అడుగడుగో.. అన్నొస్తున్నాడు..

7 Nov, 2017 10:29 IST|Sakshi

అమ్మ ఆశీర్వాదం, చెల్లి ఆదరాభిమానాలు

తండ్రి సమాధి వద్ద ప్రార్థనలు

 జగన్‌ ప్రజా సంకల్ప యాత్రకు అడుగడుగునా నీరా‘జనం’

 కిలోమీటర్ల పొడవునా ఎటుచూసినా జనమే

 ఇడుపులపాయలో ఇసుకేస్తే రాలనంతగా..

 సెల్ఫీల కోసం పోటీపడ్డ యువత

ఇడుపులపాయ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్రలో తొలి అడుగుపడింది. సోమవారం ఉదయం వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రజల జయజయధ్వానాల మధ్య ప్రారంభమైంది. రావాలి జగన్‌.. కావాలి జగన్‌.. వైఎస్సార్‌ సీపీ జిందాబాద్‌.. కాబోయే ముఖ్యమంత్రి జగన్‌.. అనే ప్రజా నినాదాల మధ్య వైఎస్‌ జగన్‌ తన మూడువేల కిలోమీటర్ల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. భగవంతుడి ఆశీర్వాదాలు, తండ్రి వైఎస్సార్‌ దీవెనలు, మాతృమూర్తి విజయమ్మ ఆశీస్సులు, చెల్లి షర్మిలమ్మ ఆదరాభిమానాలు, అభిమానులు, పార్టీ కార్యకర్తల అభినందనల మధ్య పాదయాత్ర మొదలైంది. ప్రజా సమస్యలు తెలుసుకుని వారితో మమేకమయ్యేందుకు జగన్‌ ముందుకు కదిలారు. తొలిరోజు 8.9 కిలోమీటర్ల మేరకు ప్రజా సంకల్ప యాత్ర సాగింది. దారివెంట అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జగన్‌తో కలిసి వేలాది మంది నడిచారు.

అడుగడుగునా సెల్ఫీలు
వేదిక దిగిన జగన్‌ 15 మీటర్లు నడిచేందుకు 22 నిమిషాల సమయం పట్టింది. దారికిరువైపులా నిలిచిన ప్రజలు ప్రత్యేకించి యువతరం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో కరచాలనాలు, సెల్ఫీల కోసం పెద్దఎత్తున పోటీపడ్డారు. అడుగు తీసి అడుగేయడానికే వీల్లేకుండా సెల్ఫీలు తీసుకున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. ఒక దశలో తోపులాట సైతం జరిగింది. ముందుకొస్తున్న జనాన్ని అదుపు చేయడం భద్రతా సిబ్బందికి సైతం అలివిమాలిన పనయింది. ఇడుపులపాయ మొదలు ఎగువన ఉన్న వీరన్నగట్టు వరకూ దారిపొడవునా ఎటుచూసినా జనమే జనం. దూరం నుంచి చూసే వారికి చీమలవరుసలా బారులు తీరిన జనప్రభంజనమే కనిపించింది. రెండు కిలోమీటర్ల నడకకు సుమారు రెండున్నర గంటల సమయం పట్టిందంటే పరిస్థితిని ఊహించవచ్చు.

హారతి పట్టి.. తిలకం దిద్ది..
మారుతీనగర్‌లో మహిళలు మంగళహారతులు పట్టి.. కుంకుమ తిలకాలు దిద్దారు. భోజనానంతరం మారుతీనగర్‌ నుంచి వీరన్నగట్టుపల్లి చేరుకున్నప్పుడు గ్రామీణ నిరుపేద మహిళలు స్వచ్ఛందంగా రోడ్డు మీదకు వచ్చి ఆశీర్వాదాలు అందించారు. ’అయ్యా.. ఈసారి నువ్వే ముఖ్యమంత్రివి కావాలయ్యా.. పాలనలో మీ నాన్నను మరిపించాలయ్యా..’ అంటూ బడుగు బలహీన వర్గాల మహిళలు తిలకాలు దిద్ది ఆశీర్వదించారు. సెల్ఫీలు దిగారు. కుమురంపల్లి, వేంపల్లిలోనూ మహిళలు జగన్‌కు ఎదురేగి స్వాగతం పలికారు. ఆయనతో పాటు కలిసి ముందుకుసాగారు. కాగా దూరప్రాంతాల నుంచి తరలివచ్చిన అశేష ప్రజానీకానికి వైఎస్సార్‌ స్మృతి వనంలో కల్పించిన భోజన వసతి పలువురి మన్నల్ని, ప్రశంసల్ని పొందింది. వచ్చిన వారందర్నీ భోజనం చేసి వెళ్లాలని నిర్వాహకులు పదేపదే విజ్ఞప్తి చేశారు. అక్కడే కాకుండా మారుతీనగర్, వేంపల్లె వద్ద కూడా భోజన వసతి కల్పించడం విశేషం.

వరుణుడి ఆశీర్వాదం.. కదం తొక్కిన జనం
జగన్‌ పాదయాత్రకు అటు జనం నుంచే కాక ఇటు ప్రకృతి నుంచీ ఆశీస్సులందాయి. తెల్లవారుజాము నుంచే ప్రారంభమైన వర్షాన్ని సైతం లెక్కచేయక జనం ప్రభంజనంలా తరలివచ్చారు. పాదయాత్రకు ముందు కొద్దిసేపు వరకూ పడిన వర్షం ఆ తర్వాత యాత్ర కోసమే అన్నట్టు ఆగింది. యాత్ర ప్రారంభమై మూడు గంటలు సాగాక మళ్లీ వరుణుడు పలకరించి ఆశీర్వదించాడు. అయినప్పటికీ ప్రజలు కొండ రాళ్ల కింద, చెట్ల వద్ద ఆగి జగన్‌కు ఎదురేగి స్వాగతం పలికారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఎలాగైనా సరే జగన్‌ను కలవాలనే కాంక్షతో అనేక చోట్ల కొండగుట్టలెక్కి ఎదురు చూడడం గమనార్హం. ఓ వైపు వర్షం పడుతున్నా లెక్క చేయకుండా ఉదయం 8 గంటల నుంచే జనం ఇడుపులపాయకు రావడం మొదలైంది.

ఆ తర్వాత వర్షం తెరిపివ్వడం, వాతావరణం చల్లబడటంతో 9 గంటల కల్లా ఇడుపులపాయలోని వైఎస్‌ జగన్‌ నివాసం, ఇడుపులపాయ ప్రాంగణం ప్రజలు, కార్యకర్తలు, నాయకులతో కిక్కిరిసిపోయింది. ఉదయం సరిగ్గా 9.15 గంటలకు అమ్మ విజయమ్మ నుంచి జగన్‌ ఆశీస్సులు అందుకున్నారు. ఆ తర్వాత చెల్లి షర్మిలమ్మ ఆత్మీయ పలకరింపు అనంతరం 9.27 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి వైఎస్సార్‌ ఘాట్‌కు చేరారు. అక్కడ తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు. అప్పటికే ఆ ప్రాంతం యువత కేరింతలు.. అభిమానుల నినాదాలతో మార్మోగిపోతోంది. వారికి ముకుళిత హస్తాలతో అభివాదం తెలుపుతూ ఉదయం 9.55 గంటల ప్రాంతంలో తొలి అడుగులు వేసి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.

అక్కడి నుంచి ఇడుపులపాయ రహదారిపై ఏర్పాటుచేసిన బహిరంగ సభాస్థలికి రావడానికే సుమారు గంట సమయం పట్టిందంటే జనం ఎంతగా పాదయాత్రను ఆదరిస్తున్నారో అర్థంచేసుకోవచ్చు. 11.18 గంటలకు జగన్‌ వేదికపైకి చేరుకుని  ప్రసంగం ప్రారంభించారు. సుమారు 40 నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో తాను పాదయాత్రను ఎందుకు చేపట్టాల్సి వచ్చిందో, యాత్ర లక్ష్యమేంటో వివరించడంతో పాటు ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యం చెందడం వల్లే తానీ యాత్రను చేపట్టాల్సి వచ్చిందని వివరించారు. తనను రాజకీయాల నుంచి దూరం చేసేందుకు చంద్రబాబు కుట్రలు, కుయుక్తులు చేస్తున్నా ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణే తనకు పెద్ద ఊరటని జగన్‌ అన్నప్పుడు సభికులు హర్షధ్వానాలు చేశారు. ప్రసంగానంతరం  జగన్‌మోహన్‌రెడ్డి తన యాత్రను కొనసాగించారు. పార్టీ అగ్రనేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంఎల్‌సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, సహచరులు, వేలాది మంది కార్యకర్తలు వెంట రాగా ఆయన తన తొలిరోజు పాదయాత్రను కొనసాగించారు.

పోటెత్తిన అభిమానం
జగన్‌ పాదయాత్ర వైఎస్సార్‌ సీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. జనం లక్షలాదిగా తరలివచ్చారు. రాష్ట్రంతో పాటు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ప్రాంతాల నుంచి కూడా అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ అన్ని శ్రేణుల నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. బైకు ర్యాలీలతో వచ్చిన యువకులు.. ‘జగనన్నా.. నువ్వే రావాలన్నా..’ అంటూ నినదించారు. జగన్‌ చిత్రం, ప్రజా సంకల్పం పేరు ముద్రించిన టీ షర్ట్‌లను ధరించిన వలంటీర్లు వైఎస్సార్‌ సీపీ పతాకాలు చేబూని పాదయాత్రకు ముందు వేలాదిగా కదంతొక్కారు.  ట్రాఫిక్‌ పూర్తిగా స్తంభించిపోయింది.    క్రమబద్ధీకరించేందుకు పోలీసులు లేకపోవడం గమనార్హం. 

మరిన్ని వార్తలు