-

ఢిల్లీ సదస్సుకు వెళ్లిన వారిని గుర్తించండి

2 Apr, 2020 04:34 IST|Sakshi

కోవిడ్‌–19 నియంత్రణపై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం జగన్‌ 

గ్రామ, వార్డు వలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్ల సర్వే రోజూ కొనసాగాలి 

మూడో దశలో ర్యాండమ్‌గా శాంపిల్స్‌.. వైరస్‌ విస్తరణ స్థాయి నిర్ధారణ 

క్వారంటైన్‌. ఐసొలేషన్‌ వార్డుల వద్ద శానిటేషన్‌ బాగుండాలి 

రేషన్‌ దుకాణాల వద్ద బారులు తీరే పరిస్థితి ఉండకూడదు 

సాక్షి, అమరావతి: ఢిల్లీలో సదస్సుకు వెళ్లిన వారిని, వారితో కలిసి ప్రయాణం చేసిన వారిని, వారి కుటుంబ సభ్యులను, వారితో సన్నిహితంగా ఉన్న వారిని పూర్తిగా గుర్తించాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. వారందరినీ క్వారంటైన్, ఐసోలేషన్‌కు తరలించి పూర్తిగా పరీక్షలు చేయాలని సూచించారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ నివారణ చర్యలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గ్రామ, వార్డు వలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లతో రోజూ సర్వే చేయించాలన్నారు. వ్యాధి లక్షణాలు ఉన్న వారిని గుర్తించి.. క్వారంటైన్‌ లేదా ఐసోలేషన్‌కు తరలించి పరీక్షలు చేయించాలని స్పష్టం చేశారు. మూడో దశలో ర్యాండమ్‌గా శాంపిల్స్‌ తీసుకుని పరీక్షలు చేసి.. రాష్ట్రంలో వైరస్‌ విస్తరణ స్థాయిని నిర్ధారించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అనూహ్యంగా పెరిగిన కేసులు, కారణాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. నమోదైన కేసులన్నింటిలో అత్యధికంగా ఢిల్లీలో తబ్లీగి జమాత్‌ సదస్సుకు హాజరైన వారు, వారి కుటుంబ సభ్యులు, వారి సన్నిహితులకు సంబంధించినవేనని చెప్పారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. ఈ దశలో మరింత కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ అమలు చేయడంతో పాటు, వారందరినీ గుర్తించే ప్రక్రియ వేగంగా సాగాలన్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
  
క్వారంటైన్‌ నిర్వహణపై రోజూ నివేదిక 
► క్వారంటైన్, ఐసోలేషన్‌ వద్ద శానిటేషన్, వసతులు, నిర్వహణ బాగుండాలి. బెడ్ల మధ్య దూరం, మరుగుదొడ్లు ఎలా ఉండాలి, ఎలాంటి ప్రమాణాలు పాటించాలన్న దానిపై స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌ ఉండాలి. దీనిపై ప్రతిరోజూ తప్పనిసరిగా నివేదికలు రావాలి.  
► ఇంట్లో ఉండటం కన్నా.. క్వారంటైన్, ఐసోలేషన్‌లో ఉండటమే బాగుందనే భావన రావాలి. పర్సనల్‌ ప్రొటెక్షన్‌ సూట్లు, మాస్క్‌లు ఏ మేరకు అవసరమో నిర్ధారించండి. ఆ మేరకు కింది స్థాయిలో సిబ్బందికి కచ్చితంగా పంపిణీ చేయాలి. 
► రేషన్‌ దుకాణాల వద్ద ప్రజలు బారులు తీరే పరిస్థితి ఉండకూడదు. పౌర సరఫరాల దుకాణాల సంఖ్యను పెంచాలి. ప్రతి దుకాణం వద్ద భౌతిక దూరం పాటించేలా మార్కింగ్స్‌ ఉండాలి. నిత్యావసర వస్తువుల ధరల పట్టిక బాగా కనిపించేలా డిస్‌ప్లే బోర్డులు ఉండాలి.  
► భౌతిక దూరం పాటిస్తూ.. వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలు కొనసాగించాలి.  
► ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం ఆళ్లనాని, మంత్రులు బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు