‘బెస్ట్‌ పెర్‌ఫార్మింగ్‌ సీఎం’ వైఎస్‌ జగన్‌

25 Jan, 2020 04:11 IST|Sakshi

అతి తక్కువ సమయంలో అద్భుత పాలనతో ప్రజల మనసు చూరగొన్న వైనం

ఇండియా టుడే పోల్‌ సర్వేలో నాలుగో స్థానంలో నిలిచిన ముఖ్యమంత్రి

మూడ్‌ ఆఫ్‌ ద నేషన్‌ పేరిట సర్వే

మొదటి స్థానంలో యూపీ సీఎం యోగి

రెండో స్థానంలో కేజ్రీవాల్, మమత, మూడో స్థానంలో నితీష్‌

నవీన్‌పట్నాయక్, అశోక్‌ గెహ్లోత్‌లకు జగన్‌ తర్వాతి స్థానాలు

సాక్షి, అమరావతి: దేశంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన అతికొద్ది మంది ముఖ్యమంత్రుల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందు వరుసలో నిలిచారు. అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే అనేక ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన సీఎంగా ఖ్యాతి గడించారు. ప్రముఖ వార్తా సంస్థ ఇండియా టుడే మూడ్‌ ఆఫ్‌ ద నేషన్‌ పేరిట జాతీయ స్థాయిలో ఈ నెలలో నిర్వహించిన పోల్‌ సర్వేలో వైఎస్‌ జగన్‌  ‘బెస్ట్‌ పెర్‌ఫార్మింగ్‌ సీఎం’ల జాబితాలో నాలుగో స్థానాన్ని సాధించారు. మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ దాస్‌ (బీజేపీ), రెండో స్థానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (ఏఏపీ), పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ (తృణమూల్‌ కాంగ్రెస్‌), మూడో స్థానంలో బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ నిలిచారు. 

అనతి కాలంలో అనేక పథకాలు 
జాతీయ స్థాయిలో నాలుగో స్థానంలో నిలిచిన వైఎస్‌ జగన్‌ పరిపాలనా తీరుకు పలువురు మద్దతు ప్రకటించారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన మేనిఫెస్టోలోని అంశాలను ఆరు నెలల్లోనే నెరవేర్చేలా అనేక పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అమ్మఒడి, నాడు–నేడు, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం, వైఎస్సార్‌ రైతు భరోసా, జగనన్న విద్యా దీవెన (పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌), జగనన్న వసతి దీవెన (హాస్టల్‌ ఖర్చులకు ఏటా రూ.20 వేలు), ఆరోగ్యశ్రీ, తదితర అనేక పథకాలతో పాటు ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. 

అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఇన్ని పథకాలు, కార్యక్రమాలను అమలు చేసిన సీఎం ఒక్క వైఎస్‌ జగన్‌ తప్ప దేశంలో మరొకరు కనిపించరు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తర్వాత బెస్ట్‌ పెర్‌ఫార్మింగ్‌ సీఎంల జాబితాలో అయిదో స్థానంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాక్రే, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్, ఆరో స్థానంలో గుజరాత్‌ సీఎం విజయ్‌రూపాని, ఏడో స్థానంలో రాజస్తాన్‌ సీఎం అశోక్‌ గెహ్లోత్, హరియాణా సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌లు నిలిచారు. ఈ ‘బెస్ట్‌ పెర్‌ఫార్మింగ్‌ సీఎం’ సర్వేలో 2016 నుంచి ఉన్న ట్రెండ్స్‌ కూడా పొందుపరిచారు. యోగి ఆదిత్యనాథ్‌ దాస్‌కు సంబంధించి 2017 ఆగస్టు నుంచి, అరవింద్‌ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, నితీష్‌కుమార్, నవీన్‌ పట్నాయక్‌లకు సంబంధించి 2016 ఫిబ్రవరి నుంచి వారి పెర్‌ఫార్మెన్స్‌ను 
చూపించారు. 

మరిన్ని వార్తలు