పడవ ప్రమాద ఘటనపై వైఎస్‌ జగన్‌ తీవ్ర విచారం

15 May, 2018 23:59 IST|Sakshi
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

సాక్షి, దెందులూరు(పశ్చిమ గోదావరి జిల్లా): దేవీపట్నం పడవ ప్రమాద ఘటనపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనపై వివరాలు తెలుసుకోవడంతోపాటు, బాధితులకు సహాయం అందేలా చూడాలని స్థానిక పార్టీ నాయకులకు ఆదేశాలు జారీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలో జరిగిన పడవ ప్రమాద ఘటనపై పార్టీ తరఫున కమిటీని వైఎస్‌ జగన్‌ ఏర్పాటు చేశారు. వైయస్‌ జగన్‌ కమిటీలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు, ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్‌ చంద్రబోస్, ఆళ్లనాని, మాజీ ఎమ్మెల్యే బాలరాజు, జక్కంపూడి విజయలక్ష్మి , తూర్పుగోదావరి జిల్లా వైయస్సార్‌సీపీ యువజన నాయకులు అనంత్‌ ఉదయ్‌భాస్కర్‌లు ఉన్నారు.

ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవాలని వైయస్‌ జగన్‌ వారికి సూచించారు. బాధితులకు అండగా ఉంటూ, ప్రభుత్వం నుంచి బాధితులకు సహాయం అందేలా చూడాలని పార్టీ నాయకులను జగన్‌ ఆదేశించారు. తరచుగా బోటు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? గతంలో జరిగిన ఘటనల కారణాలు ఏంటి? ప్రభుత్వం ఎందుకు ఈ ప్రమాదాలను నియంత్రించలేకపోతోంది? తదితర అంశాలపై వివరాలు తెలుసుకోవాలని పార్టీ నాయకులకు సూచించారు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో ప్రజాసంకల్పయాత్ర శిబిరం నుంచే పార్టీ నాయకులకు వైఎస్‌ జగన్‌ ఈ ఆదేశాలు జారీ చేశారు.  

మరిన్ని వార్తలు