాధితులకు కూడా గత ప్రభుత్వం పరిహారం ఇవ్వలేదు.

మరిన్ని వార్తలు