జగన్ దీక్ష భగ్నం

1 Sep, 2013 01:38 IST|Sakshi
జగన్ దీక్ష భగ్నం

బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించి.. ఏడు రోజుల నిరాహార దీక్షను భగ్నం చేసిన నిమ్స్ వైద్యులు
 
సాక్షి, హైదరాబాద్: అన్ని ప్రాంతాల వారికీ సమన్యాయం చేయాలని, అలా చేయలేకుంటే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలన్న డిమాండ్‌తో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో నిమ్స్ ఆసుపత్రి వైద్యులు శనివారం ఆయనకు బలవంతంగా ఫ్లూయిడ్స్(గ్లూకోజ్) ఎక్కించారు. దీంతో వారం రోజులుగా ఆయన చేస్తున్న నిరాహార దీక్షను భగ్నం చేసినట్లయింది. ఆగస్టు 25వ తేదీ ఉదయం 6 గంటల నుంచి నిరవధిక నిరాహార దీక్ష మొదలుపెడుతున్నట్లు పార్టీ నాయకులతో చెప్పిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిజానికి అంతకు ముందు రోజు సాయంత్రం 6 గంటల నుంచీ ఆహారం ముట్టలేదు. దీంతో, శనివారం మధ్యాహ్నం దీక్ష భగ్నమయ్యే వరకు మొత్తం 163.30 గంటలపాటు జగన్‌మోహన్‌రెడ్డి నిరాహార దీక్ష చేసినట్లయింది.
 24వ తేదీ నుంచి జగన్‌మోహన్‌రెడ్డి మెతుకు ముట్టకపోవడం, ఆరోగ్యం క్షీణించడంతో 29వ తేదీ అర్ధరాత్రి ఆయన్ను అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉస్మానియా ఆసుపత్రికి తరలించడం, అక్కడ కూడా ఆయన దీక్ష విరమించకపోవడం, ఉస్మానియాలో తగిన వైద్య సదుపాయాలు అందుబాటులో లేని నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఆయన్ను నిమ్స్ ఆసుపత్రికి తరలించడం తెలిసిందే. అయితే అప్పటికే ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. దీంతో కుటుంబ సభ్యులతో పాటు అభిమానుల్లో అనుక్షణం ఉత్కంఠ నెలకొంది. శనివారం ఆయన దీక్ష ఏడో రోజుకు చేరింది. నిమ్స్ ఎమర్జెన్సీ వార్డులో రూమ్ నం.132లో ఉన్న జగన్‌మోహన్‌రెడ్డిని పలువురు వైద్యులు పలుసార్లు ఫ్లూయిడ్స్ ఎక్కించడానికి సహకరించాల్సిందిగా కోరారు. కనీసం ద్రవాహారమైనా తీసుకోవాలని సూచించారు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, ఇక ఆలస్యం చేస్తే ప్రమాదకరమని వారు పదే పదే చెప్పినా ఆయన తిరస్కరించారు. దీంతో ఇటు వైద్యుల్లో ఏం చేయాలనే ఆందోళన మొదలైంది. శనివారం ఉదయం 10 గంటల సమయంలో జగన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. డాక్టర్ నగేష్ మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌మోహన్‌రెడ్డి బీపీ, చక్కెర నిల్వలు, పల్స్‌రేటు పడిపోయాయని, ఏమాత్రం ఆలస్యం చేసినా అపాయకర పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు. ఓ వైపు ఆరోగ్యం తీవ్రంగా క్షీణిస్తున్నా.. దీక్ష కొనసాగిస్తానని జగన్‌మోహన్‌రెడ్డి చెబుతున్నారని వైద్యులు ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగా మరింత ఆందోళన మొదలైంది.
 
 జైళ్ల సూపరింటెండెంట్‌కు లేఖ
 జగన్ ఆరోగ్య పరిస్థితి విషమించిందని, దీనిపై నిర్ణయం తీసుకునేందుకు ఆదేశాలివ్వాలని నిమ్స్ వైద్య బృందం ఉదయం 11 గంటలకు చంచల్‌గూడ సూపరింటెండెంట్‌కు లేఖ రాసింది. అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించామని, ఆయన ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారని, తక్షణమే నిర్ణయం తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే కళ్లు తిరిగి పడిపోయారని, ముఖ్యంగా పల్స్ రేటు భారీగా పడిపోయిందని, ద్రవాహారం ఇవ్వబోతే నిరాకరిస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు.
 
 తక్షణమే ఫ్లూయిడ్స్ ఎక్కించండి
 చంచల్‌గూడ జైల్లో ప్రత్యేక తరగతి ఖైదీగా ఉన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తక్షణమే బలవంతంగానైనా ఫ్లూయిడ్స్ ఎక్కించాలని చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్ బి.సైదయ్య.. వైద్యులను ఆదేశించారు. ఉదయం 11.30 గంటలకు ఆయన నిమ్స్ వైద్య బృందానికి లేఖను ఫ్యాక్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ జైలు నిబంధనల చట్టంలోని రూల్ 593 ప్రకారం జైల్లో ఉన్న వ్యక్తి ఆహారం తీసుకోవడం లేదంటే అది ఆత్మహత్యకు దారితీస్తున్నట్టు పరిగణించాల్సి ఉంటుంది. కాబట్టి తక్షణమే ఆయనకు బలవంతంగానైనా ఫ్లూయిడ్స్ ఎక్కించి ఆరోగ్యాన్ని పరిరక్షించాలని వైద్యులకు సైదయ్య లేఖ పంపారు. అనంతరం వైద్యులు విలేకరులతో మాట్లాడుతూ జైలు అధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డికి తక్షణమే ఫ్లూయిడ్స్ ఇవ్వకుంటే ఏ క్షణాన్నయినా ఏమైనా జరగొచ్చని, ఫ్లూయిడ్స్ ఇచ్చినా కొన్ని రోజుల వరకు ఆయన సాధారణ స్థితికి రావడం సందేహమేనని చెప్పారు.
 
 ఫ్లూయిడ్స్ ఇచ్చి దీక్ష భగ్నం
 జైలు అధికారుల నుంచి ఆదేశాలు రాగానే జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్న నిమ్స్ వైద్యులు శ్రీభూషణ్ రాజు(నెఫ్రాలజీ), శేషగిరిరావు (కార్డియాలజీ), వైఎస్‌ఎన్ రాజు(జనరల్ మెడిసిన్), నగేష్(ఆర్థోపెడిక్)లు బలవంతంగానైనా ఆయనకు ఫ్లూయిడ్స్ ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో శనివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో నార్మల్ సెలైన్ ఎక్కించారు. సెలైన్ ఎక్కించే సమయంలో కూడా ఆయన తన దీక్షను భగ్నం చేయవద్దని, దయచేసి దీక్ష కొనసాగిస్తానని అన్నారని వైద్యులు పేర్కొన్నారు. కానీ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిందని, ఫ్లూయిడ్స్ తీసుకుంటూ దీక్ష కొనసాగించవచ్చునని వైద్యులు జగన్‌తో అన్నారు. దీనికి జగన్ స్పందిస్తూ.. మీరు ఫ్లూయిడ్స్ ఇచ్చిన తర్వాత దీక్ష కొనసాగించడమంటే అది మనస్ఫూర్తిగా చేసినట్టు కాదని గుండెల మీద చెయ్యేసి చెప్పారని వైద్యులు పేర్కొన్నారు. విధిలేని పరిస్థితుల్లో ఆయనకు ఫ్లూయిడ్స్ ఇచ్చి దీక్ష భగ్నం చేసినట్టు వైద్యులు తెలిపారు.
 

>
మరిన్ని వార్తలు