జోరువానలోనూ వైఎస్‌ జగన్‌ పర్యటన!

1 Jul, 2017 19:23 IST|Sakshi
వై. రామవరం: ఏజెన్సీ ప్రాంతాల్లో అష్టకష్టాలు పడుతున్న గిరిజనుల గోడు తెలుసుకునేందుకు తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఒకవైపు జోరు వాన కురుస్తున్నా.. ఏమాత్రం లెక్క చేయకుండా ఆయన జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.

వై.రామవరం మండలం కడారికోట గ్రామంలో గిరిజనులతో సమావేశమై.. వారి గోడు ఆలకించిన వైఎస్‌ జగన్‌.. అక్కడి నుంచి నేరుగా చాపరాయికి బయలుదేరారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా కారణంగా చాపరాయిలో 16మంది గిరిజనులు మృతిచెందిన సంగతి తెలిసిందే. రాజమండ్రికి 150 కిలోమీటర్ల దూరంలోని చాపరాయికి చేరుకున్న వైఎస్‌ జగన్‌.. అక్కడ గ్రామస్తులతో సమావేశమయ్యారు. వారిని పరామర్శించి.. వారి కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు. దాదాపు గంటకుపైగా వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీరుపై చాపరాయి గ్రామస్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు వ్యాఖ్యలపై చాపరాయి సర్పంచి ఆగ్రహం వ్యక్తం చేశారు. చాపరాయిలో గిరిజనుల మరణాలపై మంత్రి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడాన్ని తప్పుబట్టారు. చాపరాయి గ్రామస్తుల గోడును ఆలకించిన వైఎస్‌ జగన్‌.. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో వైఎస్‌ జగన్‌ వెంట ఎమ్మెల్యేలు వంతల రాజేశ్వరి, గిడ్డి ఈశ్వరి, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తదితరులు ఉన్నారు.
 
అంతకుముందు తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా వైఎస్‌ జగన్‌ శనివారం ఉదయం రంపచోడవరంలో అనారోగ్యం పాలైన గిరిజనులను పరామర్శించారు. అనంతరం మరేడుమిల్లిలో వైఎస్‌ జగన్‌ పర్యటించారు. ఆ తర్వాత వై.రామవరం మండలం కడారికోటలో గిరిజనులతో జననేత మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. 'ఏడాదికాలంలో మూడుసార్లు ఏజెన్సీ ప్రాంతానికి వచ్చా. నేను వస్తున్న ప్రతిసారి చంద్రబాబు ప్రభుత్వం ఏదో ఒకటి చేస్తున్నట్టు ప్రకటనలు చేస్తున్నది. ఇది చేస్తున్నాం. అది చేస్తున్నా అని ప్రచారం చేసుకుంటున్నారు. తీరా నేను వెళ్లిపోయిన తర్వాత ఏమీ జరగడం లేదు' అని మండిపడ్డారు.

'ఒక నెల రోజుల వ్యవధిలో 16మందికిపైగా గిరిజనులు చనిపోయారు. ఇంత జరుగుతున్నా.. మాకు తెలియదని మంత్రులు చెప్తున్నారు. ప్రభుత్వాస్పత్రిల్లో 35మంది చికిత్స తీసుకుంటుంటే తెలియదంటున్నారు. వైద్య సిబ్బంది ఎవరు వచ్చినా వెంటనే బదిలీలపై వెళ్లిపోతున్నారు. కొత్తవారిని నియమించకుండానే రిలీవ్‌ చేసేస్తున్నారు. గ్రామాల్లో వైద్య సిబ్బంది లేని పరిస్థితి. 11 మండలాలకు 7 అంబులెన్సులు మాత్రమే ఉన్నాయి. వాటికి డీజిల్‌ అందుబాటులో ఉండటం లేదు. పనిచేసే సిబ్బందికి జీతాలు ఇవ్వడం లేదు' అని వైఎస్‌ జగన్‌ అన్నారు.
 
'మనుషులు పిట్టల్లా రాలిపోతున్నా.. పట్టించుకోరా..?, బియ్యం కోసం గిరిజనులు కొన్ని కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి నెలకొంది. గిరిజనులకు చాలీచాలని బియ్యాన్ని ఇస్తున్నారు. సబ్బులు కొంటేనే బియ్యాన్ని ఇస్తామని చెప్పడం దారుణం. చిన్న పిల్లలకు రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇక్కడ ఎవరికీ పౌష్టికాహారం అందడం లేదు. గిరిజనులకు నీళ్లు లేవు, సరైన రోడ్డు సౌకర్యం లేదు. గిరిజన సలహా మండలి ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. ప్రభుత్వం ఆ పని చేయలేదు. గిరిజన నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు గెలిచారన్న కారణంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మరీ గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేయలేదని స్పష్టమవుతోంది. ఎందుకంటే సీఎం చంద్రబాబుకు పేదవాడంటే కోపం. అందరికీ కేవలం వైఎస్ఆర్ హయాంలోనే మేలు జరిగిందన్న మాట వాస్తవం. ఒక్క వైఎస్ఆర్ హయాంలోనే 20 నిమిషాల్లోనే అంబులెన్స్ వచ్చి వైద్యం అందించేదని' వైఎస్ జగన్ గుర్తుచేవారు.