వైఎస్‌ జగన్‌ సంఘీభావం

7 Apr, 2018 03:42 IST|Sakshi

తెనాలి: రాష్ట్ర ప్రయోజనాల కోసం పదవులను త్యాగం చేసిన పార్లమెంట్‌ సభ్యులకు మనమంతా అండగా ఉండాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని సంగం జాగర్లమూడి వద్ద ఏర్పాటు చేసిన బస వద్ద శుక్రవారం రాత్రి పార్టీ నాయకులతో కలసి ఆయన కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొన్నారు. ఆమరణ దీక్షకు దిగిన పార్టీ ఎంపీలకు సంఘీభావం తెలిపారు.  

మద్దతు తెలిపిన హైకోర్టు న్యాయవాదులు
ఇదిలా ఉండగా.. ఆమరణ దీక్షకు దిగిన వైఎస్సార్‌సీపీ ఎంపీలకు హైకోర్టు న్యాయవాదులు(ఏపీ) సంఘీభావం ప్రకటించారు. శుక్రవారం మధ్యాహ్నం హైకోర్టు బయట ర్యాలీ నిర్వహించి.. ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నినాదాలు చేశారు.  

మీకు అండగా మేముంటాం..
ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న పోరాటం మరింత ఉధృతమయ్యింది. హోదా సాధనే లక్ష్యంగా ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఆమరణ దీక్షకు దిగిన వైఎస్సార్‌సీపీ ఎంపీలకు ప్రజలు బాసటగా నిలిచారు. పార్లమెంట్‌ వేదికగా కేంద్రంపై అలుపెరుగని పోరాటం చేసి.. రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ పదవులను తృణప్రాయంగా వదిలేసిన ఎంపీలకు సంఘీభావం తెలిపారు. మీ వెంట మేమున్నామంటూ రాష్ట్రవ్యాప్తంగా కొవ్వొత్తుల ప్రదర్శనలు చేపట్టారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులతో పాటు వివిధ ప్రజా సంఘాలు, విద్యార్థులు యువకులు ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పలుచోట్ల బైక్‌ర్యాలీలు నిర్వహించగా.. మరికొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక హోదా కోసం పూజలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్రానికి వెంటనే ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు