‘రాజన్న రాజ్యం వస్తుంది, అధైర్యపడొద్దు’

25 Nov, 2017 13:11 IST|Sakshi

సాక్షి, చెరుకులపాడు : ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు విశేష ఆదరణ లభిస్తోంది. పాదయాత్రలో భాగంగా  పత్తికొండ నియోజకవర్గం చెరుకులపాడు చేరుకున్న ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. రాజన్న తనయుడి రాక సందర్భంగా భారీగా జనం తరలివచ్చారు. అన్న వస్తున్నాడు అంటూ వైఎస్‌ జగన్‌కు జేజేలు పలికారు. అలాగే  టీడీపీ పాలనలో తాము పడుతున్న తమ సమస్యలను వైఎస్‌ జగన్‌కు  వివరించారు. వారి ఇబ్బందులను

సావధానంగా విన్న ఆయన....త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందని, అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. అనంతరం అశేష ప్రజాభిమానం నడుమ అక్కడ పార్టీ జెండా ఆవిష్కరించారు. అలాగే ఎద్దుల బండి ఎక్కి చెర్నాకోలా చేతబట్టిన జగన్‌ను చూసి ప్రజలు పెద్ద పెట్టున నినాదాలు చేయగా, యువత ఉత్సాహంతో ఈలలు వేస్తూ తమ అభిమానం చాటుకున్నారు. అలాగే ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురైన పార్టీ నేత చెరుకులపాడు నారాయణరెడ్డి సమాధిని వైఎస్‌ జగన్‌ సందర్శించి, నివాళులు అర్పించారు.

పాదయాత్రలో భాగంగా కృష్ణాగిరి మండలం వైఎస్‌ జగన్‌ను ....జైపాల్‌ రెడ్డి అనే దివ్యాంగుడు కలిశాడు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక దివ్యాంగుల పెన్షన్లను రూ.1500 నుంచి రూ.3000కి పెంచాలని కోరారు. దాంతో పాటు రేషన్‌ షాపుల ద్వారా అందిస్తున్న బియ్యాన్ని 35 కేజీలకు పెంచాలని కోరాడు. జైపాల్‌ రెడ్డి అభ్యర్థనకు వైఎస్‌ జగన్‌ సానుకూలంగా స్పందించారు.

సమస్యలు చెప్పుకున్న మహిళలు
అంతకు ముందు వెల్దుర్తిలో  వైఎస్‌ జగన్‌ను... కలిసిన మహిళలు తమ సమస్యలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా  ప్రభుత్వ సహకారం, బ్యాంకు రుణాలు గురించి మహిళలను జగన్ అడిగి తెలుసుకున్నారు. రుణాలు అందుతున్నాయా లేదా అని ప్రశ్నించారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం వచ్చిందా లేదా అని అడిగారు.  దీనికి రుణాలు అందలేదని..బంగారం బ్యాంకులోనే ఉందని ముక్తకంఠంతో చెప్పారు. చంద్రబాబు నిలువునా ముంచేశారని వాపోయారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే సున్నా, పావలా వడ్డీలు ...రావడం లేదని వివరించారు. పార్టీ అధికారంలోకి వస్తే తాము అమలు చేయబోయే పథకాల గురించి జగన్‌ ఈ సందర్భంగా మహిళలకు హామీ ఇచ్చారు.

జగన్‌ను కలిసిన ముస్లిం సోదరులు
తమను టీడీపీ ప్రభుత్వం పూర్తిగా దగా చేసిందని మైనార్టీ సోదరులు ప్రతిపక్షనేతకు విన్నవించుకున్నారు. రిజర్వేషన్తొ పాటు మసీదుల్లో పనిచేసే వారికి ఇచ్చే జీతాల విషయంలో కూడా మోసం చేశారని తెలిపారు. దీనిపై స్పందించిన ప్రతిపక్షనేత తమ పార్టీ అధికారంలోకి రాగానే అని సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. అలాగే విద్యుత్‌ శాఖ కాంట్రాక్ట్‌ ఉద్యోగులు కూడా జగన్‌ను కలిశారు. తమ ఉద్యోగాలు క్రమబద్ధీకరిస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలపై వైఎస్‌ జగన్‌కు వినతిపత్రం సమర్పించారు.

చెరుకులపాడు, పుట్లూరు, తొగరచేడు క్రాస్‌ మీదగా మధ్యాహ్నానికి వైఎస్‌ జగన్‌ కృష్ణగిరి చేరుకుంటారు. అక్కడే భోజన విరామం తీసుకుంటారు. తిరిగి యాత్రను కృష్ణగిరి మీదుగా రామకృష్ణాపురం వరకూ కొనసాగిస్తారు. పాదయాత్రలో భాగంగా సాయంత్రం కృష్ణగిరి గ్రామస్తులతో ....వైఎస్‌ జగన్ ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం రామకృష్ణాపురం వరకు నడక సాగించి...రాత్రికి  అక్కడే బస చేస్తారు. 

మరిన్ని వార్తలు